Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు రాష్ట్రాలలో, తెలుగు వారి కోసం పనిచేసే ఉద్యోగాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారే అవసరం అవుతారు. కాబట్టి ఈ దిశగా ఆలోచించి తెలుగు మాధ్యమంలో డిగ్రీ కాని, పి.జి కాని చదువుకొంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావు అనే భయం లేదు - అని తెలుగు రాష్ట్రాలు రెండూ యువతరానికి కచ్చితమైన సందేశాన్ని, ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగితే, యువతరం తప్పకుండా తెలుగు మాధ్యమంలో చదవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇటు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఉద్యోగాలకు పోయే వారు ఎంత సంఖ్యలో ఉంటారు. అలా భావించే వారికోసం కొద్ది సంఖ్యలోని ఇంగ్లీషు మాధ్యమ విద్యాసంస్థలు చాలవా? పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు తెలుగు వారి కోసం తెలుగులో పనిచేయవలసిన అవసరం ఉన్నప్పుడు తెలుగు మాధ్యమంలో మీరు చదువుకోండి అని చెప్పడం తెలుగు రాష్ట్రాల బాధ్యత అని తప్పక చెప్పాలి. ఈ దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం తన భాషా విధానాన్ని సత్వరం ప్రకటించవలసిన అవసరం ఉంది. అటు పాఠశాల విద్యను ఇటు ఉన్నత విద్యను ప్రైవేటు రంగానికి వదిలి వేయకుండా తన అధీనంలో ఉంచుకుంటే, భాషా విధానాన్ని ప్రభావ వంతంగా అమలు చేసే వీలుంటుంది.

తెలుగు అకాడమీ కూడా విడిపోయి రెండుగా మారినా తెలంగాణలో తెలుగు అకాడమీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ సంస్థను తెలంగాణ భాష వ్యూహాలకు అనుకూలంగా పాఠ్యపుస్తకాలను పాఠశాల స్థాయినుండి, పి.జి స్థాయి వరకు తయారు చేసే మంచి సంస్థగా అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. పైన చెప్పిన పద్ధతిలో దీనికి ప్రత్యేకమైన శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల భాషగా అవతరించడం ఎలా? దాన్ని అన్ని తెలంగాణ జిల్లాలలో ఉన్న యాసల వారికి సమంగా బాగా అర్ధం అయ్యేలా భాషాశైలి ఎంపిక ఎలా అన్నది కత్తిమీది సాము వంటిది. కొద్ది క్రియాపదాలనో కొన్ని బహువచన రూపాలనో తెలంగాణ భాషలోనికి వాడినంత మాత్రాన సరిపోదు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ఈ పాఠ్య పుస్తకాల భాష ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందో రూపకల్పనలోనే బోధపడవలసి ఉంది. ఇందుకు అనుభవజ్ఞులైన భాషా వేత్తలు కలిసి పనిచేయవలసి ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి వ్యూహాలు, కార్యాచరణలు:

రెండు తెలుగు రాష్ట్రాలలో సాహిత్య ప్రక్రియలు అన్నీ సమానంగా ఉన్నాయి. పద్యకవిత, వచన కవిత, కథ, నవల, గల్పిక, పాట, నోటి సాహిత్యం ఇలా అన్ని ప్రక్రియలు రెండు ప్రాంతాలలో ఉన్నాయి. ఈనాటి కవులు, రచయితలు రెండు ప్రాంతాలలో సాహిత్య సృజన చేస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల వారు సాహిత్య అకాడమీలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. ఒక ఉదాహరణని ఇక్కడ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ నవలలను పోటీకి ఆహ్వానించింది. ఈ ప్రకటన కేవలం తెలంగాణకే పరిమితం కావడం అవసరమా? ఇదే పని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినప్పుడు, తన పదమూడు జిల్లాలకే పరిమితమై కవులు రచయితల సృజనలను ఆహ్వానించవచ్చా? ఇలాంటి ఇతర సాహిత్య కార్యక్రమాలను ఈ రెండు తెలుగు రాష్ట్రాలు చేసినప్పుడు

