డి.పి. అనూరాధ
వారసత్వం డి.పి. అనూరాధ
తొలి శతాబ్దాల్లో తెలుగువాడు
ప్రపంచంలో అత్యంత సుందరమైన పురుష విగ్రహం అంటే ఇటలీలోని డేవిడ్న పేర్కొంటారు. మైఖేలాంజెలో చెక్కిన ఈ డేవిడ్ విగ్రహం ఫ్లోరెన్స్‌లో ఉంది.
అందమైన స్త్రీ అనగానే మొనాలిసా గుర్తుకువస్తుంది. లియోనార్డో డావిన్సీ చిత్రించిన ఈ పెయింటింగ్ ఇప్పటికీ కూడా ఎందరినో ఆకట్టుకుంటూనే ఉంటుంది.
కానీ డేవిడ్‌ను మించిన శిల్పాలను మన తెలుగు వాళ్లు సృష్టించారు.. మొనాలిసా లాంటి చిత్తరువులు ఎన్నో అజంతా చీకటి గుహల్లో మగ్గిపోతున్నాయి.. ఇవన్నీ క్రీస్తు శకం తొలినాళ్లకు చెందినవి.. ఈనాటిలా ఆనాడు ఇంటర్నెట్ లేదు.
పోనీ మైఖేలాంజెలో.. లియోనార్డో కాలాల్లోని గ్రంథాలు.. శాస్త్రాలు లేని సమయం అది.. మరి వాళ్లకు ప్రేరణ ఎక్కడిది? ఆనాటి సమాజమే వారి కళలకు.. ఊహలకు ఊపిరిపోసి ఉండాలి.. తమ చుట్టూ ఉన్న పౌరులే వారి కళ్లల్లో రూపుదిద్దుకుని ఉండాలి.
మన పూర్వీకులు రాళ్లను శిల్పాలుగా మార్చారు. రాతి గోడల మీద చిత్రాలను వేశారు. ఇవి కేవలం శిల్పాలు కాదు, కేవలం చిత్రాలు కాదు.. కరకు రాతి గోడల మీద కవిత్వాలు.. కథలు అంతేకాదు ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాల ఆవిష్కరణే జరిగింది. మనసుపెట్టి చూడాలే కానీ ఆనాటి సమాజానికి సంబంధించి ఎన్నో కథలు చూపిస్తాయి. ఈ చిత్రాలు.. శిల్పాలు.. ఈ గ్రంథాల ద్వారా ఆనాటి మన తాతముత్తాతలని.. జేజమ్మలని పోల్చుకుందాం..
స్త్రీపురుషుల తారతమ్యం లేదు :
శాతవాహనుల కాలంలో పర్వతాలను తొలిచి పెద్ద పెద్ద రాతి గుహలను బౌద్ధభిక్షువులు నిర్మించారు.. అటువంటి రాతి గుహల్లో ముఖ్యమైనవి మహారాష్ట్రలోని కార్లె గుహాలయాలు.. ఇక్కడి ప్రధాన చైత్యం భారతదేశంలోనే అతి పెద్దది.
ఈ చైత్యం వెలుపల ఉన్నటువంటి స్త్రీపురుషుల నిలువెత్తు జంట శిల్పాలు కళ్లను కట్టిపడేస్తాయి. ఆనాటి స్త్రీపురుషులు చక్కటి శారీరక దారుఢ్యంతో ఉన్నట్టుగా అన్పిస్తుంది. ఆనాడు సమాజంలో స్త్రీపురుషుల మధ్య తారతమ్యాలు లేనట్టున్నాయి. పురుషులు భుజం మీద చేయివేస్తే.. స్త్రీ కూడా భుజం మీదే చేయివేసింది.. పురుషుడు నడుమ్మీద చేయివేస్తే.. స్త్రీ కూడా నడుమ్మీదే చేయివేసినట్టుగా ఈ శిల్పాలు కనువిందుచేస్తాయి.. ఇద్దరూ అన్నిట్లో సమఉజ్జీలుగా అన్పిస్తారు. పురుషుడి ముందు స్త్రీ అణిగిమణిగి ఉండాలనే భావం ఆనాటి సమాజంలో ఏర్పడినట్టులేదు.. ఇంకా
ఇక అలంకరణ విషయానికొస్తే స్త్రీలు ఆనాడు పెద్ద పెద్ద పాపిటి బిళ్లలు.. చెవులకు జూకాలు.. కొన్ని చోట్ల రింగులు.. మెడలో హారం.. చేతికి గాజులు.. కాళ్లకు కడియాలు పెట్టుకునేవారని తెలుస్తోంది. పురుషులకు తలపాగా ఉంది, పంచెకట్టుకున్నారు. ముంజేతికి కంకణాలు ఉన్నాయి.. కొన్ని జంట శిల్పాలు ఉల్లాసంగా ఉంటే.. కొన్ని బుద్ధుడి ప్రార్ధనలో ఉన్నట్టు కన్పిస్తున్నాయి.
2వేల ఏళ్ల కంటే ఎక్కువ వయసు గల ఈ శిల్పాల్లో కొన్ని ఖండితమయ్యాయి. కార్లెలో ఏనుగుల శిల్పాలు కూడా ఆఫ్రికన్ ఏనుగుల్లా చాలా పెద్దగా అన్పిస్తున్నాయి.
అమరావతి అద్భుతాలు :
కార్లె తరవాత అమరావతి శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. అయితే అమరావతిలో రాతిఫలకాలపై శిల్పాలను తొలిచారు.. కార్లెలో రాతి కొండలనే శిల్పాలుగా మలచారు. అమరావతి శిల్పంలో కూడా పురుషుల 27 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015