Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనకి కనపడకుండా ఉండే లాగ తన కుర్చీ తిప్పేసుకుని గిడుగు పాఠం చెప్పుకు పోయారు. అయినా ధర్మారావు గారు గిడుగు బొట్టు నియమానికి లొంగకుండా చరిత్ర పాఠ్యాంశులో అనితరమైన ప్రతిభతో అప్పటివరకు విముఖుడైన ఆయనను సుముఖం చేసుకోగలిగారు. కాని బొట్టు ఎన్నడూ పెట్టుకోలేదు. ఈ ఒక్క ఘట్టమే చాలు ధర్మారావుగారి లోని హేతుదాహం గురువులోని సంప్రదాయం దృష్టిని కూడా ఎదిరించి ఎలా నిలిచి గెలిచిందో చెప్పడానికి. ధర్మారావుగారిది కేవలం మానవాభ్యుదయ దృష్టి, ప్రకృతి ధర్మశోధన తృష్ణ, హేతువు లోతులు చూపి అమానవీయతను పార ద్రోలాలన్న కాంక్షే. అందులో బ్రాహ్మణ - బ్రాహ్మణేతర దృష్టికికాక మానవతా చైతన్యానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆచార్యులవారి దుర్బోధలతో పుచ్చిపోయి కుళ్ళిపోయిన అసమ, అమానుష సమాజం కృత్రిమ విలువల వలువలను నిలువునా ఊడ్చి నగ్నంగా నిలబెట్టడం ద్వారా పురుషాధిపత్య దుర్మార్గాన్ని చీల్చిచెండాడమే లక్ష్యంగా రచన చేశారు. సమాజ సమానత్వ సిద్ధాంతం పునాదిగా, ప్రకృతి ధర్మ భావన పతాకంగా "పెళ్ళి- దాని పుట్టు పూర్వోత్తరాలు", "ఇనుప కచ్చడాలు", "దేవాలయాలమీద బూతుబొమ్మ లెందుకు?” వంటి అపూర్వ సత్యశోధన రచనలు ఆయన బుర్రనుండి జాలువారాయి. సృజనకు జనహిత శోధనను జోడించి విలక్షణ, విశేష సాహిత్య సంపదను సృష్టించిన మహనీయుడు తాపీ.

శ్రీకాకుళంలో మొదటి తరగతులు చదువుకుంటున్న రోజులలోనే నిర్హేతుకమైన, నిరర్ధకమైన ప్రగతి నిరోధకమైన సంప్రదాయ పద్ధతులను ఎదిరించి నిలిచే బుద్ధి ధర్మారావుగారిలో అంకురించింది. నూనె కావడి ఎదురురావడం అశుభమనే మూఢనమ్మకాన్ని ఆనాడే ఆయన ఎదిరించారు. పనికట్టుకుని, ఎదురుగా వస్తున్న నూనెకావడిని దాటి ముందుకు వెళ్లారు. వెనుదిరగకుండా, అదురు బెదురు లేకుండా దానికి ఎదురుగా సాగిపోయారు. అప్పుడాయనకు, ఒకనాడు పంచెకట్టుకొని బడికి వెళ్ళాలనిపించింది. ఒక పంచెను కుడిచేతివైపు గోచీ పెట్టి కట్టుకుని బడికి వెళ్ళారు. దానిని గమనించిన మాస్టారు అదేమిటి అందరూ ఎడమగోచీ పెడుతుంటే నువ్వు అలా కట్టావేమిటి అని అడిగారు. అందరూ నవ్వారు. ఎందుకో తెలియక ధర్మారావు మొదట్లో బిత్తరపోయారు. తరువాత అర్ధమయింది. కోపం వచ్చింది. “ఏం, ఇలా కట్టుకోకూడదా?" అని మాస్టారుని ఎదురు ప్రశ్నించారు. నలుగురూ నవ్వుతారని మాస్టారు అన్నారు. బడికి వచ్చినప్పుడు దారిలో ఎవ్వరూ నవ్వలేదే అని ఎదురు వాదించారు తాపీ. అయితే అలాగే కడతావా అని అడగగా అలాగే కడతానని జవాబు ఇచ్చారు. పంచె కట్టినంతకాలం తాపీ అలాగే కుడివైపు గోచీనే పెట్టి కట్టారు. (ఆధారం - తాపీ ధర్మారావు జీవిత సంగ్రహం పేజీ 7-8)

