పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెందిన ఆ సంఘారామానికి బ్రహ్మదత్తప్రభువు తన అమాత్యుని పంపి కులపతి అయిన వినయ గౌతమ భిక్షాచార్యులను మరునాడుదయం దర్శించుటకు అనుజ్జపొందెను. - ఈ దినం ఉదయం బ్రహ్మదత్తప్రభువు ఆ సంఘారామం ప్రవేశించగానే సంఘారామ వ్యవహర్త అయిన భిక్షువు వారిని ఎదుర్కొని, వారి నమస్కృతులంది ప్రతి నమస్కారంచేస్తూ “బుద్ధం శరణం గచ్చామి” అని బ్రహ్మదత్తప్రభువును ఆ విహార మందిరాలలో నుండి ఒకచోట పోకవనంలో ఉన్న చిన్న పటకుటీరానికి కొనిపోయినాడు. ఆ పటకుటీరంలో కులపతి వినయగౌతమ భిక్కువాసం. వినయగౌతమభిక్కు చీనాదేశము నుండి వచ్చిన పవిత్రమూర్తి. సంస్కృత, ప్రాకృత, పాలి మొదలగు భాషలన్నీ అనర్గళంగా చదివి, అఖండ పాండిత్యము సంపాదించినాడు. ఆ వృద్ధ చైనీయ భిక్కునకు బ్రహ్మదత్త ప్రభువు నమస్కరించి, ఆయన చూపిన తుంగచాపపై అధివసించెను. బ్రహ్మదత్తప్రభువు చీనా మొదలగు దేశాలు, చైనీయుల ఆచార వ్యవహారాదులన్నీ తెలుసుకొన సాగినారు. వారిరువురకు వేదాంత విచార చర్చ జరిగినది.

స్వామిని ఒకసారి తప్పక విజయపురం దయచేయ మహారాజు శాంతిమూల ప్రభువు, మహారాణి మాఠరిసారసికాదేవీ ప్రార్థించినారని తెలిపెను. వినయగౌతమభిక్కు సంతోషం వెలిబుచ్చుతూ, తామీదివరకే రెండుమూడు పర్యాయాలు శ్రీశ్రీశ్రీ బోధిసత్వ నాగార్జున పరమార్హతుల ధర్శించామనీ, వారిని ఇంకొకపర్యాయం దర్శిస్తామనీ మహారాజునకూ, మహారాణికీ తమ ఆశీర్వాదాలు తెలియజేయండనీ తెలిపినాడు.

బ్రహ్మదత్తుడు సెలవు పుచ్చుకొని విడిదికిపోయి స్నానాదికాలు కావిచ్చి ఆ దినము తాను పూంగీమహారాజు స్కందశ్రీ ప్రభువుతో భోజనం చేయవలసి ఉన్నందన సముచిత వేషుడై, యువరాజు పూంగీయ స్కందసాగరనాగప్రభువు, ఇరువదిఏండ్ల యువకుడు తన్ను ఆహ్వానింప రాగా ఇరువురూ కలిసి మహారాజు అంతఃపురానికి వెళ్ళినారు. బంధు గృహంలో మహారాజు స్కందవిశాఖాయనక ప్రభువును సత్కరించినారు. బ్రహ్మదత్తప్రభువు మహారాజుకు నమస్కరించి దాసీజనము కాలుచేతులు కడిగి, మెత్తని వస్త్రాలచే తడియొత్త భోజనగృహానికి యువరాజు స్కందసాగర ప్రభువుతో జనినాడు.

సుందరాలంకార శోభితమగు భోజనగృహంలో మణులు పొదిగి, బంగారుతీగల పోగారించిన గంధతరు పీఠికలపై వారంద రధివసించినారు. స్కందశ్రీ ప్రభువు గురువులైన శివాచార్యులవారు ఎదురుగా మహాపీఠంపై అధివసించి ఉన్నారు. వారికి నమస్కరింనే బ్రహ్మదత్తప్రభువు అసనమలంకరించెను. ఉద్దండపండితులు, యజ్ఞయాగాదులొనర్చిన బ్రాహ్మణులూ వారితోపాటు కూరుచున్నారు. రాజబంధువులనేకులు వీఠాల అలంకరించినారు.

ఆ దినమున స్కందశ్రీప్రభువు బ్రహ్మదత్తప్రభువునకు ఇరువది నాలుగు శాకములు, పదునెనిమిది పచ్చళ్ళు, నూరుపిండివంటలు, ఎనిమిది క్షీరాన్నములు, నాలుగు పులుసులు, మూడువిధాలైన పెరుగులతో దేవతలు మెచ్చే విందు గావించెను. ఆంధ్రులవంట లోకాద్భుతమని అఖిలభారతవర్షమూ చెప్పుకుంటారు. ఆ దినాన వండినవంటకాలు నలభీములకు పాఠాలు నేర్పే మహత్తుకలవి. భోజనాలైనా వెనుక పదహారు విధాల తాంబూలాలు అర్పించారు స్కందశ్రీ ప్రభువు తమ అతిథులకు.

అడివి బాపిరాజు రచనలు - 6

93

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)