Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్య కార్పొరేట్ రంగంలోనికి పోతూఉంటే, ప్రభుత్వ విధానాలు వాటికి అనుకూలంగా ఏర్పడ్డాయే తప్ప, విద్యను ప్రభుత్వ రంగమే ప్రధానంగా అమలుచేసే శక్తిగా ప్రభుత్వం అడుగులు వేయలేదు. ఈ నేపథ్యంలో తెలుగు అకాడమీ చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మిగిలింది.

ఈ నేపథ్యంలో తెలుగు వికాసానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఏవిధమైన వ్యూహాలు రచించుకోవలసి ఉంది అని ఇక్కడ చర్చించడం చాలా అవసరం.

పాలన భాషగా రెండు రాష్ట్రాలలో తెలుగు: పరిపాలన భాష విషయంలో పరిశిష్ట ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక సౌకర్యం ఉంది. అమలు కావలసిన భాషా స్వరూపం గురించి విధానం గురించి అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రం చేసిన విధానాలు దీనికి చాలా వరకు ఉపకరిస్తాయి. అయితే అధికార భాష అమలుకు సంబంధించి తెలుగు అధికార భాషా సంఘాన్ని అది పునరుద్ధరించుకోవలసి ఉంది. అయితే అయిదేండ్ల కొకసారి లేదా మూడేండ్లకొకసారి ఏర్పాటు చేసేది. గాని, మంత్రిత్వ శాఖ గురించి గాని ఒక మాట లేదేం? దీనికూడా బైటినించి పెట్టుబడులు కావాలా ఏం? అందునా ప్రభుత్వం ప్రతిసారీ నియమించే కొత్త సభ్యుల పద్ధతి అంత ఫలవంతంగా లేదని ఇంతకుముందు చాలా సార్లు ఋజువు అయింది. సభ్యులను అధ్యక్షుడిని నియమించిన ప్రతిసారి అది రాజకీయ నియామకం అని విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. సాహిత్యవేత్తలకు భాషాప్రణాళిక రచనలకు చాలా అంతరం ఉందని, సాహిత్యవేత్తలు అందరూ భాషావేత్తలు కాని, ప్రణాళికాకారులుగా కాని పనికిరారని ప్రభుత్వాలు గ్రహించలేకపోయాయి. ఈ విషయాన్ని అలా ఉంచితే. అప్పటి అధికార భాషా సంఘాలు పాలనాభాష కోసం చేసిన ప్రయత్నాలు, రూపొందించిన విధానాలు చాలా వరకు ఉపయుక్తమైన వాటిని గ్రహించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి అమలు చేసిన భాష ప్రమాణ భాష పేరుతో గోదావరి మాండలికాన్ని వినియోగించారు అనేది అప్పటి విమర్శ. తెలంగాణ ప్రాంతానికి ఈ భాష ఆమోదయోగ్యం కాదని తెలంగాణ మేధావులు వాదిస్తూ వచ్చారు. కాని ఈ భాష పరిశిష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయుక్తంగానే ఉంటుంది. దీనివల్ల కొంత రాష్ట్ర ప్రభుత్వానికి పని తగ్గే వీలుంది. కాని ఈ భాషను అమలుపరచే శాశ్వత యంత్రాంగం ఒకటి ఆ రాష్ట్రానికి అవసరం ఉంది. ఇది ఇంతకు ముందున్న అధికార భాషాసంఘం లాంటిది కాక ఒక సంపూర్ణమైన కార్యాలయం శాశ్వత ప్రాతిపదికన ఉండి, అందులో విశ్వవిద్యాలయ ఆచార్యుల స్థాయితో సమంగా ఉండే భాషావేత్తల పదవులు ఉండి, వారి నియామకం పూర్తిగా విషయోపయోగ దృష్టితో జరగాలి. ఇక ఈ శాశ్వత కార్యాలయాన్ని నడపడానికి ఒక అధ్యక్ష పదవిని ఉపాధ్యక్ష పదవిని పాలక మండలిని పూర్తిగా పారదర్శకంగా విషయైక దృష్టితో ఏర్పాటు చేయాలి. అధ్యక్షుని పదవిని తెలుగు అకాడమీ అధ్యక్షుడు లాగా మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చినా పూర్తిగా భాష అమలు చేయగలిగే భాషా వేత్తలతో నియమించినా, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసే వ్యవస్థ పూర్తిగా కొనసాగుతూ ఉంటుంది గనుక అధ్యక్షుడు, పాలక మండలి విధాన నిర్ణయాలు తీసుకున్నా, దాని పాలన ఒడిదుడుకులు లేకుండా నడిచే వీలుంది. అంతే కాదు అధికార భాషాసంఘాన్ని నియమించడంలో విపరీతమైన జాప్యం జరిగినా కూడా శాశ్వత ప్రాతిపదికన చేసే వ్యవస్థ వల్ల కార్యకలాపాలు కుంటుపడకుండా ఉంటాయి. నవ్యాంధ్రప్రదేశ్ ఈదిశగా ఒక శాశ్వత ప్రాదిపదికన పనిచేసే ఒక వ్యవస్థని పరిపాలనా భాష అమలుకోసం ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి వ్యవస్థే తెలంగాణ రాష్ట్రానికి కూడా అవసరం అవుతుంది. పాలన ఎలా ఉండాలి, అమలు విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని పైన చెప్పిన వ్యవస్థ నిర్ణయిస్తుంది. అలాగే నియంత్రిస్తుంది. గ్రామ పంచాయితీ కార్యాలయం దగ్గరనుండి పైనున్న సచివాలయం దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అధికార భాషని అమలు చేసే అధికారం, భాషా స్వరూపాన్ని నిర్ధారించి కార్యాలయాలకు నిర్దేశించే అధికారం పూర్తిగా ఈ సంస్థకు దఖలు పరచాలి. అమలు చేయని కార్యాలయాల పైన అధికారులపైన చర్య తీసుకునే అధికారం ఈ సంఘానికి ఇవ్వాలి. గత ప్రభుత్వాలు అధికార భాషా సంఘానికి ఈ అధికారాలను ఏ మాత్రం ఇవ్వలేదు. ఈ కారణంగానే అధికార భాషా సంఘం కాగితాలు పంపే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 |