పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వసైన్యాలతో విజయపురంపై విరుచుకుపడతాడు. అప్పటికిగాని అతని సార్వభౌమ కాంక్షకు తృప్తి కలుగదు. అతనికీ తెలుసును. ఆంధ్ర సార్వభౌమునికి ఉన్న బలం అంతా ఇక్ష్వాకు మహారాజు అని. ఇక్ష్వాకులు ఓడిపోయి, వారి రాజకుమారి భార్యగా దక్కితే ఇంక చక్రవర్తి ఏమి లెక్క అని ఆలోచించాడు. అందుకనే చక్రవర్తి ఆయువు పట్టయిన ఇక్ష్వాకులను ఓడించి వారి బాలికను చెట్టబట్టితే మన మహారాజు పులమావికి కోటికోటల బలం అవుతారుగా!” ఆ మాటలని బ్రహ్మదత్తుడు ఇంకొక పర్యాయం సభికుల నందరినీ పరిశీలించి చూచాడు.

“నా ఉద్దేశంలో మనం మన సైన్యాలు కొన్నింటిని తీసుకొని ప్రతిష్ఠానంనుంచి వచ్చే మహారాజపథం వెంటనే ముందుకుపోయి, మహానగరపురానికి ఎగువను ఉన్న కొండలలో వ్యూహం పన్నాలి. తక్కిన సైన్యాలన్నీ మన నగరం కావలికి ఉంచాలి. ఆ ఉంచడంలో నగరానికి అయిదుగోరుతాలు దూరంనుంచీ సైన్యాలు కాపాడుతూ ఉండాలి. తక్కిన సేనలు నగరంలో కావలికాస్తూ అప్రమత్తులయి ఉండాలి.” బ్రహ్మదత్తుడు సభ్యులనందరినీ ఒక్కసారి కలియచూచి మహారాజు వైపు తిరిగి తన చేతులు జోడించి, “మహారాజా! పులమావిని సంపూర్ణంగా ఓడించి ఇక్కడికి బంధించి తీసుకువస్తాము. మాకు సెలవు దయచేయ కోరుతున్నాను” అని ప్రార్థించాడు.

“ధనకప్రభు! మేమో?” మహారాజు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.

“తాము నగరంలో ఉండాలని ప్రార్ధన మహాప్రభూ! సరియైన జైత్రయత్ర రాబోతున్నది. అప్పుడు తామే నాయకత్వం వహించవలసి ఉన్నది” అని బ్రహ్మదత్తుడు మనవి చేసినాడు. వెంటనే సభ్యులు జయజయధ్వానములు చేసినారు.

ఆ మరునాటినుంచి ఇక్ష్వాకు సైన్యాలు సమకూర్చ ఆజ్ఞలు వెళ్ళినవి. సర్వసైన్యాలకు మహాసేనాపతి స్కందశ్రీ మహారాజు. వారి క్రింద సేనా పతులు చాళుక్యరాయనిక ప్రభువు, బ్రహ్మదత్తప్రభువు, వీరపురుషదత్త యువరాజు, పల్లవప్రభువు, శాంతిమూలమహారాజుకు బాసటగా నగర రక్షక మహాసేనాపతి అయినారు. విజయపురం ఎదుట కృష్ణకీవల ఇక్ష్వాకు సైన్యాలు పూంగీయ సైన్యాలు సమకూడుటకు సన్నాహాలన్నీ బ్రహ్మదత్తప్రభువు స్వయంగా చూచుకొంటూ ఉండెను.

ఇక్ష్వాకు సైన్యాలు పులమావిని ఎదుక్కొనేందుకు సంసిద్ధమౌవనీ శాతవాహన మహారాజు తమ సైన్యాలనన్నీ కులహాక ప్రభువు నాయకత్వము క్రింద పంపించి, తాము పులమావితో యుద్ధము కొంత సాగించిన వెనుక, ప్రక్కనుండి పులమావిని తాకవలసి ఉన్నదనిన్ని విజయశ్రీ చక్రవర్తికీ శాంతిమూలమహారాజు రహస్యవార్తను కులహాక ప్రభువునకిచ్చి పంపినారు.

8

రాజకుమారి శాంతిశ్రీ బ్రహ్మదత్తుని కోటకు ఒకదినాన తన రథముపై ఇరువురు చెలికత్తెలతో అంతఃపుర పాలకురాలితో విచ్చేసింది. ఆ ధనక ప్రభువు కోటయు మహారాజు కోటకు దీటయినదే. నగర గోపుర ద్వారాలు దాటి లోనికిపోగానే విచిత్రపుష్పవనము

అడివి బాపిరాజు రచనలు - 6

130

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)