భాషోద్యమం మాదిరాజు రాంబాబు
భావోద్వేగమే చాలదు!
ఒక రచయిత 'గుండెలు బాదుకుంటే తెలుగు వెలుగుతుందా?' అనే వ్యాసంలో భాషోద్యమకారులను వెటకరించారు. ఇది 2011 నాటి మాట. దానికి ఆనాడు సమాధానం చెప్పడానికి తగిన సందర్భం రాలేదు. అయితే 'నడుస్తున్న చరిత్ర' పత్రిక చితాభస్మం నుంచి రెట్టించిన ఉత్సాహంతో పైకి లేచిన ఫినిక్స్ పక్షిలా మళ్ళీ 'అమ్మనుడి"గా పుట్టుకొచ్చిన సందర్భంలో ఆయన వెటకారాన్ని ప్రస్తావించడం సరైనదిగా భావించాను.
ఏదైనా ఒక ఉద్యమంలో కాడెద్దులులాగా 'ఉద్వేగం’ (భావజాలం–ఐడియాలజీ), 'హేతుబద్ధత' (సిద్ధాంతం-థియరీ) రెండూ సమన్వయంతో నడుస్తాయి. ఉద్యమానికి ఇంధనంగా ఉండే ఆ రెండూ పరస్పర పూరకాలుగా కొనసాగుతాయి. అంటే భాషోద్యమానికి సిద్ధాంతవేత్త ఎంత ముఖ్యమో, భావజాలవేత్త కూడా అంతే అవసరం. అంటే ఉద్వేగమూ, హేతుబద్ధతా తగుపాళ్ళలో ఉంటేనే ఏ ఉద్యమమైనా విజయవంతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు వెలుగు కోసం గుండెలు బాదుకొనే తెలుగువాళ్ళున్నట్లే, ప్రణాళికలు, పథక రచనలు చేసే సిద్ధాంతకర్తలు అవసరం. తెలుగు ఉద్యమానికి ఉద్వేగం మాత్రమే ఉందని విమర్శిస్తూ, దాని హేతుబద్ధతను ప్రస్తావించని ఆ రచయిత తెలుగు భాషోద్ధరణకు కొన్ని అమౌలిక చిట్కాలు సూచించారు.
ఐక్యరాజ్య సమితి రూపొందించిన అంతరిస్తున్న భాషల జాబితాలో తెలుగు భాష కూడా చేరేసరికి వివిధ తెలుగు మేధావుల శ్రేణుల్లో అందోళన మొదలయ్యింది. సమకాలీన అవసరాలకు తగినట్లుగా తెలుగు ఎదగ లేకపోయింది. ఆధునికీకరణ ప్రక్రియ కొరవడి, తర్వాతి తరాలు ఉపాధి భాషగా అంగ్లాన్ని ఎంచుకుంటున్న కారణంగా అసలు భాష ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్న భయం సర్వత్రా వ్యాపించింది. ఇంగ్లీషు మాధ్యమ విద్య కారణంగా అమ్మనుడి నాశనమైపోతోందని వాపోతున్నవారు కొందరు. నిత్య వ్యవహారంలో ఇంగ్లీషు వాడకం పెరిగిన కారణంగాను, పత్రికల్లో, టీవీ చానళ్ళలో భాష సంకరమై పోతున్నదని చింతించేవారు మరికొందరు. తెలుగు పుస్తకాలకు సాహిత్యానికి ఆదరణ తరిగిపోతున్నదని ఆవేదన చెందేవారు మరికొందరు. ఇతర భాషాజాతీయులు ఇద్దరు కలిస్తే వారి భాషలోనే మాట్లాడుకుంటారని, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం అమ్మనుడిలో కాక ఇంగ్లీషులోనో మరి ఇతర భాషల్లోనో మాట్లాడుకుంటారన్న చలోక్తి ప్రచారం ఉంది. దానికితోడు తెలుగు భాషా జాతీయుల ప్రాంతీయ, మాండలిక వైవిధ్యాలను అర్థం చేసుకోలేని రాజకీయ నాయకుల హ్రస్వదృష్టి, అవివేకం, లాభాపేక్షల కారణంగా ప్రాంతీయ వైషమ్యాలు ఉనికిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రామాణిక తెలుగు భాష భావన సంక్షోభంలో పడింది. ప్రామాణిక తెలుగు భాష సంబంధిత మాండలికాలన్నిటి సంగమ స్థానంగా, సంశ్లేషిత రూపంగా కాక ఏదో ఒక ప్రాంత మాండలిక ఆధిపత్యానికి సాధనంగా మారింది. దాంతో మిగిలిన మాండలిక వ్యవహర్తల్లో రగిలిన అసంతృప్తి తమ మాండలికాన్ని ఒక ప్రత్యేక భాషగా, తమను తాము ప్రత్యేక భాషాజాతీయులుగా ప్రకటించుకునే ధోరణి