పుట:Ammanudi july 2018.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుజాతి ట్రస్టుకు విరాళాలు అందజేసినవారు

క్రీ. శే. మానెపల్లి లింగయ్య, మాణిక్యమ్మ దంపతుల గుర్తుగా వారి కుమారుడు మానెపల్లి నరసింహారావుగారు తెలుగుజాతి ట్రస్టుకు రు. 10,000/- విరాళంగా అందించారు. నరసింహారావుగారు తెనాలిలో నాలుగు దశాబ్దాలకు పైగా నిబద్ధతగల ఆడిటర్‌గా గుర్తింపును సంపాదించారు. 'అమ్మనుడి' పత్రికను అభిమానించి ప్రోత్సహిస్తున్నారు. ఫోన్‌ : 08645-226861

కీ. శే. నండూరి రాఘవయ్య యశోదమ్మ దంపతుల గుర్తుగా వారి కుమారుడు నండూరి నారయణరావుగారు తెలుగుజాతి ట్రస్టుకు రూ. 10,000/- విరాళంగా అందించారు. పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేసి, పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న హేతువాద నాస్తిక మానవతావాది. ఫోన్ : 73967 32363

నెల్లూరులో అమ్మనుడి తెలుగును కాపాడుకొందాం' ప్రచార సభ

విశాఖపట్టణానికి చెందిన 'సమైక్య భారతి' సామాజిక సాంస్కృతిక చైతన్య సంస్థ నిర్వహణలో జూన్ 17 ఆదివారం సాయంత్రం 6 గం.లకు నెల్లూరు టౌన్‌హాలులో - 'మాతృభాష తెలుగును కాపాడుకొందాం' అనే పిలుపుతో బహిరంగ సభ జరిగింది. సభకు మహాకవి గురజాడ అప్పారావుగారి మునిమనుమడు, విశాఖపట్టణంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డా॥ మోపిదేవి విజయగోపాల్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుభాషోద్యమ సమాఖ్య కేంద్ర అధ్యక్షుడు డా॥ సామల రమేష్‌బాబు ప్రసంగిస్తూ - జిల్లా స్థాయిలో పరిపాలనను పూర్తిగా తెలుగులో నిర్వహించిన చరిత్రను నెల్లూరు జిల్లా దక్కించుకొన్నదని అందుకు అప్పట్లో జిల్లా పాలనాధికారి (కలెక్టర్‌) గా పనిచేసిన రవిచంద్రగారితో పాటు నెల్లూరులోని తెలుగుభాషోద్యమ సమితి చేసిన నిరంతర ఉద్యమం కారణమని గుర్తు చేశారు. కాని, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో నెల్లూరుకు చెందిన ఘనత వహించిన పురపాలక శాఖామంత్రి పట్టుదలగా విద్యారంగంలో తెలుగు అణచివేతకు, నిర్మూలనకు కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ద్వేషం పార్టీగా వ్యవహరిస్తోందనీ, ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్ల ప్రదేశ్‌గా మార్చేదిశగా పనిచేస్తున్నదనీ విమర్శించారు. ఈ ధోరణిని మానకపోతే రానున్న ఎన్నికల్లో కనీసం 1 లేక 2 శాతమైనా ఓట్లను అధికారపార్టీ పోగొట్టుకొనేందుకు సిద్ధం కావాలని హెచ్చరించారు. 1982లో ఎన్టీరామారావుగారి నాయకత్వంలో తిరుపతిలో ప్రకటించిన తెలుగు భాషా విధాన పత్రాన్ని చంద్రబాబుగారి హయాంలో తుంగలో త్రొక్కేశారని అన్నారు. నిరంతరం ఉద్యమంతో ప్రజలను చైతన్య పరచేందుకు దీక్ష వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహిస్తున్న 'సమైక్య భారతి' సంస్థనూ, దాని బాధ్యులను, ముఖ్యంగా సారధి పి. కన్నయ్యగారిని ప్రశంసించాలని అన్నారు. తెలుగు భాషోద్యమ సమితి - నెల్లూరు - నేతలు చెలంచెర్ల భాస్కరరెడ్డి, ఆచార్య ఆదిత్య, నాటకరంగ ప్రముఖులు, రచయిత వల్ల కవి వెంకట సుబ్బారావు, కన్నయ్య గార్లు తమ ప్రసంగాల్లో మాతృభాష తెలుగును కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదనీ, విద్యా, పాలనా రంగాల్లో తెలుగును పూర్తి స్థాయిలో కొనసాగించాలనీ అన్నారు. సభాధ్యక్షులు డా॥ విజయగోపాల్‌ మాతృభాషతోనే మనిషి పరిపూర్ణ వికాసం సాధ్యమవుతుందని, పరభాషలతో దాన్ని సాధించలేమనీ అన్నారు.