Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలో ముఖ్యంగా ఈ కడుపుతీపులో పద్యంలోనూ కనీసం ఒక్క పాదంలో నైనా ఉండకపోవడం అసాధారణం. సరే, కథా ప్రవేశం చేద్దాం.

అది శ్రావణమాసం. బెజవాడ ఆనకట్ట కృష్ణమ్మ అరవై అడుగులకు దాటి రెండు ఒడ్డుల మధ్యనా నిండి, మిగిలినది సముద్రంలోకి వెళ్ళిపోతోంది. వరదలొచ్చాయి. పల్లెల అవస్థలు హెచ్చాయి. పశువుల్నీ ధనధాన్యాల్నీ కాపాడుకోవడం కష్టమైపోయింది. అంత వరదలోనూ కృష్ణలో ఆడువారు, స్నానమాడువారు, పుణ్యకాంతల పూజాపునస్కారాలు చేస్తూనేవున్నారు. సరే మన కథానాయిక అయిన ఇల్లాలు ఇంటాయనతో పిల్లలతో స్నానానికి వెళ్ళింది. భర్త - రేవుని భార్యకి చూపించాడు- భార్య పిల్లల్ని ఒక్కొక్కర్నే స్నానం చేయిస్తోంది, ఇంతలో ప్రవాహంలో తుమ్మముళ్ళ కొమ్మ ఆమెచేయి దగ్గరికి వచ్చేసింది.

'పై కేగుదెంచు నంచుం
గైకొని యాకొమ్మవిసరె గడగా బడగా
నాకొమ్మ, యందు మిసమిస
బ్రాకిన యట్లయ్యె అదియు బామో ఏమో'

- ఎదో పాకినట్లయింది మాత్రమే. భక్తిలో దైవ భయభక్తులుంటాయి. అందులోనూ నోములూ వ్రతాలూ చేసే పాఠకాలం తల్లిగదా "మోపిదేవి సుబ్రహ్మణ్యమూర్తి, నీకు మొక్కు చెల్లిస్తాను, దర్శనానికి వస్తాను. పుట్టలో పాలుపోస్తా, నాపిల్లలకు

పురుగు భయంలేకుండా రక్షించమంది. స్నానంచేసింది. బిడ్డలు కాళ్ళకు అడ్డాలు పడుతూండగా ఇంటికి వచ్చింది. భర్తవచ్చాడు. తరువాత తపాలా ఉత్తరం ఒకటి వచ్చింది. అది అధికారలేఖ భర్తకు మదరాసు బదిలీ, జీతం పెంపునకు చెందిన లేఖ. వారిద్దరికీ ఉన్నవూరు నుండి చెన్నపట్నం వెళ్ళడానికి ఇష్టం లేదు, తప్పదు. ఆలోచిస్తున్నారిద్దరూ. తరువాత రాత్రివేళ భోజనాలు చేశారంతా. ఇల్లాలు "వాన యీదురు గాలి వస్తోంది. ఆ మంచంమీద పిల్లల మధ్య మీరు పడుకోండి" అంది భర్తతో, పిల్లలు "అమ్మా నాన్న దగ్గర పడుకుంటే మాకు నిద్ర రాదు" అని నేలమీద తల్లి దగ్గరే పడుకుని పంతం నెగ్గించుకున్నారు. శ్రీకాకుళాధీశ్వరా! మా పిల్లల్ని జాగ్రత్తగా చూడమని ప్రార్ధించుకుంది. పడుకున్నారు. మధ్యలో పాలకు పిల్లాడేచ్చాడు. తల్లి మేలుకుని తలుపు తీసి బయట కాళ్ళు కడుక్కు వచ్చి, తలుపు వారగా వేసి, చేపు రాగా పాలివ్వడానికి కుమారుణ్ణి తీసుకుని కూర్చొంది. అప్పుడు ఘోరం జరిగింది.

"తెల్లంద్రాచట (తెల్లత్రాచు) అప్పుడామె పయి కుద్రేకించి
దూకెన్ బుసల్
చల్లెం పైబడగార్చె, అంత సుతరక్షా చింతయేదక్కత
కెల్లం ద్రోపడ నాపె పాపశిర మట్టే పట్టె నిర్వీతులన్ (ఇరుచేతులా)
'పిల్లల్ పిల్లలు పిల్లలంచునఱచెన్, బీభత్స కంఠధ్వనిన్"

తెల్లత్రాచును చేత్తో పట్టుకుని తన దగ్గరున్న పిల్లల్ని మంచం మీదకి చేర్చండి. మంచంమీదకి చేర్చండి అనగా, భర్త లేచి పిల్లల్ని మంచంమీదకు చేర్చాడు ఖంగారుగా.

