పుట:Ammanudi April-July 2020.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్పష్టంగా ప్రకటించింది. ఆర్థిక, సామాజిక సమస్యలన్నిటికీ పరిష్కారం ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నదని వారు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ విషయాన్నే ముఖ్యమంత్రిగారు చట్టసభల్లోనే స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు, భారతదేశంలో అన్ని ఇతర రాష్ట్రాల కంటే ముందుగా తామే ఈ విషయంలో తొలి అడుగు వేశామని, దేశంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచామని అన్నారు.

దీనితోపాటు తొలి ఏడాదిలోనే పాలనా రంగంలో తెలుగును పూర్తిగా అణచివేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగులో పాలనా వ్యవహారాలను నిర్వహించేందుకు ఏ అధికారీ ప్రయత్నించడం లేదు! కనుక కీలకమైన పాలన, బోధన రంగాలు రెండింటిలోనూ తెలుగును పాలకులే అణచి వేస్తున్నారన్నది నూటికి నూరుపాళ్లూ నిజం.

ఏ భాష అయినా వినియోగించుకొనే కొద్దీ వికసిస్తుంది. సమకాలీన రంగాలన్నిటిలోనూ ఎంత పట్టుదలగా వినియోగిస్తే అంత బాగా ఆ భాష వికసిస్తుంది. ఇది ప్రపంచమంతటా నిరూపితమవుతున్న శాశ్వత సత్యం. మన దేశాన్ని దురాక్రమణ చేసిన ఆంగ్లేయుల భాష స్వాతంత్ర్యానంతరం మన నాయకుల అసమర్ధతవల్ల, దార్శనికతా లోపంవల్ల హాయిగా ఇక్కడ రాజ్యం చేస్తున్నది. అది లేకపోతే బ్రతకలేమనే స్థితికి జాతి జనులను తెచ్చి, ఇప్పుడు అదే మీకు దిక్కు చెప్పినట్లు పడివుండండని ప్రజలను పాలకులు ఆదేళిస్తున్నారు. ఇందుకా, భాషారాష్ట్రాల కోసం మన పెద్దలు త్యాగాలు చేసింది! ఇదేనా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లలో మనదే తొలి అడుగు అని మనం ప్రకటించుకొన్న ఫలితం? మాతృభాషను ఒక 'భాషగా' మాత్రమే నేర్చుతాం అంతవరకు సరిపెట్టుకోండి అంటున్న ప్రభుత్వ గడుసుతనానికి పరిష్కారం ఏమిటి?! మాధ్యమంగా బోధించని భాష, వినియోగంలో లేని భాష- బతికి బట్టగడుతుందా?!

ఆంధ్రప్రదేశ్‌ లోనే కాదు, ఈ ప్రమాదం ఇప్పుడు దేశమంతటా వ్యాపిస్తోంది, నెమ్మదిగానైనా! మాతృభాషలకు రానున్న ముప్పును 20 ఏళ్లనాడే యునెస్కో హెచ్చరించింది అందుకే ఇప్పుడు ఈ పతనక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే సారధ్యం వహిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే-అందునా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే ముందడుగు.

మాతృభాషలను బోధన, పాలన రంగాల్లో పూర్తిగా వినియోగించుకోవడం అనే అంశాన్ని ఇప్పుడు ఒక జాతీయ సమస్యగా చర్చలోకి తేవాలి. బోధన, పాలన రంగాల్లో నిపుణులను, బాధ్యులను, రాజకీయవేత్తలను, న్యాయవేత్తలను అందరినీ ఈ చర్చలోకి తేవాలి. దీనికి సంబంధించిన అనేక అంశాలతో పాటు రాష్ట్రాలను, కేంద్రాన్ని- మాతృభాషల సంరక్షణపై ఒక జాతీయ విధానానికి అంగీకరింపజేయవలసిన అత్యవసరం ఏర్పడిందని మనం గుర్తించాలి. ఈ ఉద్యమం కూడా ముందుగా తెలుగు రాష్ట్రాల్లోనే, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలు కావాలి. మాతృభాషల రక్షణకై రాజ్యాంగాన్ని కూడా తగువిధంగా సవరించవలసివుందని కొందరు పెద్దలు చెప్తున్న సంగతిని కూడా పట్టించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లడం వల్ల మళ్లీ మొత్తం విషయం ఆ స్థాయిలో చర్చకు దారి తీసున్నది. కర్నాటక వ్యాజ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్చు రాజ్యాంగ ధర్మాసనం నుంచి వచ్చింది. దానిని తిరగతోడాలనే ఆలోచనకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయి. విద్యాహక్క్ములు, మానవహక్కులు, మాతృభాషలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వంటి అంశాలెన్నో చర్చకు వస్తాయి. రానివ్వండి. విద్య భాషారంగాల్లోని సమస్యలకు కోర్టులే ఏకైక పరిష్కార వేదిక కాకపోయినా వాటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అసలు విద్యారంగాన్ని కనీసం పాఠశాల స్థాయి వరకైనా ప్రయివేటు రంగాన్నుంచి తొలగించి, ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాలనే బలమైన అంశం ఉండనే ఉంది.

ప్రజల భాషలను కాపాడుకోలేని ప్రజాస్వామ్యం ఎవరికోసం?! ఉద్యమాలు చరిత్రను నిర్మాణం చేస్తాయి. అదెక్కడా ముందుగా రాసిపెట్టి ఉండదు. తెలుగు ప్రజల సత్తాకిది పరీక్షాసమయం.

తేదీ : 29-6-2020

మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం

విద్యార్ధి చదువుకు అడ్డంకిగా మారుతుంది - “యునెస్మో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జులై-2020

8