పుట:Ammanudi july 2018.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నపిల్లల మేధాశక్తిని పెంచడానికి పుస్తకాలే ముఖ్యమైన దోహదాలు. తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లలకు యింగ్లీషు సరిగ్గా రావడం లేదనీ, వ్యాకరణం నేర్పమనీ వుపాధ్యాయుల దగ్గర మొర పెట్టుకుంటూ వుంటారు. పిల్లలను వుస్తకాలు చదవనివ్వకపోవడం మొదటి తప్పయితే, మాతృభాషలోని పుస్తకాల్ని పట్టించుకోకపోవడం యింకో తప్పు. కాలక్షేపం పేరుతో టీవీ కార్యక్రమాలు కాలక్షేపాన్నే కలిగిస్తాయి. అయితే కాలక్షేపం పేరుతో దగ్గరయ్యే పుస్తకాలు మనిషిని చైతన్య వంతుడ్ని చేస్తాయి. మార్కుల కోసమే పరిగెత్తే నేటి విద్యార్థులు యాంత్రి కంగా మారడానికి పుస్తక పఠనం లేకపోవడమే కారణం. గత పాతికేళ్ళుగా అనేక రకాల పరీక్షల్లో అగ్రశ్రేణిలో వుత్తీర్ణులైన అనేక మంది విద్యార్థులు తరువాతి కాలంలో యెలా తయారయ్యారో పరిశీలిస్తే సమ గ్రమైన ఎదుగుదల యెంత అవసరమో, దానికి పుస్తక పఠనమెంతగా వుపయోగ వడుతుందో అర్ధమవుతుంది.


1970 ప్రాంతాల్లో నేను వున్నత పాఠశాల విద్యార్థిగా వుంటున్న రోజుల్లో మా యింటికి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక అనే వార పత్రికలూ, జ్యోతి, యువ అనే మాసపత్రికలూ వచ్చేవి. పది పది హేనిండ్లుండే మా చిన్న వీధిలో, దాదాపు ప్రతి యింటిలో చదువుకుంటున్న పిల్లలుండేవాళ్లు. వాళ్ళలో ఆడపిల్లలే యెక్కువ. పత్రిక వచ్చీ రాకముందే వాటిల్లో తాము చదువుతున్న సీరియల్‌ నవలల కోసం వొకరికంటే ముందుగా వొకరు చదివేయడం కోసం పోటీ పడుతూ వుండేవాళ్ళు. మా వీధిలోనే పది, పదకొండు తరగతులతోనే చదువులు చాలించి, బాధ్యత తెలియకుండా తిరిగే యువకులిద్దరు ముగ్గురుండే వాళ్ళు. వాళ్ళు చెప్పే పనుల్ని చేస్తూ వాళ్ళ ఆంతరంగిక మిత్రులవగలిగే వాళ్ళకు వాళ్ళు రహస్యంగా యెర్రంచులుండే జానెడు పొడుగు పుస్తకాలను యిచ్చేవాళ్ళు. దేశాలనే సర్వనాశనం చేయాలనుకునే దుర్మార్గులూ, వాళ్ళను వెతికి పట్టి శిక్షించే గూఢచారులూ వుండే రకరకాల రహస్య పరిశోధనల నవలలవి.

1972లో కాలేజీ చదువుకోసం తిరుపతికి రాగానే రాజభవనాల్లాంటి గ్రంధాలయాలు పరిచయమయ్యాయి. ప్రతిసారీ మూడు నాలుగు పుస్తకాల చొప్పున గదికి తెచ్చుకుని నిర్ణీత గడువులోపల తిరిగిచ్చేయాలి. కాలేజీ హాస్టల్లో విద్యార్థులు కొందరు మరీ రహస్యంగా కొన్ని పుస్తకాల్ని చదవడం గమనించాను. చాలా నమ్మక పాత్రమైన వ్యక్తికిగానీ వాళ్ళా పుస్తకాల్ని యిచ్చేవాళ్ళు కారు. తీరా ఆ పుస్తకాల్ని చదవగలిగే అవకాశం దొరికినప్పుడు అంతవరకూ తెలియని చీకటి ప్రపంచమొకటుందని తెలిసి వచ్చింది. యెక్కడో రహస్యంగా ప్రచురణ్ణై, యే చీకటికొట్లలోనో అమ్ముడై, తమకు కావలసిన ప్రత్యేక మైన పాఠకుల్ని అలరించే ఆ శృంగార పత్రికలు పదనైదు, పదహారేళ్ల కుర్రాళ్ల పైన యెటువంటి ప్రభావాన్ని చూపెట్టి వుంటాయో తెలుసు కోవడం కష్టంగాదు.