ఒకప్పటి ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర పాలం పనుల స్త్రీల చీరకట్టుకి ఇతర కోస్తాంధ్ర మహిళల కట్టుకి మధ్య ఉండిన తేడా తెలిసిందే. ఒక కట్టుగొప్ప, ఇంకో కట్టు తీసికట్టు అనడంలోని అనౌచిత్యమే గమనించ దగినది. శ్రామిక స్త్రీల కాయకష్టానికి చీర అడ్డుకాకూడదన్న స్పృహను అర్ధం చేసుకోకుండా వారిది తలుపుల కట్ట అని అవహేళన చేసిన వారున్నారు. శరీరాన్ని కప్పుకోవడమే వస్త్రధారణ పరమోద్దేశం గాని ఏ తీరున కట్టారన్నది కాదు. పాశ్చాత్య ఆహార్యాన్ని అనుసరించిన మగవాడు స్త్రీని మాత్రం చాపచుట్టలోని మనిషిలా తెల్లతాను కట్టుకే పరిమితం చేయడానికి తాపత్రయ పడిన రోజులున్నాయి. ఇప్పుడామె జీన్స్ ధరిస్తే, చుడీదార్ వేస్తే స్త్రీల పాశ్చాత్య ఆధునిక వస్త్రధారణ వల్లనే రేప్ లు ముమ్మరిస్తున్నాయంటూ మృగాళ్ళు దుర్మార్గాన్ని పరోక్షంగా సమర్ధించే అత్యాచార్యులు సూటు బూటు వేసుకుంటూ అధికార శ్రేణుల్లో వెలిగి పోతున్నారు.

"ఆ విధంగా చిన్నతనంలోనే అలవరచుకున్న సంస్కరణ భావాలకు తన 17వ ఏటనే తన కుటుంబంలోనే ఆచరణరూపమివ్వనారంభించారు. (జీవిత సంగ్రహం పేజీ 12)

తాపీ ధర్మారావుగారిలోని సంస్కరణాభిలాష, 'అలాగే ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు" అని నాణేనికి రెండోవైపును కూడా చూసి తెలుసుకునే తత్వం, గిడుగు శిష్యుడు కావడానికి ముందే ఆయనలో అంకురించిందని చెప్పడానికే ఇదంతా.

గ్రాంధిక భాషా రచనలో విశేష ప్రతిభ చాటుకొని అనంతరం దాని నిరుపయోగితను, దానిలోని జన వ్యతిరేక లక్షణాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన వాడుకభాషా రచనవైపు మళ్ళి, పాత పాళీ విడిచి కొత్తపాళీ చేపట్టడానికి దోహదం చేసిన మహోన్నతత్వం ధర్మారావు గారిలోని హేతుజిజ్ఞాస నుంచి ఉత్పన్నమైనదే కాని కేవలం గిడుగుపంతులుగారి శిష్యుడైనందువల్లనే సంక్రమించినదికాదు.

అలాగని గిడుగు రామ్మూర్తిపంతులు గారు వ్యావహారిక తెలుగుభాషకు చేసిన గొప్ప కృషిని, సేవను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. గిడుగు గురించి తాపీ స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించవలసి ఉన్నది. "గ్రాంధికాన్ని, గ్రాంధికవాదులను జలగడిగారు. పండితులకు పిడుగయ్యారు. వ్యావహారానికి ముఖ్య గురువయ్యారు”

తెలుగుజాతి పత్రిక

అమ్మనుడి మార్చి 2015

51