తెలుగు నేర్చుకొంటున్న శ్రీలంక తెలుగువారు
ఈ వార్త మిమ్మల్ని వింతగొలుపుతున్నదా?! మీరు ఇంతకుముందు 'నడుస్తున్నచరిత్ర' చదువరులై వుంటే మీకిదేమీ కొత్త మందల (సమాచారం) కాదు. కొన్నేళ్ల క్రిందటే తెలుగువారి కార్యకర్తలు శ్రీలంకలో తెలుగువారిని కలిసి, ఆవివరాలను 'నడుస్తున్నచరిత్ర'లో వ్రాశారు. 2014 ఏప్రిల్‌లో తెలుగువాణి, తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యకర్తలు స.వెం. రమేశ్, అడపాల సుబ్బారెడ్డి శ్రీలంక వెళ్లి మరింత కృషిచేశారు. అక్కడి పాములు పట్టే జాతి (అహికుంటికలు) ఎక్కువగా వున్న 2 పల్లెల్లో తెలుగు అక్షరాన్ని పరిచయం చేశారు. దేవరగము, కుడాగమ, అంతర పెద్ద అనే గ్రామాలను స్థానిక తెలుగువారు చేపలచెరువు, పెద్దచెరువు, చీకుముల్లి అడివి అని పిలుస్తారు. అక్కడ వున్న తెలుగువారిలో వడ్డెరలు, మాదిగలు, కంబళ నాయకర్లు (తెలుగు గొల్లలు) పెద్దసంఖ్యలో ఉన్నారు. 'ఆల్ శ్రీలంక తెలుగు కాంగ్రెస్', 'తెలుగు నాయకర్ కాంగ్రెస్' అనే రెండు రాజకీయపార్టీలున్నాయి. ఈ సమాచారంతో వెనుకకు వచ్చిన తర్వాత సింహళ లిపి ద్వారా తెలుగు నేర్పించే పుస్తకాన్ని 'సింహల-తెలుగువాచకం'ను 'తెలుగువాణి' కోసం స.వెం.రమేశ్ తయారుచేశారు. మళ్లీ ఇటీవలే ఆ పుస్తకాలతోను, అక్షరమాల పటంతోను వారు శ్రీలంక వెళ్లి వాటిని అక్కడి వారికిచ్చి, నేర్చుకొనే పద్ధతిని వారికి నేర్పి వచ్చారు. వారితోపాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక తరఫున శ్రీ ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు బృందం కూడా వెళ్లి వచ్చి ఒక సమగ్ర కథనాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పూర్తి పుటలో ఇవ్వడంతోపాటు వారి టి.వి. ఛానెల్ ఎ.బి.ఎన్ కూడా వివరంగా ప్రసారం చేశారు. మున్ముందు అక్కడి తెలుగువారందరికీ తెలుగు పరిచయ పాఠాలు నేర్పించటానికి తెలుగువాణి తలపెట్టింది. శ్రీలంకలో మొత్తం తెలుగువారు 8 లక్షలకు పైబడి మూలవాసులున్నారని, ఈ శతాబ్దంలో వ్యాపారాల నిమిత్తం వెళ్లినవారు ఇంకొందరున్నారని ఇప్పటికి తెలిసిన సమాచారం. ఇంకా లోతుగా పరిశోధన చేస్తే ఇంకొన్ని వివరాలు బయటకు రావచ్చు.
ఇక్కడ మరొక సంగతి చెప్పుకోవాలి. శ్రీలంకను ఏలిన చివరి తెలుగునాయకరాజు శ్రీ విక్రమరాజసింగ గురించిన సమాచారం లోగడే నడుస్తున్నచరిత్ర ప్రచురించింది. 'కండి' ముఖ్య పట్టణంగా శ్రీలంకను పరిపాలించిన ఆయనను బ్రిటీష్‌వారు నిర్బంధించి, రాయవేలూరు కోటలో నిర్బంధించిన సమాచారాన్ని శ్రీమతి డి.పి. అనూరాధ వ్రాసిన కథనాన్ని కూడా లోగడ నడుస్తున్నచరిత్ర ప్రచురించింది.
ఇప్పుడు - జనవరి 30న - విక్రమరాజసింగ 183వ తిథిని గురుపూజగా రాయవేలూరులో పెద్ద ఎత్తున అక్కడి తెలుగువారు జరిపారు. చెల్లియమ్మ గుడి దగ్గర నుండి వారి సమాధి వున్న ముత్తు మండపం వరకు ఊరేగింపు జరిపారు. అన్నినాయుడు సంఘాల కూటమికి చెందిన సదా గోపరామానుజం, మనోహరన్, కవి మురళీకృష్ణ, రాధాకృష్ణ విక్రమరాజుగారి వారసులు, యువకార్యకర్తలు పాల్గొన్నారు.
ఇప్పటికి శ్రీలంక సంగతులు ఇవి. అడపాల సుబ్బారెడ్డి
తమిళనాడులో 'తెలుగువాణి' పాఠాలు
తమిళనాడులో తెలుగు భాషోద్యమ చైతన్యం వెల్లివిరుస్తున్నది. తెలుగువాణి' ట్రస్టు పూనికతో ఉడుమలపేట తాలూకాలో తెలుగు తరగతులు నడుస్తున్నాయి. మార్టూరు వసంతనాయుడు చొరవతో కొన్ని వూళ్లలో తరగతులు నడుస్తున్నాయి. తమిళనాట ద్రవిడపార్టీల రాజకీయాలకు విసిగిపోయిన తెలుగువారు కొత్తచైతన్యంతో, కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. కట్టబొమ్మన, తిరుమలనాయకర్ వంటి వీరులను తమ ప్రతీకలుగా నిలబెట్టుకొని కదులుతున్నారు.
Owned, printed & published by Samala Lakshmana Babu (9440448244) and printed at Sri Mahalakshmi Offset Printers, 16-7-20, Veera Raghavulu Street, Sharabu Bazaar, Tenali, Guntur Dist. and published from 8-386, Jivaka Bhawan, Angalakuduru Post, Tenali Mandal, Guntur Dist. - 522211. Editor : Dr. SAMALA RAMESH BABU (9848016136) RNI-APTEL 14381/7/1/2015 TC