పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్ధభాగం

పూంగీ ప్రోలు

పూంగీప్రోలు సముద్రతీర మహాపురం. మోసలపురం, శ్రీకాకుళం, శంబరద్వీపము, కళింగపట్టణము, కురంగపురం, తామ్రలిప్తి, కావేరీపట్టణము మొదలగు పెద్ద రేవుపట్టణాల ఒకటి.

అప్పటికి అయిదారు శతాబ్దాలనుంచి కృష్ణాతీరంనుంచి పినాకినీతీరం వరకు ఉన్న సముద్రతీర శాలిభూభాగానికి క్రముక రాష్ట్రమని పేరు. ఈ క్రముక రాష్ట్రం రాను రాను రెండుభాగాలయింది. ఒకటి క్రముక రాష్ట్రమూ, రెండవది పూంగీ రాష్ట్రమూ. కృష్ణానదీ ముఖద్వార దేశము క్రముక రాష్ట్రము, అక్కడనుంచి నైఋతీ భూభాగము పూంగీ రాష్ట్రమూ అయినవి. క్రముకమన్నా, పూంగీ అనినా పోకలనే అర్థం. ఈ పోకదేశం నిండా పోకచెట్లు విరివిగా ఉండేవి. శాతవాహనుల కాలంలో ఈ రెండు పేర్లూ వాడుక లోనికి వచ్చాయి. క్రముకరాష్ట్రం నుండి ధాన్యకటకంవరకు ధనకరాష్ట్రం. ధనకరాష్ట్రానికి పడమట పల్లవభోగము, పల్లవభోగానికి పడమట అడవిరాష్ట్రం; ఆ రాష్ట్రానికి ఉత్తరం కురవదేశమూ, పడమట చోళ రాష్ట్రమూ ఉండేవి.

మోసలపురంలోపాటు పూంగీప్రోలు ప్రసిద్ధ రేవుపట్టణం అవడం చేత ఇక్కడికి సముద్రాలావల ఉన్న అనేక ద్వీపాలనుండి ఓడలు వచ్చేవి వర్తకానికి. రాజ్యాలు స్థాపించడానికి అనేకులాంధ్రులు నౌకాయాత్రలు కావించేవారు. యవన సువర్ణ మలయ బలిద్వీపాలలో రాజ్యాలు స్థాపించిన ఆంధ్రులచుట్టా లాయాద్వీపాలకు వెళ్ళేవారు. వలసపోయిన ఆంధ్రులు మాతృదేశము మళ్ళీ చూడడానికి వచ్చేవారు. బౌద్ధ ఆర్య మతాచార్యులు ఆయాద్వీపవాసులకు దీక్ష ఇవ్వడానికి పోయేవారు.

బ్రహ్మదత్తప్రభువు కోటలో తన విడిదిలో ఉంటూ, ఆ మహాపట్టణం అంతా తిరిగి చూచివచ్చేవారు. చీనావారు, సువర్ణద్వీపవాసులు, యవద్వీప వాసులు ఆ నగరం అంతట నిండి ఉన్నారు. పూంగీప్రోలులోనూ బౌద్ధ చైత్యాలున్నవి. కాని ధాన్యకటక చైత్యాలకు, విజయపుర, ప్రతీపాలపురము మొదలయిన నగరాలలో ఉన్న చైత్యాలకు, ఉన్న మహత్యమూ, ప్రతిష్ఠా వీనికి రాలేదు. ఈ నగరంలోనూ ఏడెనిమిది సంఘారామాలున్నాయి. ఏ సంప్రదాయానికి చెందిన భిక్కులు, ఆయా సంఘారామాలలోకే వెడుతూ ఉండేవారు.

బ్రహ్మదత్తప్రభువు పూర్తిగా ఆర్షసంప్రదాయంవాడు అయినా పూంగీప్రోలు వచ్చిన రెండుమూడుదినాలు నగరం అంతా చుట్టి చూస్తూ అన్ని సంఘారామాలకు వెళ్ళి వచ్చినారు. మహాచైత్యవాదుల సంఘారామం సంఘారామాలన్నిటికీ దూరంగా సముద్రతీరంలో ఉన్నది. బ్రహ్మదత్తప్రభువు సంఘారామ గోపురద్వారం దగ్గర రథం దిగి, పాదచారియై సంఘారామంలోకి వెళ్ళినారు. అదివరకే అపరవనశైల సంప్రదాయానికి

అడివి బాపిరాజు రచనలు - 6

92

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)