పుట:Ammanudi july 2018.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వివాహిత స్త్రీల ఇంటిపేర్లు ఎందుకు మారుతున్నాయి?

కొంత కాలం క్రితం “మీ ఇంటి పేరెలా వచ్చింది” అని ఆంధ్రజ్యోతిలో ఈ రచయిత నిర్వహించిన శీర్షికకు ప్రతిస్పందిస్తూ పాఠకులు అడిగిన ప్రశ్నల్లో ఇది ఒకటి. అయితే మారి తీరాలి అని నిర్దేశం చేసినట్లు గాని లేక అలాంటి చట్టం ఉన్నట్లు గాని దాఖలా ఏమీ లేదు. కాని మారుతున్న మాటనిజం. ఇది ఒక ఆచారం అని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆచారం ఏర్పడడానికి కూడ ఏవో కారణాలుండాలి.

వ్యక్తికి పేరు సమమైన గుర్తింపు కొరకు. సమూహం నుండి వ్యష్టిని గుర్తించడం కొరకు. ఇంటి పేరు, ఆ గుర్తింపును మరింత సమగ్రం గావించడం కొరకు. ఇంత మేరకు స్త్రీ, పుం వివక్షలేదు. వివక్ష ప్రారంభమైంది వివాహిత స్త్రీల విషయంలో. అలా ఎందుకు జరుగుతోంది అనేది ప్రశ్న.

ఈ ప్రశ్న భారతీయ సమాజంలో మాత్రమే ఉత్పన్నమైనది కాదు. ఇతరదేశాల్లో కూడా వచ్చింది. బహుశా ఆ స్ఫూర్తే ఇక్కడ పనిచేసి వుండవచ్చు. ఇది సమాజంలోని పురుషాహంకారానికి నిదర్శనమన్న వారు కూడ వున్నారు. ఇతర దేశాల్లో ఈ విషయమై న్యాయస్థానాల నాశ్రయించడం కూడ జరిగింది. వివాహిత, భర్త ఇంటిపేరు లోనికి మారడం, మారక పోవడం అనేది ఆ స్త్రీ ఇష్టాయిష్టాలకు వదిలివేస్తూ, సమాజానికి, లేక లౌకిక వ్యాపారానికి సంబంధించినంత వరకు అలా మారడం అనేది అవసరమని ఉట్టంకించాయి. కాని ఆ ఆచారానికి కారణాలు వివరింపలేదు. కారణమేమై వుంటుంది. లోకంలో చాల ఆచారాలుంటాయి. కొన్నింటికి కారణాలు తెలియవస్తాయి. కొన్నింటికి తెలియరావు. కారణం, ఆ ఆచారం మొదలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు గల కాలంలోని అంతరం. మొదలు కారణమున్నా ఆ కారణమేదో ఇప్పుడు అంది రాక పోవడం. అందిరావడం లేదు గనుక, దానిని పాటించడం మానివేస్తున్నారా! లేదు. ఎందువలన. అవి సమాజపు విలువలుగా రూవుదిద్దుకున్నాయి గనుక. అయితే పూర్వవు ఆచారాలనన్నింటిని పాటిస్తున్నారా అంటే - అదీ కనుపింపదు. అంటే కొన్ని పాటింపబడుతున్నాయి. కొన్ని పాటింపబడటం లేదు. పాటింపబడుతున్నవి మాత్రం, చట్టం కంటె బలీయమైనవి. నిజానికి చట్టం వాటి జోలికి వెళ్లదు. కారణమేమిటి! చట్టంకాని, ఆచారంగాని, బహుజనులకు హితవును, సుఖాన్ని కలిగించాలి తప్ప కష్టం కలిగింపరాదు. అలాగే కొన్ని 'కుల' కట్టుబాట్లుంటాయి. వాటిని అనుసరింపక పోతే, అనుసరించడం ఇష్టం లేక కోర్టు నాశ్రయిస్తే కోర్టుకూడ, ఆ కట్టుబాటుకే విలువనిస్తుంది తప్ప, దానిని అతిక్రమించే విధంగా తీర్పునివ్వదు. కారణమేమిటి. చట్టాలు, నిబంధనలు, న్యాయసూత్రాలు - ఒకప్పటి ఆచారాలు, వాటి పాటింపు మొదలైన వాటి క్రోడీకరణమే గనుక. అలాంటి క్రోడీకరణలలో ఈ ఇంటి పేరు మారడం, మారక పోవడం అనేది ఎందుకు చోటు చేసుకోలేదు. ఇదొక్కటే అన్నమాటేమి, చాలా చోటు చేసుకోలేదు. అలాంటి వాటిల్లో ఇదొకటి. ఇక ముందు చోటు చేసుకుంటుందేమో. అది ఇప్పటికిప్పుడు చెప్పగలిగింది కాదు. ఏమైనా ఆచారం మాత్రం బలీయమైనది.

