పుట:Ammanudi july 2018.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజకీయాధికారంతోనే 'మహిళా సాధికారికత'

పార్లమెంట్‌, అసెంబ్లీలలో మహిళలకు మూడోవంతు సీట్లు రిజర్వు చేయాలని ఉద్దేశించిన బిల్లు తయారయి దశాబ్దాలు గడచినా ఆమోదంకు నోచుకోవడం లేదు. పురుష ఆధిపత్యం గల రాజకీయ పార్టీలు ఈ బిల్‌ ఆమోదానికి అడ్డంకిగా ఉన్నాయని అనుకొన్నా తన కను సంకేతాలతో పదేళ్ళపాటు యుపియే ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా శాసించిన, నడిపించిన సోనియా గాంధీ హయాంలో సహితం ఈ బిల్లు వెలుగు చూడలేక పోయింది.

“అన్ని రకాల సామాజిక ప్రగతికి రాజాకీయాధికారం కీలకం” అని రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పారు. దేశ జనాభాలో సగం మంది వరకు ఉన్న మహిళలు అన్ని రంగాలలో క్రియాశీలకంగా పాల్గొన గలిగితేనే దేశాభివృద్ది సహితం విశేషంగా ఉంటుంది అనడంలో సందేశం లేదు. అందుకనే అభివృద్ధి పథకాలలో 'మహిళా సాధికారికత'కు విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నాము. మహిళలకు కేవలం నామ మాత్రపు ప్రాధాన్యత కల్పించడమేకాదు వారికి నిర్ణయాలు తీసుకోగల సౌలభ్యం కూడా ఏర్పడటం అత్యవసరం.

తమకు అవకాశం కల్పిస్తే ఏ రంగంలో అయినా మగవారికి దీటుగా ప్రావీణ్యత చూపగలమని మగువలు అనేకమంది అనేక రంగాలలో నిరూపించుకొంటున్నారు. అయినా నేడు మహిళలు దాదాపు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. మహిళలే కాదు ముక్కుపచ్చలారని బాలికలు సహితం లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు. కుటుంబ నభ్యులు, బాగా తెలిసిన వారు, తమతో కలసి చదువు కొంటున్నవారు - పనిచేస్తున్నవారినుండే వారికి రక్షణ లేకుండా పోతున్నది.

ఇటువంటి ఆగడాలను అరికట్టడంకోసం నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చిన ప్రయోజనం ఉండటం లేదు. కొందరు ఆవేశంగా ఇటువంటి నేరాలకు ఉరిశిక్ష విధించే అదుపు చేయవచ్చని అంటున్నారు. అయితే కేవలం చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించలేము.

అంబేద్కర్‌ మాటల ఆంతర్యం గ్రహిస్తే రాజకీయాధికారంలో మహిళలకు తగు స్థానం కల్పిస్తేనే వారికి రక్షణ లభించడంగాని, వారి అభివృద్దికి అవసరమైన వాతావరణం ఏర్పడటంగాని సాధ్యం కాగలదని గమనించాలి. ఈ మధ్యనే స్పెయిన్‌ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెడ్రో సంచేజ్‌ తన మంత్రివర్గంలో మొత్తం 17 మంది సభ్యులు ఉంటె, వారిలో 11 మంది మహిళలను నియమించడం ద్వారా ఆ దేశంలోనే చరిత్ర సృష్టించారు. నేడు ఐరోపాలోని అనేక దేశాలలో మంత్రివర్గాలలో మహిళలు గణనీయ సంఖ్యలో ఉంటున్నారు.

అయితే భారతదేశంలో అటువంటి పరిస్థితి ఏర్పడటం లేదు. మొదటి లోక్‌సభ లో 4.5 గా ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు 16వ లోక్‌సభలో 12 శాతంకు మాత్రమే చేరుకొంది. కేంద్రమంత్రివర్గంలో 22 శాతం వరకు వారి ప్రాతినిధ్యం ఉన్నా కొందరు కీలక శాఖలు నిర్వహిస్తున్నా వారేమాత్రం స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడం కష్టం. విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ వీలు చిక్కినప్పుడల్లా తన ప్రతిభను ప్రదర్శించుకో గలిగారు. అయినా ఆమెను ఉత్సవ విగ్రహంగా మార్చి, ప్రధాన మంత్రి కార్యాలయంలోని వారే అంతా పెత్తనం చేయడాన్ని చూస్తున్నాము.

రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంస్థలలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్‌ కల్పించడం ద్వారా స్థానిక సంస్థలలో ఒకవిధంగా పెను విప్లవం తీసుకు వచ్చారని చెప్పవచ్చు. వలు రాష్ట్రాలలో ఇప్పుడు స్థానిక సంస్థలలో సగం మేరకు సీట్లు మహిళలకు రిజర్వు చేసారు. ఎక్కడైతే మహిళలు రాజకీయంగా సాధికారికత సాధించగలరో అక్కడ పరిసరాలలోనే గణనీయ మార్పు సాధిస్తున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

పార్లమెంట్‌, అసెంబ్లీలలో మహిళలకు మూడోవంతు సీట్లు రిజర్వు చేయాలని ఉద్దేశించిన బిల్లు తయారయి దశాబ్దాలు గడచినా ఆమోదంకు నోచుకోవడం లేదు. పురుష ఆధిపత్యం గల రాజకీయ పార్టీలు ఈ బిల్‌ ఆమోదానికి అడ్డంకిగా ఉన్నాయని అనుకొన్నా తన కను సంకేతాలతో పదేళ్ళపాటు యుపియే ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా శాసించిన, నడిపించిన సోనియా గాంధీ హయాంలో సహితం ఈ బిల్లు వెలుగు చూడలేక పోయింది.

మమత బెనెర్జీ, మాయావతి, వసుంధర రాజే వంటి రాజకీయంగా బలమైన పునాదిగల నాయకులు ఉన్నప్పటికీ మొత్తం మీద రాజకీయంగా మహిళలకు తగు ప్రాతినిధ్యం లభించడం లేదు. కీలక పదవులలో ఉన్న మహిళా నాయకులు సహితం తమ పరిధిలో మహిళలను ప్రోత్సహించే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు మహిళలకు లభిస్తున్న ప్రాతినిధ్యం సహితం ఎక్కువగా వారివారి కుటుంబ నేపథ్యం కారణంగా లభిస్తుండడంతో వారు ఏమేరకు స్వయం నిర్ణయాధికారం చెలాయించ గలుగుతున్నారు అన్నది ప్రశ్నార్ధకరమే. స్థానిక సంస్థలలో విశేషంగా. ప్రాతినిధ్యం లభిస్తున్నా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వారికోసం రిజర్వ్‌ చేసిన నియోజక వర్గాలను మారుస్తూ ఉండడంతో ఒకసారి ఎన్నికైన వారు తిరిగి తమ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోలేక బలమైన నాయకులు కాలేక పోతున్నారు.

బిజెపి వంటి పార్టీలు అంతర్గతంగా పార్టీ కార్యవర్గాలలో మూడొంతుల పదవులను మహిళలకు కేటాయిస్తున్నా చాలావరకు అలంకార ప్రాయంగానే ఉంటున్నాయి. వారికి పార్టీ అంతర్గత వ్యవహారాలలో నిర్ణయాధికారం మాత్రం చెప్పుకోదగిన స్థితిలో ఉండటం లేదు. కీలకమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

47