పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మన మహారాజు ఏమిచేస్తాడో?”

“పులమావి పులుపు విరుస్తాడు.”

ఈ రకంగా ప్రజలు విడ్డూరాలుగా చెప్పుకొంటున్నారు. విజయశ్రీ శాతవాహన మహారాజు ఒకదాని వెనక ఒకటిగా, మొసలిపట్టిన గజేంద్రుని వలె, ఆక్రందనలు పంపిస్తూ ఉన్నాడు.

శాంతిమూలుని సభలో అడవి స్కందవిశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు పూంగీయ స్కందశ్రీ మహారాజు, హిరణ్యకరాష్ట్ర ప్రభువు, స్కందచాళుక్యరాయనికప్రభువు, హమ్మశ్రీదేవి భర్త పల్లవప్రభువు, కులహాక ప్రభువు, బౌద్ధాచార్యులు, మహాబుషిసత్తములవంటి బ్రాహ్మణులు అందరూ చేరినారు. బ్రహ్మదత్తప్రభువు సభలో పులమావి దండ యాత్రనుగురించి తెలిసిన సంగతులన్నియు, మహారాజుగారి పక్షాన సభికులందరికీ తెలియజేసి, ఇప్పుడు కర్తవ్యమేమిటి అని అడిగినాడు.

పూంగీప్రభువు: మనం సైన్యాలనుకూర్చుకొని వెంటనే వెళ్ళి పులమావినీ, అతని సైన్యాలనూ నాశనం చేయవలసి ఉన్నది.

కులహాకప్రభువు: మహాప్రభూ! నా మనవి ఈ అదను తప్పితే పులమావిని నెగ్గే అవకాశం దొరకదని.

చాళుక్యరాయనిక: మహాప్రభూ! మనం తొందరపడడం మంచిదికాదు. జాగ్రత్తలో పులమావిని ఏలా ఎదుర్కొనాలో నిర్ణయించుకోవాలి.

పల్లవప్రభువు: ఈ విషయంలో మనం ఆలోచించదగినది ఒకటి ఉన్నది. ఈ పులమావికి ఎక్కడనుంచి వచ్చింది ఈ బలం? ఎలా వైజయంతిని లోబరుచుకోగలిగాడు? ఎలా మహావేగంతో భరుకచ్చానికి పోయినాడు? ఇందులో ఏదో రహస్యం ఉంది. అది తెలుసుకుని మనం అతన్ని ఎదుర్కొనాలి.

యువరాజు వీరపురుషదత్తుడు: చిన్న మామయ్యగారూ! మనం నెమ్మదిగా ఆలోచించుకొనే లోపలే పులమావి ధాన్యకటకం మీదకువచ్చి పడిపోడా? కాబట్టి మనం వెళ్ళివాడు భరుకచ్చంనుంచి ప్రతిష్ఠానానికి రాకుండానే ఎదుర్కోవాలి.

బ్రహ్మదత్తుడు: వెనుక ఒకసారి ఈ పులమావి మనపట్టణం వచ్చి వసంతోత్సవంలో పాల్గొన్నాడు. మళ్ళీ పెద్దవర్తకుడుగా ఈ పట్టణం చొచ్చి అంతఃపురాలలో నగలమ్మి నాడట. వాడి ఉద్దేశము చూచాయగా నాకు అర్థం అయింది. ఇంతకూ పులమావి బలం నాశనం చేయాలంటే దానికి వేరే మార్గం ఉంది. అతనికి వచ్చిన బలముకంటె అతని శక్తిసామర్థ్యాల కంటె ఇవతల చక్రవర్తి బలహీనత ఒక కారణం. ఆ బలహీనతవల్ల సామంతులంతా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈతడు ఆ అదను చేజిక్కించు కొన్నాడు.

చాళ్ళురాయనిక: అయితే మీ ఆలోచన?

బ్రహ్మదత్తుడు ఒక నిమేషం ఆలోచించినాడు. చిరునవ్వు నవ్వు కొన్నాడు. “రాజకుమారి శాంతిశ్రీని అతడు భార్యగా వాంఛిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు మనుష్యులు ఆకాశంపైన చంద్రుణ్ణికూడా కోరుతారు. అతడు తిన్నగా ధాన్యకటకం వెళ్ళడు.

అడివి బాపిరాజు రచనలు - 6

129

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)