Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్ఫూర్తి ప్రదాత

- డా॥ నాగసూరి వేణుగోపాల్

తెలుగు సంగీత సేవను చరిత్ర కెక్కించిన

'గానకళ'
మునుగంటి శ్రీరామమూర్తి

"... 1962వ సం॥ జూన్ నెలలో 'గానకళ' ప్రారంభించాం సంగీతానికి ఆంధ్రప్రదేశంలో ఒక పత్రిక ఉండాలనే భావన సాహసోపేతమైనదే! ఈనాడు మద్రాసు నుంచి ప్రచురితమవుతున్న సంగీత పత్రికలకు కొన్ని దశాబ్దాలకు ముందే నాకీ ఆలోచన కలగడం సాహసమే! పత్రిక ప్రచారం కోసం నాతోపాటు స్వర్గీయ మహేంద్రవాడ కామేశ్వరరావు అనేక పట్టణాలకు తిరిగి కష్టసుఖాలను పంచుకుంటూ పత్రికకు ఎనలేని సేవచేశారు. వారి సేవను నేను ఎప్పుడూ మరువలేను. కనీసం 15, 20 పట్టణాలలో ప్రముఖులను కలుసుకుంటూ, సభ్యులను చేర్పిస్తూ చాలా కృషి చేశాము. ఈ పర్యటన అనంతరం నా ఆరోగ్యం చెడింది. డబుల్ టైఫాయిడ్ బారిన పడ్డాను. 40 రోజులు రుగ్మతను అనుభవించాను. మామూలు స్థితికి రావడానికి వాడిన ఇంగ్లీషు మందుల ప్రభావం ఒక నెలపోయిన తర్వాత నాలో కన్పించింది. ఒళ్ళంతా తెల్లబడింది. - తలతో సహా. ఆస్థితి నుండి బయటపడటానికి నాకు సంవత్సరకాలం పట్టింది. దాని చికిత్సకు వాడని మందు లేదు, చేయని ప్రయోగం లేదు. ఆ 40 రోజులలో ఒక రోజున ఇంజక్షన్ తీసుకొన్నప్పుడు 20 నిమిషాలు నేను పైలోకానికి పోయాను. అంతా అయిపోయిందనే అనుకున్నారు. మొండిప్రాణం కనుకనో ఏమో తిరిగి నేల మీదకి దిగి వచ్చాను. ఈ అనుభవాలన్నీ సంగీత పత్రికను నిలబెట్టాలనే తపనతో ఉన్న చోటనే ఉండక, తిన్నచోట తినక అవిశ్రాంతంగా కష్టపడటం వల్ల వచ్చిన పర్యవసానమే.

ఇలా తన సంగీత మాసపత్రిక 'గానకళ' కోసం పడిన యిడుముల కథను మునుగంటి శ్రీరామమూర్తి 2014 నవంబరు సంచిక 'నాజీవన యానం'లో విపులీకరించారు. నవంబరు సంచికలో. ఇప్పుడే ఎందుకు ఈ సంగతులు రాశారా? అనే సందేహం కలుగుతోంది. 1962 జూన్లో మునుగంటి శ్రీరామమూర్తిగారు సంగీతం కోసం 'గానకళ' అనే పత్రికను ప్రారంభించి - విజయవంతంగా నడుపుతూ ఈ జనవరి 12న తన తొంబైమూడవ ఏట కాలధర్మం చెందారు. అరశతాబ్ధం మించి సంగీతం కోసం ఒక మాసపత్రికను పెట్టి కొనసాగించడం నిజంగా సాహసమే.

మునుగంటి వారితో ముఖాముఖి పరిచయం జరిగి ఒక దశాబ్దం దాటి ఉండవచ్చు! నేను తెలుగు 'స్పోకెన్ వర్డ్స్' విభాగం చూస్తున్న కాలంలో వారిని సంగీత సంబంధమైన అంశం గురించి ప్రసంగించడానికి కాకినాడ నుంచి ఆహ్వానించాను. భౌతికంగా కలవడం 2005లో కావచ్చు కానీ వారి జర్నలిజం మూర్తిమత్వం పరిచయమై మూడు దశాబ్దాలు దాటింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో కనబడిన పత్రికలలో గానకళ ఒకటి - సంగీతానికి ఒక మాసపత్రిక వస్తోందని తెగ సంతోషం కల్గింది. సంపాదకులు మునుగంటి శ్రీరామమూర్తిగారి మీద గౌరవం పెరిగింది. వారెవరో తెలియదు కానీ కృషి గొప్పదని భావించాను. వారి పత్రికను మూడునాలుగేళ్ళు చూసి వుంటాను. తిరుపతిలో ముఖాముఖి పరిచయమైనప్పటి నుంచి వారి సౌజన్యం ఎంతో అనురాగం ఏమిటో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూడగలిగాను. మనిషి పొడుగు కాదు, కొంచెం సగటు ఎత్తుతోనే మూర్తి. దాదాపు తెల్లచొక్కాలోనే వారిని చూసినట్టు గుర్తు. మూర్తి కన్నా వారి మాట మరీ మృదువు. దయాపూరితం. హంగూ ఆర్భాటం లేవు. ఎప్పుడూ నాసలహాలు పత్రికకు అవసరమని కొరేవారు. వయోలిన్ అద్భుతం. ద్వారం వెంకటస్వామినాయుడు గారి 50వ వర్ధంతి కార్యక్రమాలు ఇటీవల చెన్నయ్లో నవంబరు 13,14,15 తేదీలలో జరిగాయి. చివరి రోజున (శనివారం కావడంతో) నేను తేనాంపేట 'తత్వలోక' ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మునుగంటి శ్రీరామమూర్తి గారిని కలవటం, వారు ద్వారం వారి గురించి సవివరంగా, గంభీరంగా ఆంగ్లంలో ప్రసంగించగా వినడం సాధ్యపడింది. లేకపోతే వారిని కలిసి ఉండేవాడిని కాదు. ఆ మధ్య వారి ఆరోగ్యం తీసిపోయి, తర్వాత కుదుటపడ్డారు. అలాంటి మునుగంటివారు ఈ జనవరి 12 న సాయంత్రం అకస్మాత్తుగా మరణించారు. నిజానికి అదే రోజున ఓ సినీ నిర్మాత - దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ గారు కనుమూయటంతో టీవీ చానళ్ళు ఆయన సినిమా పాటలు వాడుకోవడంలో తనమునకలుగా ఉన్నాయి. మరుసటిరోజు మదరాసులో ఈనాడు పత్రికలో చదివేదాకా నాకు తెలియదు. రెండు నెలల క్రితం కలిశాను, హాయిగా మాట్లాడారు - అంతలోనే పోయారని బాధ కల్గింది.

శ్రీరామమూర్తిగారు 1925 మార్చి 25న కాకినాడలో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, మునుగంటి వెంకటరావు. తండ్రి గాయకులు. తాత శ్రీరాములుగారు త్యాగరాజస్వామి శిష్యపరంపరలు ఐదవతరానికి చెందినవారు. వీరి తాతగారు 115 సం॥లో క్రితం (లేదా ఇంకా ముందు) కాకినాడలో శ్రీరామ సమాజం ప్రారంభించారు. అలాగే ఉచిత సంగీత కళాశాలను శ్రీరామమూర్తి తాతగారు మొదలుపెట్టారు. అంతేకాకుండా వీరు గణపతి సంగీత ఉత్సవం పేరున 10 రోజులపాటు ఐదు హరికథలుండటం. శ్రీరామమూర్తిగారు ఈ నేపథ్యం నుంచి వచ్చారు. | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015