పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్న చిన్న పడవలలో అనేకులు నౌకచుట్టూ మూగినారు. నౌకపై పూంగీయజెండా, పసుపుపచ్చని కేతనమూ ఎగురుతూ ఉండడంవల్ల శుభము ఊహించి ఒక నావికుడు లేడిలా అతివేగంగా పరుగెత్తుకుంటూ కోటగోపురం కడకు వచ్చి అక్కడి రక్షకులతో శుభవర్తమానము తెచ్చానని చెప్పి, శరవేగంగా రాజభవన మహాకోట్య గోపురం దగ్గరకుపోయి, అక్కడి అంగరక్షకులతో చెప్పి, సభామందిరం ప్రక్కనున్న అంతఃపుర ద్వారంకడ ఆగి మహారాజునకు శుభవర్తమానం తెచ్చినానని తెలిపినాడు.

ఒక ద్వారపాలకుడు ఈ నావికుని వెంటబెట్టుకొని లోనికిగొనిపోయి, ఒక మందిరంలో నిలబెట్టి ఒక ప్రతీహారిచే మహారాజుగారికి శుభవర్తమానం విషయం మనవి చేయమని తెలిపినాడు. పూంగీయ స్కందశ్రీమహా రాజునకు వర్తమాన మందినది. వెంటనే వారు ఈ నావికుడున్న మందిరంలోనికి వచ్చినారు. నావికుడు సాష్టాంగపడి నమస్కరించి మహారాజుచే అనుజ్ఞాతుడై లేచి, “మహాప్రభూ! తప్పిపోయినదనుకున్న తమ నౌక వచ్చింది. ఆ ఓడ పసుపుపచ్చని జెండా ఎగురవేస్తూ వచ్చింది” అని మనవి చేసినాడు.

స్కందశ్రీ మహారాజునకు పట్టరాని సంతోషం వచ్చింది. తన మెళ్లో హారమూ, తన మొలలోని ఛురియా ఆ నావికునకు బహుమానమిస్తూ, అంతఃపుర పాలకుని రప్పించి ఆ నావికునకు వేయిపణాలు ఇప్పించినారు. మహారాజు వెంటనే తన కొమరుడు స్కందసాగరాయనునికీ శుభవార్త పంపినారు. స్కంద సాగరాయనకప్రభువు వెంటనే మహారాజు మందిరానకు రాగా వారిరువురూ చెరి ఒక రథంమీదా బయలుదేరి, మంత్రులు, సేనాపతులు వెంటరాగా తొందర తొందరగా ఓడరేవునకు వచ్చి చేరినారు. బ్రహ్మదత్తప్రభువు అప్పుడే ఓడనుండి దిగి తన విడిదికీ వార్తపంపడంవల్ల అక్కడనుండి వచ్చి పాదాలకెరగిన తన మంత్రిని సేనాపతిని చేతులుపట్టి లేపి తన హృదయానికి గాఢంగా అదుముకొన్నాడు. ఆ సమయంలో పూంగీయస్కందశ్రీ మహారాజూ, యువరాజు స్కందసాగరాయనక ప్రభువూ రావడం చూచినాడు. వెంటనే వేగంగా ముందుకుపోయి తాను స్కందశ్రీ మహారాజుపాదాల కెరిగినాడు. ఆయన బ్రహ్మదత్తుని లేవదీస్తూ,

“ప్రభూ! మీరు మళ్ళీ కనబడతారనుకోలేదు” అంటూ బ్రహ్మదత్తుని హృదయానికి గాఢంగా అదుముకొన్నారు. ఆ వెనుక స్కందసాగర ప్రభువూ స్కందవిశాఖాయనకప్రభువూ గాఢంగా కౌగలించుకొన్నారు.

2

శాతవాహన రథస్వామి అయిన పులమావి తానే చక్రవర్తి అని చెప్పుకొన్నా, పొగడించుకొన్నా శాంతిమూల మహారాజుకు అంతకోపం వచ్చి ఉండేదికాదు. కాని అతడు సార్వభౌమ సింహాసనం ఎక్కాడు అని తెలిసిన మర్నాడు నానాదేశ ప్రభువులకూ కప్పము కట్టవలసినదని శ్రీముఖాలు అందినవి. శ్రీ పులమావి శాతవాహనుడే సార్వభౌముడట. తన తండ్రి తాతలకుటుంబమే సరియైన చక్రవర్తి కుటుంబమట. యజ్ఞశ్రీ తన తండ్రిని మోసంచేసి సింహాసనం ఎక్కినాడట. అందుకని నేడు తాను సరియైన చక్రవర్తి అవడంవల్ల సింహాసనం ఎక్కినాడట. కాబట్టి సామంతులందరు ముసిక నగరం

అడివి బాపిరాజు రచనలు - 6

119

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)