పుట:Ammanudi july 2018.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాల్చిన మట్టితో చేసిన బొమ్మలు

పురావస్తు శాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి శ్రీకారం చుట్టారు. పురావస్తు శాఖ ఉప సంచాలకులు డి. రాములు నాయక్ ఆధ్వర్యంలో, విశ్రాంత పురావస్తు అధికారులు ఎస్. ఎస్. రంగాచార్యులు, భానుమూర్తిలతో కూడిన పదిమంది అధికారుల బృందం ఈ పురావస్తు తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల బృందంలో కరీంనగర్ ఇంచార్జి అధికారిణి శ్రీమతి మాధవి, నాగరాజు తదితరులు ఉన్నారు. ప్రతిరోజు సగటుగా 30 మంది కూలీలు ఇక్కడ పనులు చేస్తూ కనిపించారు. ప్రస్తుతం పెద్దబొంకూర్లో గతంలో బయల్పడిన ఇటుక కట్టడానికి ఉత్తరంగా కల ప్రాంతాన్ని ఎంచుకొని, అందులో ఒక డివిజన్‌గా ఏర్పాటుచేసుకొని 5. 5 మీటర్ల విస్తీర్ణంలో 25 పరికెలుగా (త్రెంచులు) గా విభజించారు. యిందులో ఆరు పరికెల్లో త్రవ్వకాలు జరిపి నెల రోజుల్లో కొంత మేరకు సత్ఫలితాలను సాధించగలిగారు. వీటిలో చాలావరకు, తొలి చారిత్రిక యుగపు ఆనవాళ్ళు, దాదాపు 30 నుండి 60 సెంటీమీటర్ల లోతుగల మట్టి పొరలలో బయటపడ్డాయి. మట్టి పూసలు, శంఖముతో చేసిన పూసలు, ముల్లాపు పూసలు, పచ్చటి బంగారు రేకులతో చేసిన పూసలు, క్రిస్టల్, గాజు, షెలబ్రీడ్స్, కార్నిలియలన్ పూసలు, ఎముకలతో చేసిన చదరంగపు పాచికలు, చిన్నపాటి రింగ్ మట్టి పాత్రలు, కొలత పావులు, దుప్పి లేదా జింక కొమ్ము మొదలగునవి ఈ తవ్వకాలలో బయట పడ్డాయి. ముఖ్యంగా ఈ చారిత్రిక తవ్వకాలలో మొట్ట మొదటిగా ముత్యాల పూసలు లభించటం మొదటిసారని పురావస్తు అధికారులు చెప్పారు. లోగడ ఇలాంటివి ఎక్కడ లభించలేదని, రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి చెప్పారు. యిక్కడ దొరికిన ఒక నాణెం, పూర్వ శాతవాహనులైన గోబద కాలానికి చెందినది కావచ్చునని ఆమె అన్నారు. గోబద కాలానికి చెందిన నాణాలు కోటిలింగాల తవ్వకాలలో దొరికిన విషయం గమనార్హం. పెద్దబొంకూర్‌లో దొరికిన ఎరుపు, నలుపు మట్టి పాత్రలు, పెంకులు, వివిధ రకాలైన లొహపు పనిముట్లు బయటపడటాన్ని గమనించవచ్చు. పెద్దబొంకూర్ తొలి తవ్వకాలలో కమ్మరి కొలిమి కూడా కనుక్కున్నారు.

హెరిటేజ్ సిటీ / సైట్‌గా అభివృద్ధి

పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దబొంకూర్ స్థావరాన్ని హెరిటేజ్ సైట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ 70 ఎకరాల స్థావరంలోనే సైట్ మ్యూజియం ఏర్పాటు చేసి, జిల్లా పురావస్తు శాఖ కార్యాలయాన్ని ప్రారంభించే యోచనని పరిశీలిస్తామని విలేకరులతో పురావస్తు సంచాలకురాలు విశాలాక్షి తెలిపారు. అంతేగాక ఈ స్థావరంలోని 70 ఎకరాల భూమి, దురాక్రమణలకు గురి కాకుండా చుట్టూ కంచె వేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు ఈ స్థావరంలోని కట్టడాలు, చారిత్రిక ఇటుక బావులను ప్రజా ప్రదర్శనకు ఉంచుతామని అన్నారు. పెద్దబొంకూర్ తవ్వకాలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. ఇంతేకాక సమీపంలో వున్న ధూలికట్ట బౌద్ధ స్థావరం వద్ద ఆగిపోయిన తవ్వకాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఇందులకై శాస్త్రీయ సర్వే నిర్వహించదలచామని అన్నారు. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ చెప్పినట్లుగా శాతవాహనులకున్న 30 దుర్గాలలో కోటిలింగాల, ధూళికట్టతోపాటు, పెద్దబొంకూర్ స్థావరం కూడా ఒకటై ఉండవచ్చునని పురావస్తు శాఖాధికారులు భావిస్తున్నారు.

ఈ 70 ఎకరాల స్థావరం చుట్టు కంచె వేయడానికి 14వ కేంద్ర ఆర్థిక సంఘం 1.20 కోట్ల రూపాయలను మంజూరు చేసింది అట్టి నిధులను కేంద్రం విడుదల చేయలేదు. ఈ 70 ఎకరాలలో 30 ఎకరాల స్థలం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తల పట్ల ఈ ప్రాంత చరిత్రకారులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ స్థలాన్ని కాపాడాలని కోరుతూ చరిత్రకారులు డా॥ మలయశ్రీ, సాహితీ కారులు డా॥ కాలువ మల్లయ్య, బాలసాని రాజయ్య, అల్లం వీరయ్య ఆధ్వర్యంలో నలుపు రచయితల సంఘం రచయితలు 20 మంది పెద్దబొంకూర్, ధూళికట్ట స్థూపాల వద్ద ఫ్లెక్సీలను పట్టుకొని తమ నిరసనలను తెలుపుతూ జూన్ 24న ప్రదర్శన చేశారు.

రోమన్ నాణెం (వెండి) - బొమ్మా బొరుసా

ఆ 70 ఎకరాల స్థలాన్నీ ఆర్కియాలజీ శాఖవారికి కేటాయించి జిల్లా ఆర్కియాలజీ కార్యాలయాన్ని మ్యూజియం ఎగ్జిబిషన్ హాలుతోబాటు జిల్లా టూరిజం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు

18

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018