"అయ్యో బిడ్డల జేకొను
డయ్యోబిడ్డల'ని యేడ్చు సంతే కానీ
అయ్యమ్మ పాము బట్టితి
చెయ్యిదిగో కరచునంచు జీర దయారే!

ఆ విషపు తోకతో ఆమె రెండు చేతుల్ని చుట్టేసింది. ఈమె ఆ పాము ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని ఏంచేస్తుందో అని దాన్ని పట్టుకునేవుంది. పాము తలతో కొట్టడం వల్ల చేతులనిండా రక్తం కారింది. వచ్చి చేరిన జనంలో ఒకరు ఉత్తరీయాన్ని పాము తలపై వేసి ఎలాగో చంపేశాడు. ఇల్లాలు గుడ్లు తేలేసింది. ఇంకా చనిపోవదు పిల్లాడు తల్లి శరీరంపై పడినా పాలు విషపుసాలయ్యాయి. ఇవ్వలేని ఆ సందర్భంలోనూ బాధపడింది. పసిబిడ్డల్ని ఉపేక్షించకుండా చూసుకుంటానని భర్తచే శపథం చేయించుకుని 'పసిబిడ్డలు పసిబిడ్డలగంటూనే ప్రాణం విడిచింది.

కొడుకుగుఱ్ఱలకై జంకు గొంకు లేక
పాసె దన ప్రాణముల దృణ ప్రాయముగను
బూటకంబయ్య నిప్పుడీ బోటి వలస, ప్రాణమన్నింటి కంటే తీపనెడి
పలుకు అన్నారు. కవి -

ప్రాణం అన్నింటికంటే తీపే అయినా అంతకంటే కరువుతీపే తీవు - అని ఈకావ్యంద్వారా సందేశమిచ్చారు. వేటూరివారు. ఇది 105 పద్యాల ఖండకావ్యం, ప్రతీపద్యం చిక్కగా ఉండి అందులో తెలుగుదనం చక్కగా నిండిస్తూ కరుణరసస్ఫోకరంగా వ్రాశారు. అంతేకాదు దీనిలో సంస్కృతీ విశేషాలున్నాయి. ఆచారవ్యవహారాలున్నాయి. శ్రీకాకుళం నుండి తప్పనిసరి బదిలీ తెలిసినప్పుడు స్వస్థాన ప్రేమాంశాలు, వాని అనుభూతులూ వున్నాయి.

అంతేకాదు. ఇందులో ఆంధ్రుల గొప్పతనాలున్నాయి. చెన్నపురి వెడితే శ్రీకాకుళస్వామి దర్శనం, కృష్ణానదీస్నానం. ఇవేకాక

"దొరకునో లేదో మధుర వర్తనము గల్గు తెల్గు గేస్తుల చెల్మితీరు మరల” అనుకొంటారు. ఎందుకంటే వారిది తమిళుల కుటుంబం, "ప్రశస్త వస్తు భరితమగు ఆంధ్రభూమిని" కాపురం మళ్లీ వస్తుందా అనుకుంటారు. కృష్ణాప్రాంతం ఊళ్ళ పొలాల ప్రకృతి మళ్ళీ దొరుకుతుందా అనుకుంటారు.

"హృదయమిచ్చి ఆదరించుగృహస్థుల
నడుమ కాపురం బొనర్పగలిగె
కేలు మోడ్పు నీకు కృష్ణాతరంగిణీ
తీరశోభితాంధ్ర దేశలక్ష్మి" అంటారు. ఆ దంపతులు.

'చక్కెర అక్కఱలేనివి చిక్కనిపాల్ గడ్డ పెరుగు
ఉడ్డగు వేయున్ మిక్కిలి చవిగల కూరలు.
చిక్కున్ కృష్ణాస్రవంతి చెంతల యూళ్ళన్' అంటారు వేటూరికవి,
అంతేకాదు

"ఆతిధ్యగౌరవంబును స్వాతంత్య్ర్య ప్రియత, స్వల్పసంతోషము, దుర్నీతినిహీనత, నైచ్యా

పేతత్వము నాంధ్రులందు పేర్పడు గుణముల్" అని కూడా పాత్రలతో చెప్పిస్తారు వేటూరివారు. నిమ్నోన్నతాలు అనడానికి 'వైపువాటములు' అని అనిన తెలుగుకవి వేటూరి ప్రభాకరశాస్త్రిగారే. కడుపుతీపిలో ఉనికితీపి, బాసతీపి, బతుకుతీపి ఇన్ని - ఎన్నో ఉన్నాయంటే చదివితీరవలసిన పొత్తం కదా!

(పొత్తాన్ని అందించిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి ముప్పిడాలు)

రచయిత ఫోన్ : 9292055531

తెలుగుజాతి పత్రిక

అమ్మనుడి

మార్చి 2015