పుట:Ammanudi july 2018.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దబొంకూరు శాతవాహన స్థావరం

తెలంగాణ పురావస్తు శాఖ తవ్వకాలలో బయల్పడిన చారిత్రక యుగపు ఆనవాళ్ళు

శాతవాహన స్థావరమైన పెద్దబొంకూర్‌లో గత మూడు నెలలపాటు జరిగిన పురావస్తు తవ్వకాలు చరిత్రకారులను ఆశ్చర్య పరుస్తుంది చారిత్రక యుగపు ఆనవాళ్ళు ఇక్కడ 920 వరకు దొరికాయి ఈ తవ్వకాలను పరిశీలించిన తెలంగాణా పురావస్తుశాఖ సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి మాట్లాడుతూ, తెలంగాణా క్రీస్తుపూర్వం నుండే సంపన్న ప్రాంతంగా విరాజిల్లినట్లు ఇక్కడ తవ్వకాలలో బయల్పడిన ఆవశేషాలు తెలియజేస్తున్నాయని అన్నారు. జూన్ 8వ తేదీన ఆమె పెద్దబొంకూర్ స్థావరాన్ని సందర్శించి తవ్వకాలలో దొరికిన వివిధ వస్తువులను గూర్చి విలేఖరులతో మాట్లాడారు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన తవ్వకాలపట్ల ఆమె తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో, హైదరాబాద్ - రామగుండం స్టేట్ హైవే మార్గంలో, పెద్దపల్లికి సమీపంలో ఈ స్థావరం ఉంది. 1967, 68, 1973 - 74లలో ఇక్కడ పురావస్తు శాఖవారు తవ్వకాలు జరిపించారు ఇక్కడ 70 ఎకరాలలో ఈ శాతవాహన స్థావరం ఉంది. గతంలో జరిపిన తవ్వకాల స్థలంలో కాక, ఉత్తరం వైపున తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం 25 కందకాలను తవ్వి, సుమారు 3 నుండి 4 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తెలంగాణలో పలుచోట్ల ఇటీవలి కాలంలో తవ్వకాలు జరిపామని, సముద్రతీరము వ్యాపారాలు ఇక్కడి సమీపంలోని గోదావరి నది ప్రవాహాల ద్వారా జరిగాయని, కర్ణమామిడి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలలో జరిగిన తవ్వకాలలో ఆదిమానవుడి అవశేషాలతోపాటు, రోమన్ రాజుల కాలపు బంగారు పూత నాణాలు దొరికాయని విశాలాచ్చి అన్నారు. సుమారు 22 లక్షల రూపాయలు ఈ తవ్వకాలకు కేటాయించామని అన్నారు. సుమారు రెండు వేల ఏండ్ల కిందటి అనేక వస్తువులు బయటపడ్డాయి. వివిధ రంగుల్లో కుండ పెంకులైతే బస్తాలు బస్తాలుగా దొరికాయి. రోమన్ దేశపు చక్రవర్తుల నాణేలు దొరకడం వల్ల తెలంగాణా ప్రాంతము, క్రీస్తు పూర్వం రెండు నుండి, క్రీస్తు శకం నాలుగు వరకు 4 శతాబ్దాల పాటు, రాజుల యుద్ధాలు, ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండటం వల్ల, తెలంగాణా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, సుసంపన్నంగా విరాజిల్లినట్లుగా అంచనా వేయవచ్చునని చెప్పారు. ఇక్కడ గతంలో జరిగిన తవ్వకాలలో పూర్వ శాతవాహనులు, శాతవాహనుల కాలపు రాగి, సీసపు, పంచ్ మార్క్ నాణాలు దొరికాయి. ఇవి రోమన్ చక్రవర్తులు, మౌర్యులు, శాతవాహన రాజుల కాలపు నాణాలు దొరికాయి. ప్రజలు విలువైన ఆభరణాలతో పాటుగా, విదేశీ సముద్ర వాణిజ్యానికి ఆసక్తి చూపారని అన్నారు. రోమన్ చక్రవర్తుల కాలానికి చెందిన టైబీరియన్ వెండి నాణెం ఈ తవ్వకాలలో దొరికిందని, ఇది చెప్పుకోదగ్గ విషయమని అన్నారు. లోహపు పనిముట్లు, మట్టిబొమ్మలు, అచ్చు ముద్రికలు, ఎముకతో చేశిన పాచిక, పలు రకాల సీసపు గాజులు, పిప్శాన్ పూసలు, శంఖు గాజులు వివిధ రకాల నాణేలు దొరికాయి. వీటితో పాటుగా చదరంగపు పావులు, ఇనుప మేకులు, చిరు కత్తులు, ఆవు కొమ్ము గల బొమ్మ లభ్యమయ్యాయి. 90 రోజులపాటు జరిగిన తవ్వకాలను వర్షాకాలం రావడం వల్ల నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ దొరికిన వస్తువులను హైదరాబాద్ మ్యూజియానికి తరలించి, భద్రపరిచి, పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు.