కూడా తలెత్తింది. మరికొందరు తెలుగు భాష అగ్రవర్ణ వ్యక్తీకరణంగా ఉన్నందువల్ల తమ అస్తిత్వాల అభ్యున్నతి అమ్మనుడి ద్వారా సాధ్యం కాదని, వర్ణ వివక్షకు తావులేని ఆంగ్ల భాష నేర్చడం ద్వారా మాత్రమే కులవివక్షను ఎదుర్కొని వికాసం పొందగలమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు భాషకు పట్టబోయే దుస్థితికి కారణాలను అన్వేషించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ దాదాపు 18కోట్ల మంది దాకా వ్యవహర్తలున్న తెలుగు భాష అంతరించిపోతుందని భయపడడం నిర్హేతుకమని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు పత్రికా పాఠకుల సంఖ్య, సాహిత్య పాఠకుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, తరగడం లేదు. 'పదుల సంఖ్యలోనో, వందల సంఖ్యలోనో వ్యవహర్తలు మిగిలిన పురాయుగపు ఆదివాసీ భాషల మాదిరిగా తెలుగు కూడా అంతరించిపోతుందని భయపడడం నిర్హేతుకమ'ని మరికొందరి వాదన. ఒక నిర్దిష్ట పర్యావరణంలో మనుగడలో ఉన్న సమాజంలోని భౌతిక, బౌద్ధిక ఉత్పత్తి వ్యవహార కార్యకలాపాల అవసరాలకనుగుణంగా వ్యక్తుల చైతన్యానికి, సంకల్పానికి అతీతంగా వస్తుగతంగా ప్రజల మధ్య ఏర్పడే 'శబ్ద సంకేత వ్యవస్థ'ను భాష అని పిలుస్తారు. భూగోళంలో పర్యావరణ వైవిధ్యానికి అనుగుణంగా వివిధ భాషలు ఉనికిలోకి వచ్చాయి. దృగంశాల (పైకి కనిపించే దృశ్యమాన ప్రపంచ) వాస్తవికత నుంచి ప్రపంచ (ప్రకృతి సమాజం) అంతర్గత నియమాల అంతస్సారంలోకి మనిషి జ్ఞానాభివృద్ధి క్రమం లోతుగా కొనసాగి కొద్దీ అనంతమైన సాపేక్ష సత్యాలు ఉనికిలోకి వస్తుంటాయి. ఈ నిరంతరాయమైన జ్ఞానాభివృద్ధి క్రమంలోని వివిధలను అర్థం చేసుకునేందుకు వీలుగా సరికొత్త పారిభాషిక పదాలు రూపొందించు కావాల్సి ఉంటుంది. దాంతో సాధారణ వ్యవహారిక భాష వునాదిగా వివిధ విజ్ఞాన శాస్త్ర రంగాల్లో అందుకు అవసరమైన పారిభాషిక పదజాలం ఏర్పడుతుంది. ఆయా సమాజాలలోని ఉత్పత్తి కార్యకలాపానికి అనుబంధంగా సాగే శాస్త్రసాంకేతికాభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చెందే శాస్త్రాల అవసరాల కోసం పుట్టుకొచ్చే పదసంపద, భాషలను 'కృతక భాష'లని అంటారు. దృగంశాల పునాదిగా సాగే సామాజిక వ్యవహారాల కోసం మనుషులు వినియోగించే వ్యవహారిక భాషను 'సహజ భాష' అని పిలుస్తారు. ఈ సహజ భాష పునాదిగా వివిధ శాస్త్రాల పారిభాషిక పదజాలంతో 'కృతక భాష' రూపొందుతుంది. రెండూ అవిభాజ్యమైనవే. ఆయా సమాజాలు సాధించిన అభివృద్ధి స్థాయిని బట్టి ఆ రెండింటి వికాసాలుంటాయి.
ఒక జాతీయ భాషలోని సహజ, కృతక భాష అనే రెండు అంశాలూ పరస్పర ఆశ్రితాలుగా, పరస్పర పూరకాలుగా, పరస్పర ప్రభావితం అవుతూ కొనసాగుతాయి. ఆచరణ, జ్ఞానం ఎలా అవిభాజ్యమైనవో ఇవి రెండూ ఒక భాషలో అంతర్భాగాలు. వ్యవహారిక భాష ప్రజలదని, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల భాష శిష్ట వర్గాలదని సూత్రీకరించడం. పొరపాటు. సహజ భాషల పునాదిగానే కృతక భాషలు ఉద్భవించి తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015