1975 వ సంవత్సరం వచ్చేసరికి నగరంలో ప్రతి వీధికీ బాడుగ పుస్తకాల అంగళ్ళున్నాయని తెలిసింది. అన్ని వార, మాస వత్రికలూ నవలలూ రోజుకింత అని అద్దెకిచ్చే అంగళ్ళవి. అవెప్పుడూ పాఠకులతో కిటకిటలాడుతుండేవి. ప్రాచుర్యముండే సీరియళ్లను ప్రచురించే వారపత్రికలు కావాలంటే వారాలపాటూ నీరీక్షించాల్సి వుండేది. కొన్ని ప్రాచుర్యముండే నవలలు పాఠకుల చేతుల్లో నలిగినలిగీ జీర్ణావస్తకు చేరేవి. బాగా పరిచయం పెరిగాక అస్మదీయులైన వినియోగదారుల కోసం బాడుగ పుస్తకాల యజమాని తన నేలమాళిగలోంచీ రహస్య శృంగార సంచికల్ని తీసిచ్చేవాడు.

దూరదర్శన్‌ 1959లో ప్రారంభమైనప్పటికీ అది సామాన్యుల వరకూ రావడం 1980 ప్రాంతాల నుంచీ మొదలయ్యింది. 1983లో ప్రపంచ క్రికెట్‌ పోటీ, 1998లో మహాభారతం సీరియల్‌ దూరదర్శన్‌లో ప్రసారమయ్యే రోజుల్లో ప్రేక్షకులంతా టీవీల ముందు అతుక్కుపోవడం అందరికీ తెలుసు. దూరదర్శన్‌లో చిత్రసీమ, చలన చిత్రాలు ప్రసార మయ్యేటప్పుడు నగరాల్లో వీధులు కూడా ఖాళీగా కనిపించేవి. 1991లో దూరదర్శన్‌లోకి ప్రభుత్వేతర ప్రసార సంస్థలు వచ్చిన తర్వాత క్రమంగా పాఠకుల సంఖ్య తగ్గడం ప్రారంభమయ్యింది.

గతంలో పత్రికలు బాగా ప్రాచుర్యంలో వున్న రోజుల్లో, పాఠకుల సంఖ్య బాగా యెక్కువగా వున్నప్పుడు గూడా మంచి సాహిత్యాన్ని చదివే వాళ్ళు బాగా తక్కువనీ, పాఠకుల బలహీనతలను వుపయోగించుకునే నాసిరకం సాహిత్యానికే యెక్కువ గిరాకీ వుందనీ విమర్శకులు చెబు తుండేవాళ్ళు. టీవీ సీరియళ్లకు తరలిపోయినవాళ్ళు ఆ నాసిరకం పాఠకులేననీ, వాళ్ళు టీవీలకు వలసపోయినందువల్ల సాహిత్చ రచనల కొచ్చే యిబ్బందేమీ వుండదనీ గూడా వాదించారు. వ్యాపార రచనలు చేసే రచయితలు కొందరు ప్రాప్త కాలజ్ఞులైపోయి, కాల్పనికేతర రచనలకు మొగ్గేశారు. యీ సంధికాలంలో ప్రముఖ వత్రికలు ఆంధ్రపత్రిక, భారతి మూత పడడంతో సాహిత్య షత్రికల పతనం ప్రారంభమయ్యింది.

పాఠకుల సంఖ్య గణనీయంగా పెంచడానికి వ్యాపార రచనలూ, సాధారణ పాఠకుల్ని అలరించే అపరాధ పరిశోధన, శృంగార రచనలూ దోహదం చేస్తాయని చరిత్ర చెబుతోంది. ప్రతిపాఠకుడూ తొలిదశలో అటువంటి పుస్తకాలే చదువుతాడనీ, అతడు యెదిగే కొద్దీ వున్నత ప్రమాణాలుండే పుస్తకాల వైపు మొగ్గుతాడనీ అనుకుంటూ వుంటాం. అయితే యిలా యెదుగుతూ వుత్తమ పాఠకులయ్యే వ్యక్తుల శాతం చాలా తక్కువే గావచ్చు. గతంలో ఆ తక్కువ శాతం పాఠకుల సంఖ్య కూడా బాగా గణనీయంగా వుండేది. యిప్పుడు అన్ని రకాల పాఠకులూ తగ్గిపోయారు.

పాఠకుల సంఖ్య తగ్గడానికీ, టీవీ ప్రేక్షకుల సంఖ్య పెరగడానికీ కారణాలు మానవ స్వభావంలోనే వున్నాయి. పుస్తకం చదవడమన్నది

24

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018