పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భంగం వచ్చే సమయంలో, తన బావమరదికి వసంతోత్సవాలా? అని కాలుగాలిన పిల్లిలా విజయచక్రవర్తి తిరగడం మొదలు పెట్టినాడు.

భరుకచ్చాధీశులైన అభీరులు రాజనీతిలో అపరచాణుక్యులు. వాళ్ళకు పులమావి భగవత్ప్రసాదితమైన ఆయుధంలా కనబడ్డాడు. విజయశ్రీని నిరసించి, పులమావే నిజమైన చక్రవర్తి అని వారు లోకానికి చాటినారు. అభీరపతి, చక్రవర్తి పులమావిని ఎదుర్కొని లోక సమ్మోహనకరమైన ఉత్సవాలు చేయించి తన సైన్యాలలో అర్ధాక్షౌహిణిని పులమావితో పంపినాడు. అభీర సైన్యాలూ పులమావి సైన్యాలూ కలిసి మాళవదేశం మీదకు దండెత్తి వెళ్ళినవి. మాళవులు కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి, పులమావిని ఎదుర్కొనడమా లేకపోతే, సాయం అవలంబించడమా? ఏలా సమకూర్చినాడో సైన్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. పులమావితో తుదకు సంధి కంగీకరించినారు.

పులమావి ఉప్పొంగిపోయినాడు. తనకు రాజకుమారి రుద్రభట్టారికను రాణిగా ఈయవలసిందని మాళవరుద్రసేన మహారాజుకు పులమావి రాయబారిని పంపినాడు. రుద్రసేనునకు రుద్రభట్టారికను పులమావికి ఉద్వాహం చేయడం ఇష్టంలేదు. ఈ విషయంలో ఆంధ్రచక్రవర్తికి త్వరలోనే వార్త పంపెదననిన్నీ, రుధ్రభట్టారికాకుమారి వసంతోత్సవాలకు శ్రీపర్వతస్థమైన విజయపురికి వెళ్ళి ఉన్నారనియు ఆమె అచ్చటనుండి రాగానే వివాహ విషయం నిశ్చయం చేసుకోవచ్చుననియు, మాళవపతి పులమావికి బదులు చెప్పి పంపెను.

పులమావి ఉజ్జయినినుండి బయలుదేరేవేళకు చైత్రమాసం మధ్యదినాలు. అప్పుడే వేసవికాలం ఆరంభించింది. రాత్రిళ్ళుమాత్రం కొంచెం చలివేస్తోంది. సాయంకాలాలు మత్తుగా ఉంటున్నాయి. విజయపరంపరచే పులమావిని నిజంగా వీరత్వం పొదివికొన్నది. అతని సైన్యాలు ఉత్తమ శిక్షణపొంది అతివేగంగా సునాయాసంగా ప్రయాణం చేస్తున్నవి. ఉజ్జయిని నుండి ములకదేవానికి పిడుగువలె వచ్చిపడ్డాయి.

ప్రతిష్ఠానగరంలో రాజప్రతినిధి యువరాజు చంద్రశ్రీ శాతవాహన మహారాజు ఇంకా వసంతోత్సవం జరుపుతున్నాడు. వేయిపూవులైనారు వేయి బాలికలు. తాను దివ్యవసంతుడు. ఆ వేయిబాలికలలలో కొంతమందిని ఒకనాడు గజరూపం వహింపుడని తాను వారిపై స్వారి వెడలినాడు. ఒక దినం కొందరు బాలికలు చిలుకరూపం వహిస్తే తాను మన్మథుడుగా ఊరేగినాడు.

5

చంద్రశ్రీ యువరాజు మన్మథుడుగా, మధుమాసాదిదేవుడు వసంతుడుగా ఇలా చిద్విలాసాలలో తేలిపోతూ ఉన్నాడు. ఒకదినం అనేక మనోహర రూపాలు కలిగినవీ, వివిధపుష్పాలంకృతులూ అయిన నదీ నౌకలలో విహారం బయలుదేరినాడు. హంసలవలె, శుకాలవలె, మొసళ్ళవలె మూర్తితాల్చిన ఆ నౌకలలో తన ప్రియాసహస్రంతో విహారం బయలుదేరినాడు. కొందరు బాలలు నాట్యం చేస్తున్నారు. కొందరు గాత్రాలతో పాడుతున్నారు. కొందరు వివిధ వాయిద్యాలు వాయిస్తున్నారు. కొందరు అర్ధనగ్నలై వివిధ విలాస భంగిమాలలో ఉన్నారు. నౌకలు గోదావరిలో సాగిపోతున్నాయి.

అడివి బాపిరాజు రచనలు - 6

124

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)