ఇక విషయానికి వస్తే, ఎందుకు మారాలి, లేక ఎందుకు మారుతోంది అనే ప్రశ్న ఎవరి నుండి ఉత్పన్నమైంది. విద్యావంతులైన స్త్రీల నుండి, వివాహం తరువాత, వీరికి సంబంధించిన రికార్డులు మార్చుకోవలసి రావడం చేత మాత్రమేనన్నది గుర్తుంచుకోవాలి. - అలా మార్చకపోయినా ఇబ్బంది కలుగని చోట, వివాహితులైన విద్యావంతులైన స్త్రీలు, తమ వివాహత్పూర్వపు ఇంటి పేర్లతోనే కొనసాగుతున్న వారు లేకపోలేదు. అంటే అవసరం కారణమవుతోంది. ఇబ్బంది లేని చోట కూడ మార్చుకోవలసిందేననే నిర్బంధము భర్త నుండి, లేక అత్తవారింటి నుండి ఎదురైతే అది వ్యక్తినిష్టమే తప్ప, 'మారితీరాలి' అన్న చట్టమున్నట్లు లేదు. విద్యావంతురాండ్రు కాని స్త్రీల విషయంలో ఈ సమస్య ఉత్పన్నం కాదు. కారణం లౌకిక వ్యవహారంలో స్త్రీల విషయంలో ఇంటి పేరుతో పని లేదు గనుక, పురుషుల విషయంలో వుందా - అంటే అదీ అనుమానమే. లిఖిత పూర్వకమైన వ్యవహారం లేని చోట ప్రత్యేకంగా ఇంటిపేరు ఉట్టంకించనవసరం లేదు. స్త్రీల విషయంలో కూడ, వారు విద్యావంతులు కాకపోయినా, ఓటర్ల లిస్టులో, ఒకవేళ వ్యష్టిగా జీవిస్తున్న వేళ, రేషనుకార్డు, తపాలాచిరునామా ఇలాంటి విషయాల్లో, ఇంటిపేరు తప్పదు. దీనిని బట్టి లిఖిత వ్యవహారంలో, ఇంటిపేరు అవసరమవుతోంది. అది పురుషుని విషయంలో తప్పనిసరి. కాగా, స్త్రీల విషయంలో కొన్ని అవసరాలను బట్టి, విద్యావంతులైన స్త్రీల విషయంలో మరిన్ని అవసరాలను బట్టి ఇంటిపేరు అవసరమవుతోంది. ఇక మార్పు కన్పిస్తోంది స్రీల విషయంలో మాత్రమే. (స్త్రీలు అంటే ఇకనుండి విద్యావంతులైన వారిని ఉద్దేశించి మాత్రమేనని గ్రహించాలి). పురుషుల విషయంలో మార్పులేదు. ఇలా ఎందుకు జరిగిందనేది ప్రశ్న

మార్పు జరగడమనేది లిఖిత వ్యవహారంలో స్ఫుటంగా కన్పిస్తుంది. వాగ్వ్యవహారంలోనికి వచ్చేటప్పటికి, అలా వుండదు. ఒక వ్యక్తిని గూర్చి (స్త్రీ గాని, పురుషుడు గాని) ఆరా తీసేటపుడు, ఎవరు అనే ప్రశ్నకు ఫలానా వారి అబ్బాయి, లేక అమ్మాయి (వివాహితులు కానపుడు), వివాహిత స్త్రీ అయినపుడు ఫలానా వారి భార్య అని గదా సమాధానం. పాఠశాలలో చేర్చించవలసిన చోట, విధిగా, ఆ వ్యక్తి తండ్రి ఎవరో సూచింపవలసి వుంది. ఈ సూచించడమనే ప్రక్రియ, వివాహం తరువాత మార్చు అనే దానికి కారణమైనది. పురుషుని విషయంలో మార్పులేదు. వివాహిత స్త్రీ విషయంలో పైన సూచించిన సందర్భాలను బట్టి మారుతోంది. దీనిని బట్టి నమోదు అనేది లేకపోతే మార్పు అనేది లేదు. కారణమేమంటే సాధారణ వ్యవహారంలో ఇంటి పేరుతో అందునా - స్త్రీల విషయంలో పనిలేదు గనుక. పురుషుని విషయంలో ఎందుకుంది అంటే, ఆ కుటుంబానికి అతడు వారసుడు గనుక, అతని తండ్రి తరువాత ఆ కుటుంబానికి అతడు యజమాని గనుక. ఆ కుటుంబపు ఆస్తి అతనికి సంక్రమిస్తుంది గనుక, తత్సబంధమైన వ్యవహారాన్ని బట్టి, అవసరాన్ని

38

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018]