పుట:Ammanudi july 2018.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాషోద్యమ కథానిక

విహారి
9848025600

సింధువులో బిందువులు

“తెలుగు నేర్చటానికి ఉచిత సేవా కార్యక్రమం అది. స్థలం దొరికింది. విద్యాలయం వాళ్ళు శనిఆదివారాలు పెట్టుకోమన్నారు. టీవీల్లో పని చేసేవారూ, పని చేద్దామనుకునేవారూ, కళాకారులూ, సృజనకారులూ, సంగీతం నేర్చుకుంటున్న పిల్లలూ, ఇతర యువతీ యువకులూ...ఏ వయస్సు వారైనా సరే అర్హులే. శని ఆదివారాల్లో ఉదయం పదినుండి పన్నెండువరకూ - తెలుగు అభ్యాసం. చదవటం రాయటం.”

బందరు నుంచీ మా బావమరిది పురుషోత్తం వచ్చాడు.

హైదరాబాద్‌లో చాలామంది బంధువులు.

సాయంత్రం నడకకి పార్కుకు వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నాన్నేను. 'వస్తావా' అంటే రానని నవ్వాడు.

నా శ్రీమతి శారద కూడా నవ్వుతూ, “ఆయనకు సీరియలుంది. దాన్ని మిస్‌కాడు” అంది.

సంభాషణ టీవీ కార్యక్రమాల మీదికి పోయింది. నేనూ ఆగిపోయాను.

- సమయం కాగానే, ఆ ఛానెల్‌ని మార్చింది శారద.

రియాల్టీ షో! నృత్యమో, నర్తనమో, నాటకమో తెలియని విన్యాసాలు. ఇద్దరు యువతులు, నలుగురు యువకులు, టీనేజ్‌ వారు. ఒకరిని మించి ఒకరు ఊపుతున్నారు ఊగుతున్నారు, ఎగురుతున్నారు. ఎక్కుతున్నారు, కాళ్ళకింది నుంచీ దూరిపోతున్నారు. మొత్తానికి కిందామీదా పదుతున్నారు.

ఫోకస్‌ లైట్స్‌! రంగులు మారుతున్నై! హాలంతా వెర్రెక్కిపోతున్నది. ఈలలూ, చప్పట్లూ, నవ్వులూ...!

ముగ్గురు జడ్జిలు. ఇద్దరు నడివయస్సు స్త్రీలూ, ఒక పెద్దాయనా. మహిళాజడ్డిల్లో ఒకావిడ లేడీవిలన్‌గా సీరియల్స్‌ వేసివేసి, శరీరం సహకరించక ఆగిపోయింది. రెండో ఆవిడ ఇంకా సీరియల్స్‌ ఫీల్డ్‌లో ఉన్నది. పెద్దాయన ఎప్పుడో రచనలు చేసి రిటైరయిన ఉపాధ్యాయుడు.

మహిళా జడ్జిలిద్దరూ చాలా ఆనందిస్తున్నారు. పెద్దాయనేమో తెచ్చికోలు నవ్వుతో, ఆముదం తాగిన మొహంతో ఇబ్బంది పడుతున్నాడు.

“డాన్స్‌' అయింది! హాలు సంతోషాల ఎక్కిళ్ళతో కరకరలాడుతోంది.

ముందుగా యాంకర్‌ స్టేజిపైకి వచ్చింది. 'సొయంపెబా! నీ పెరపామెన్స్‌ అదిరింది” అని ఒక యువతిని అభినందించింది.

పెద్దాయన మొహం చిట్లించాడు. “అబ్బబ్బ! అది స్వయంప్రభ తల్లీ! ఖూనీ... ఖూనీ” అనుకున్నాడు. పక్క వారికీ వినపడింది!

యాంకరిప్పుడు ఒక యువకుడి వైపు గెంతి 'రంజిత్‌ యూ ఆర్‌ గ్రేట్‌. బెస్ట్‌ టీమ్‌వర్క్‌!' అని భుజం తట్టింది.

అతను వంగి వంగి 'థాంక్స్‌' చెప్పాడు. చేతిలో మైకుంది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

21