పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

        ఆ మూర్తి పోలికలు
        ఏమానినిలో తోచు
        ననుచూచి నవ్వెదవు
        నాతీ నేనేమంటి?
ఆ చిత్రమూర్తిలో
తోచు నా బింబమని
ఏల ఊహింతువే
మేల మెందుకె నాతో
        నాదు ప్రతిబింబాన
        నన్నుమించెను సొగసు
        సుంతైన నేగాను
        సుందరమె ఆ మూర్తి !"

ఏమిటీ ఈ పాటకర్థం? నేను నా గురుపు హృదయంలో చిత్రింప బడలేదు గదా? ఇదేమి పిచ్చిభావము? హృదయంలో చిత్రమేమిటి? ప్రణయవశులగు యువతీ యువకుల హృదయాలలో పరస్పరమూర్తులు చిత్రితమవుతాయట. ఆ చిత్రాలు ఉత్ప్రేక్షలట. ప్రకృతిలోని వంకరలు చిత్ర కారుడు దిద్ది శ్రుతి చేస్తాడట. స్వరశ్రుతిసమ్మేళనం చేసి సంగీతతపస్వినీ తపస్వులు ప్రకృతి ధ్వనులలో నుండి గాంధర్వం ఉద్భవింపచేసారట. సంగీతమేమిటి? చిత్రలేఖనమేమిటి? కవిత్వమేమిటి? అవి కాముని చేతి ఆయుధాలు. వీనివల్ల జగజ్జీవి వంచితుడౌతాడేగాని, అవి ఉత్తమ నిర్వాణ సాధనా లెట్లా అవుతాయి?

కాని ఒక్కసారిగా ఈ దినమున అవి తనకు ఎదో ఆనందం కలుగ జేస్తున్నాయి. ఆనందం అంటే పులుపు అంటే తీపి అంటే అనుభవించినవారే తెలుసుకుంటారు. ఈ దినాన పాటకై తన హృదయం? పొద్దుపొడుపు పూవులా తిరిగిందే. ఆ నిండుజవ్వనికి ఏమీ అర్ధం అవటంలేదు. ఆమె తన భవనంలోకి వెళ్ళడం మానివేసింది. భయపడిన హరిణిలా అంతా కలియచూచింది. ఈ పది నిమేషములలో మబ్బుకప్పిన చంద్రుని వెన్నెలలా ఆమె శాంతి మాయమయింది. ఆ బాలికాహరిణము ఇటూ అటూ చూసింది. కళ్ళు చెదిరినాయి. అపరిచితమయిన ఒక నూత్న స్పందనము దిశలనుండి తుంపరలు కురుస్తున్నది. ఆ అనుభూతి సుఖమా, దుఃఖమా? ఆమె తన్ను తాను మనోదర్పణంలో చిన్నబిడ్డలా చూచుకొన్నది.

లోకంలో ఆనందం వెన్నెలలా ప్రతివస్తువునూ స్పృశిస్తుంది అన్న సత్యం ఆమెకు గోచరించింది. వెన్నెల స్పృశించిన వస్తువు వేరు, వెన్నెలలో ఉన్న వస్తువు ప్రక్కల, అడుగున చీకటి ఉండుగాక. ఆ చీకటికి నీడ అని వేరే అర్థం వస్తుంది. ఆ వెన్నెలకున్న వ్యక్తిత్వంవలెనే నీడకూ వ్యక్తిత్వం వస్తుంది. బ్రహ్మదత్తప్రభువు తనకు చంద్రుడా? అది ఏమి వెఱ్ఱి ఆలోచన అని ఆమె అనుకుంది. ఇలా ఆమె మనస్సులో అనుకోవడం ఎవరూ వినలేదు కదా? ఆమె నలుదిక్కులు పరికించింది. ఇదీ అర్థంలేని ఆలోచనే. ఈ ఆలోచన ఎందుకు కలగాలి? అంతఃకరణ ప్రవృత్తులే లేని ఆ బాలిక జీవిత ప్రదేశానికి చిత్తవికార మహానది పొంగి

అడివి బాపిరాజు రచనలు - 6

138

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)