పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆమె అంతటా కలియ చూచి, వసంతదేవుని కనుగొనును.

మన్మథుడు : వేశాను వేశాను పూలబాణాలూ

రతి : వలపుబందాలతో కట్టివేశాను.

గంధవతి : కమ్రకాంక్షల వీరి కలయనింపాను.

మలయ : కాంక్షలో నునుమొగ్గ విరియ జేశాను.

వనదేవి ఆసనంనుండి దిగి తూలుతూ నాట్యమాడుతూ ముందుకు వస్తుంది. ఆమె చుట్టూ గంభీర శృంగార తాండవం చేస్తాడు వసంతుడు. ఆమె వారిస్తూ, నీవెవరవంటుంది. అభినయంలో వసంతుడు దివ్యప్రణయ విలాసతాండవోద్వేగాన దృతగతితో ఆమెను సమీపిస్తాడు.

వసంతుడు : నినువిడిచి మనజాల
            కనుతెరచి చూడవే!

వనదేవి : వ్రీడావతిని నేను
         చూడవో ఆమనీ

వసంతుడు : నీ హృదయమున నన్ను
            దాచుకొంటాను.

ఇరువురు అద్భుత నాట్యమొనర్చి ఒకరి కౌగిలిలో ఒకరు కరిగి పోతారు. తక్కిన వారంతా అనుగుణంగా నాట్యం చేస్తారు.

ఈ పవిత్ర సంఘటన తారానికకు జ్ఞప్తికిరాగా, నవ్వుకొంటూ శాంతిశ్రీ మహా రాజకుమారి రథం ప్రక్కనే అశ్వారూఢురాలయి వస్తూ ఉన్నది.

9

రెండురాత్రిళ్ళు పగళ్ళూ ప్రయాణంచేసి శాంతిశ్రీకుమారి సైన్యమూ ఆ వెనుక వీరపురుషత్తుని సైన్యమూ బ్రహ్మదత్తప్రభువు సైన్యమును చేరారు. బ్రహ్మదత్తుని సైన్యాన్ని చేరేసరికి తూర్పున ఉషాబాల కెంపుచీర ధరించి తాండవిస్తున్నది. ఆమెకు వెనుకనే దిశాబాలికలు అరుణవస్త్రాలతో హంగు చేస్తున్నారు.

శాంతిశ్రీ వచ్చేసరికి ఆమె సైన్యాలకై విడిదులు ఏర్పాటై శిబిరము నిర్మాణమై ఉన్నది. చక్రవర్తి ఆశ్వికవార్తాహరులను ఇదివరకే పంపి ఉన్నారు. శాంతిశ్రీకుమారి తన శిబిరంలో ప్రవేశించి స్నానాదికాలు నిర్వర్తించి, ఎఱ్ఱచీర ధరించి స్తనదుకూలము అలంకరించి, శిరస్త్రాణతనుత్రాణములు ధరించి, గుఱ్ఱమెక్కి అంగరక్షక బాలికలు వెంటరా, కొందరు సేనాపతులు దారిచూప బ్రహ్మదత్తుని శిబిరానకుపోగానే అంతకుముందే బ్రహ్మదత్త ప్రభువు రాయబారానికై ఒక్కడే పులమావి స్కంధావారానికి వెళ్ళినారని అక్కడి దళపతులు ఆమెకు మనవిచేసినారు.

అడివి బాపిరాజు రచనలు - 6

153

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)