పూర్వ కరీంనగర్ జిల్లా ప్రాంతం తొలి శాతవాహన రాజులకు ముఖ్యమైన పరిపాలనకేంద్రం, వెల్గటూర్ మండలంలోని కోటి లింగాలలో 1979 - 1980, 1983 - 1984 లలో ఉమ్మడి రాష్ట్ర పురావస్తు శాఖవారు నిర్వహించిన తవ్వకాలలో పూర్వ శాతవాహనులు, తొలి శాతవాహన రాజుల కాలపు ఎన్నెన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు గుంటూరు జిల్లా అమరావతి - ధాన్య కటకాన్నే తెలుగునాట శాతవాహన స్థావరంగా పరిగణించే వారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని పైఠాన్ (ప్రతిష్టానపురం) ను శాతవాహన స్థావరంగా గుర్తించారు. 1976లో ధర్మపురికి చెందిన తపాల ఉద్యోగి సంగనభట్ల నరహరి శర్మ కోటిలింగాలలో శాతవాహనులకు చెందిన దుబ్బ నాణాలను కనుక్కోవడంతో, తొలి శాతవాహనులు, పూర్వ శాతవాహనుల స్థావరంగా కోటిలింగాల తెలంగాణా ప్రాంతము ప్రసిద్ధి కెక్కింది. ఇక్కడ రెండు వేల ఏళ్లకు పూర్వమైన మట్టి కోటను కనుగొన్నారు అంతేకాక ఇక్కడ పొలాలలో శాతవాహనుల కాలం నాటి ఇటుక బావులను కనుగొన్నారు రాష్ట్ర పురావస్తుశాఖకు చెందిన ప్రముఖ పురాతత్వవేత్తలు డా॥ పి .వి. పరబ్రహ్మశాస్త్రి, డా॥వి. వి. క్రిష్ణశాస్త్రి , డా॥ఎన్. ఎస్. రామచంద్రమూర్తితో సహా ప్రముఖ పురాతన నాణాల పరిశోధకులు డా॥దేమె రాజిరెడ్డి తదితరులు కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబొంకూర్ స్థావరాలలో దొరికిన నాణాలపై పరిశోధన చేసి ఎన్నెన్నో అంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రాక్

జూన్ 8 న పెద్ద బొంకూర్ స్థావరంలో దొరికిన నాణాలు, పూసలను పరిశీలిస్తున్న తెలంగాణా ఆర్కియాలజి సంచాలకురాలు శ్రీమతి విశాలాచ్చి, ఆం. ప్ర. ఆర్కియాలజి శాఖ విశ్రాంత సంచాలకులు రామకృష్ణ, రిటైర్డ్ ఆర్కియాలజిస్ట్ శ్రీ రంగాచార్యులు, సైట్ ఇంఛార్జి డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ తదితరులున్నారు

16

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018