పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమ భాగం

బోధి సత్వుడు

బుద్ధత్వం పొందే ప్రతిదివ్యుడూ అనేక బోధిసత్వావతారాలు పొంది దీనమానవ సహాయం చేస్తూ అష్టమార్గాలు తన జీవిత విధానంచే బోధించి అవతారం చాలిస్తూ ఉంటాడు. సిద్ధార్థుడై, శాక్యసింహుడై, బోధిసత్వుడై, అర్హతుడై, బుద్ధుడైన సమంతభద్రుడు ఈ సంపూర్ణావతారం ఎత్తకపూర్వం అనేక బోధిసత్వావతారా లెత్తి, వితరణం, సత్యచింతన, ధర్మచింతనాది మహాగుణాల తన జీవితంలో ప్రదర్శించాడు. శాక్యసింహుడై, బుద్దుడై లోకాన్ని ఉద్ధరించి తుషితలోకంలో ఉన్నవెనుక, ఆయన ఉత్తమశిష్యులలో మహోత్తముడైన మైత్రేయుడు బుద్ధావతారోన్ముఖుడయ్యాడు. అందుకై ఆయన బోధిసత్వుడై నాగార్జున దేవుడుగా అవతరించాడు.

నాగార్జునదేవుడే మహాసాంఘికవాదానికి తండ్రి. మహాసాంఘికవాదం అదివరకే ఉద్భవించినా, దానికి పుష్టికలుగచేసిన అవతారమూర్తి నాగార్జున దేవుడే. ఆ మహాపురుషుడు శుద్ధసాత్వికుడు. బౌద్ధధర్మమును మానవుల దుఃఖము, ఆర్తి, బాధతొలగించడానికై తధాగతుడు లోకానికి ప్రసాదించినారు. ఆలాగే వేదసంప్రదాయాదికాలు లోకానికి ప్రసాదింపబడినవి. లోకం ఎప్పుడూ సమ్యక్‌మార్గంమీద నడిచినప్పుడే లోకశాంతి. అందుకై పూజావైరుధ్యాలను మహాయాన ధర్మ ముపదేశించి సమన్వయంచేసినా డీ పరమపురుషుడు. అతడు అహింసా పరమావతారము. భారతదేశంలో మహాయుద్దాలు చేశాడు. వారి బోధిసత్వగాధలు ప్రజానీకంలో ఎడారిలో చల్లనినీరులా ప్రవహించినాయి. ఆ సత్యమూర్తి నుండివెడలిన చంద్రికాకాంతి లోకం అంతా శాంతి కాంతులతో ఉత్తేజితం చేసింది.

ప్రజలు తమ సంప్రదాయధర్మాన్ని వ్యక్తిగతం అని సంపూర్ణంగా గ్రహించారు. ధర్మం పేరున దారుణాలు జరపడం మానివేసిరి. ప్రజలు స్కందుని, రుద్రుని, విష్ణుని, ఇంద్రుని, బ్రహ్మను, సూర్యుని, అగ్నిని, తధాగతుని దీపాల తిన్నెలయిన చైత్యాలను అరమరిక లేకుండా పూజచేస్తున్నారు. నాగార్జునదేవుడు శతవృద్దయి పండులా తన ఆశ్రమంలో దివ్యమూర్తయి ఉన్నారు. దేశ దేశాలనుండి బౌద్ధభిక్షువులు, అర్హతులు, ఆచార్యులు, భదంతులు ఆ అవతారమూర్తిని దర్శించడానికి వస్తూ ఉంటారు. ఆలా దర్శించడానికి వచ్చినవారు దూరాన నుండే వారికి సాష్టాంగప్రణామాలిడి వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే ఆ బోధిసత్వావతారునితో మాట్లాడడానికి వీలు. ఎవరికి ఏ అనుమానంఉన్నా ఆ దివ్యరూపుని చూడగానే అవి రహితం అయిపోతవట. వచ్చిన భక్తులకు అతిథి సత్కారాలు నగర పంచాయతీ సంఘం చేస్తూ ఉంటుంది. ధర్మగిరిపై సంఘారామంలోనే అనేక అతిథిగృహాలున్నాయి. కొండక్రింద ఒక చిన్న గ్రామంలో ఉన్న భవనాలు అతిథులు ఉండడానికి కట్టినారు.

అడివి బాపిరాజు రచనలు - 6

110

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)