రెండు ప్రభుత్వాలకు ఉమ్మడి ప్రణాళికలు, వ్యూహాలు ఉంటే మంచిదా? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం. ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రాంత సాహిత్యకారులకు రావలసినంత గుర్తింపు రాలేదని ఒక ఆరోపణ మేధావులనుండి ఉంది. దానికి ఎన్నో సంవత్సరాలు సారథ్యం వహించినది తెలంగాణ ప్రముఖుడు దేవులపల్లి రామానుజరావుగారు అన్న విషయం గుర్తుంచు కోవాలి. ఈ వివాదాల దృష్ట్యా తెలుగు సాహిత్య కార్యక్రమాలలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి వ్యూహాలు ఉండాలా? ఉంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని మేధావులు చర్చించాలి. దీని తర్వాత ఉమ్మడిగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. తెలుగుకు ప్రాచీన హోదాని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. తమిళ భాషను కేంద్రం ప్రాచీన భాషగా గుర్తించిన తర్వాత, మునకి వేడి పుట్టి, ఆదిశగా కృషిని పోరాటాన్ని సాగించాం. తెలుగు భాష ప్రాచీనతని తిరిగి బయటికి తోడి, కొత్త చరిత్రని ఆవిష్కరించుకొన్నాము. మన ఉమ్మడి పోరాటాల ఫలితంగా తెలుగుకు కేంద్రం ప్రాచీన హోదాని కల్పించింది. కాని తమిళ ప్రభుత్వం వారికి కేటాయించిన రెండు వందల కోట్ల రూపాయలను వినియోగించుకుంటూ తమిళ భాషావికాసానికి, తులనాత్మక అధ్యయనానికి సాహిత్య అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉంది. Central Institute of Classic Tamil అనే సంస్థను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంది. మనం పోరాడి తెచ్చుకున్న తెలుగు ప్రాచీన భాషా హోదాకి వచ్చే ఫలాలను పొందడానికి కావలసిన ఏ కృషిని గట్టిగా ఇంతవరకు చేయలేదు. కనీసం సంస్థకు అవసరమైన స్థలాన్ని కూడా చూపలేని స్థితిలో ఆ సంస్థని మైసూరులో ఉన్న భారతీయ భాషల సంస్థ (CIIL) కు అప్పగించారు. ప్రాచీన తెలుగు కోసం ఏర్పడిన సంస్థ కర్ణాటక రాష్ట్రంలో ఉండి పనిచేయడం ఎంత హాస్యాస్పదమో ఆలోచించాలి. ఉమ్మడి రాష్ట్రంలో దీనికి సంబంధించిన ప్రగతి జరగలేదు. ఇక రాష్ట్ర విభజన ఉద్యమం దానిపైని ధ్యాసలో ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రాచీన భాషా కార్యకలాపాలపైన దృష్టి పెట్టలేకపోయింది. దీనికి కేటాయించే రెండు వందల కోట్ల రూపాయిలు రెండు రాష్ట్రాలకు చెందుతాయి. ప్రాచీన సాహిత్యం విషయానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాచీన సాహిత్యం అంతా తుల్యమైనదిగా చెప్పవచ్చు. తత్సమ బహుళ కావ్యాలు తీసుకున్నా, ద్విపద కావ్యాలు గ్రహించినా, అచ్చ తెలుగు కావ్యాలు పరిశీలించినా రెండు ప్రాంతాలలోని కవులు సమంగా కృషిచేశారు. నన్నయ తత్సము బహుళ భాష పోతన భాష భిన్నమైనవి కావు, కాబట్టి ప్రాచీన భాషాసాహిత్యాల అధ్యయనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి వ్యూహం అవసరం. ప్రాచీన తెలుగు సంస్థ ఏర్పాటు విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయవలసిన అవసరం కూడా ఉంది. రెండు చోట్ల రెండు సంస్థలను ఏర్పాటు చేసుకున్నా, కార్యక్రమాల రూపకల్పనలో, ఆచరణలో ఇద్దరికీ ఉమ్మడి వ్యూహాలు ఉండడం రెండు రాష్ట్రాలకు ప్రాచీన తెలుగు సాహిత్య పరిశోధనలకు లాభిస్తుంది. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015