పుట:Ammanudi july 2018.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురువుకి తగిన శిష్యుడు

గిడుగు పిడుగైతే ఆయన శిష్యుడు తాపీ ధర్మారావు ఆయనకు ఏ మాత్రం తగ్గని శిష్యుడు పర్లాకిమిడిలో కాలేజీలో చదివేటప్పుడు ఒకరోజున ధర్మారావుగారి ముఖంమీద బొట్టు కనిపించకపోవడంతో కోపగించుకుని ఆయన మొఖం చూడకుండా తన కుర్చీని గోడవైపుకి తిప్పుకుని పాఠం చెప్పేరు గురువుగారు. ఆ తర్వాత ఆయనకు ధర్మారావుగారే ముఖ్య శిష్యుడయ్యాడు. అతని వైపే చూస్తూ పాఠం చెప్పేవారు.

ధర్మారావుగారు రామ్మూర్తిగారి వ్యవహారిక భాషా వాదం మీద ధ్వజం ఎత్తారు. కాలేజీలో ఆయనకు శిష్యుడు. ఆయన జ్ఞానాన్ని, దీక్షని, వాదన, ప్రతిభని బాగా ఎరిగున్నవాడు. ఇవన్నీ ఆలోచించి ఒక చిన్న పద్య రూపంతో 'చంపకమాల'తో ఆయన్ని ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు ధర్మారావుగారు. గ్రాంథికాన్ని బలపరుస్తూ గురువుగారి వాదనని తిరగకొడుతూ చంపకమాల రాసారు.

గురజాడ అభ్యుదయం దిశగా సాగడానికి శ్రమించారు. సాహిత్యరంగంలో యథాపూర్వ స్థితికోసం పెనుగులాడే అభివృద్ధి నిరోధకుల భావాలపై గురజాడ కత్తికట్టి ఎదుర్కొన్నారు. కన్నుమూసే దాకా గురజాడ కలం దించలేదు.

'సంకెళ్ళను ప్రేమించే వాళ్ళు దాన్ని - అనగా గ్రాంథిక భాషను ఆరాధిస్తారు. కాగా నా మటుకు నా మాతృభాష సజీవమైన తెలుగు 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌' అనిపించుకున్న మన ఈ తెలుగుతో మన సుఖాల్ని దుఃఖాల్ని వెల్లడించడానికి మనం ఎవరం సిగ్గు పడలేదు కానీ కాగితం మీద పెట్టడానికి మనలో కొంత మంది బిడియపడుతున్నారు', అంటూ అప్పటి స్థితిని ముఖం మీద కొట్టినట్టు చెప్పారు గురజాడ.

ఈ రంగంలో గ్రాంథికవాదులు మొరటుతనం, తెలుగుభాష పెరగడానికి వీలు లేకుండా మతిమీద మేకులు కొట్టింది. ఇక చిన్నయసూరిలాంటి వారైతే ఉక్కు చట్రాలనే బిగించారు. దీనిని గ్రహించారు ధర్మారావు.

అలాగే గురజాడ సాహిత్య సృజన గిడుగుకి లక్ష్యంగా కనిపించింది. దాంతో వ్యవహారిక భాషోద్యమం చేయాలనిపించింది ధర్మారావుగారికి. అంతే ధర్మారావుగారు పాత కొత్తలకు పూల వంతెన వెయ్యాలి, ఆయన దృఢమైన వ్యక్తే కానీ తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నప్పుడు, మార్చుకోవడానికి వెనుదీయలేదు. సంస్కరణ భావాలు పుష్కలంగా ఉన్న ధర్మారావుగారు కుమారుని కులాంతర వివాహాన్ని మనసార సమర్థించారు. ఆ జంటకు చివరి వరకు అండగా నిలిచారు. కోడలు తాపీ రాజమ్మ బ్రాహ్మణ యువతి. ఆయన ఆమెతో 'అమ్మా నేను బ్రాహ్మణ వ్యతిరేకిని ఏ మాత్రం కాను, ఆధిపత్య భావజాలాలకు మాత్రమే వ్యతిరేకిని' అని చెప్పారు.

న్యాయం కోసం ఎవరినైనా ఎదిరించగల దిట్ట ఆయన. తమ భావాల్ని ఎదుటి వారికి సౌమ్యంగా ఖచ్చితంగా చెప్పే కరకుతనం ఆయనది. శత్రుత్వంతో సమీపించినవారినైనా మిత్రులుగా మార్చే సరళతర ప్రవర్తన ఆయనది.

ఏ విషయాన్నీ కోపంగా, గట్టిగా చెప్పేవారు కాదు. ఎంతో నిదానంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఈ ధర్మాలన్నీ సమపాళ్లల్లో పోత పోసిన వ్యక్తి తాపీ ధర్మారావు. తాపీవారికి పసితనం నుంచి తెలుగు సాహిత్యం అన్నా, విషయ జిజ్ఞాస అన్నా ఆసక్తి, అభిరుచి ఉండేవి. కానీ నాయన నరసింగరావుగారు డాక్టరు. ఆంగ్లం అంటేనే ఇష్టం. ఆయనకి తమ పిల్లలు ఆంగ్లం బాగా చదివి గొప్ప వాళ్ళై పెద్దపెద్ద సర్కారు ఉద్యోగాలు చేయాలని ఆయన ఆశయం.

తెలుగు చదివితే ధర్మారావుగారిని తిట్టేవారు ఆయన తండ్రి. నాయనగారు మేడ మీదకు తీసుకు వెళ్లే వరకు ఏ ఇంగ్లీష్ పుస్తకమో చదువుతున్నట్లు ధర్మారావుగారు నటించి, తర్వాత తెలుగులో పద్యాలు రాసుకునేవారు.

నాయనగారి పలుకుబడినిబట్టి తలచుకుంటే ధర్మారావుగారికి గొప్ప సర్కారు ఉద్యోగమే దొరికేది. కానీ ఆయనకది ఇష్టం లేదు. ఉన్నంతలో ఉపాధ్యాయ వృత్తే ఉత్తమం అని కళ్ళికోట రాజా కళాశాలలో లెక్కల మాష్టారుగా చేరారు. అప్పుడే కొందరు మిత్రులతో కలిసి 'వేగుచుక్క' గ్రంథమాలని స్థాపించారు (1910 - 1911), విజ్ఞాన చంద్రిక గ్రంథమాల, ఆంధ్ర భాషాభి వర్దిని సభ, తాకని విషయాలపై ఆంధ్ర వాఙ్మయ చరిత్రను 'తెలుగనెడు కాంత' స్వీయ చరిత్ర రూపంలో 'ఉషఃకాలము' అనే పేరుతో ప్రకటించారు. మొదటి డిటెక్టివ్ నవల 'వాడే - వీడు'. మొదటి ఆంధ్రచరిత్ర నాటకం 'ప్రేమము' మొదలైన గ్రంథాలు వెలువరించారు.

1911 ఉగాది సంచికలో (ఆంధ్రపత్రిక ) 'ఆంధ్రులకు ఒక మనవి' అన్న వ్యాసం ప్రచురితమైంది. అదే వారి తొలి రచన.

గిడుగు రామ్మూర్తి పంతులుగారు తమ మిత్రుడు గురజాడ మరణానంతరం 20 సంవత్సరాలు తమ ప్రసంగాలతో ప్రజలలోకి జనం మాట్లాడే భాష యొక్క ప్రాధాన్యతని తీసుకెళ్ళి, దానిని ఒక భాషోద్యమంగా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

19