పుట:Ammanudi April-July 2020.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదక హృదయం


సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య


పాఠశాలల నుంచి తెలుగు మాధ్యమాన్ని తొలిగించి, పూర్తిగా ఆంగ్లమాధ్యమాన్ని నిర్బంధం చేస్తూ 2019 నవంబరులో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు 81, 85లను కొట్టివేస్తూ 2020 ఏప్రిల్‌ 15న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 92 పుటల తీర్పులో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. కోర్టును ఆశ్రయించినవారు ఏం కావాలని అడిగారో, దానికి మాత్రమే తీర్చు సారాంశం పరిమితం అయినా, దానికి సంబంధించిన విస్తృతాంశాలను న్యాయమూర్తులు తమ తీర్పులో చర్చించడం విశేషమే. అధ్యయనం చేసి దాచుకోదగిన 'పత్రం'గా ఆ తీర్చు రూపొందింది. మాతృభాషా మాధ్యమం ఆవశ్యకతను జాతిజనులకు తెలియజెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నేతలు మాత్రం దీనిని ప్రశాంతంగా స్వీకరించలేకపోయారు. ఆధికార పార్టీ తన రాజకీయ అజెండాను నెరవేర్చుకొనేందుకు మరింత పట్టుదల వహించింది. మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్చను తమకు అనుకూలమైన విధంగా మలచుకొనేందుకు పూనుకుంది. కోర్టులకు ఏదో విధంగా నచ్చజెప్పి తమ దారిని సుగమం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాధ్యమం అనేది విధానపరమైన నిర్ణయం అని కోర్టుకు విన్నవించింది.

“మాధ్యమం అనేది విద్యాశాఖ గానీ రాష్ట్రంగానీ తీసుకొనే విధానపరమైన నిర్ణయం. భాషకు సంబంధించిన విధానాన్ని ఎలా మెరుగ్గా అమలుచేయాలో రాష్ట్రానికి తెలుసు. ఇది కోర్టులు జోక్యం చేసుకొనే అంశం కాదు అని ఇంగ్లీష్‌ మీడియం స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్నాటక వ్యాజ్యంలో సుప్రీం కోర్టు తీర్చు ఇచ్చింది అని నివేదించింది. అత్యధిక శాతం తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమాన్ని కోరుకొంటున్నారని తాము తయారుచేసుకున్న లెక్కలను చూపించింది. తమ ప్రభుత్వం ఆంగ్లమాధ్యమాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం చర్యలను తీసుకొంటున్నట్లు, దీనివల్ల సామాజిక, ఆర్థిక వివక్షతలు కనుమరుగై, వాటికి అతీతంగా అందరికీ సమానమైన అభివృద్ధి అందుతుందని తెలిపింది.

తెలుగు మాధ్యమమే కావాలనే వారి కోసం మండలానికొక్క బడిని మండల కేంద్రంలో పెడతామని భరోసా ఇచ్చింది. మొత్తంమీద ఇంగ్లీష్‌ మీడియాన్నే ప్రజలు కోరుతున్నారు గనుక, ప్రజలు కోరినదాన్ని యిచ్చే బాధ్యతను నెరవేర్చుకోవడం కోసం తాము చేసిన విధాన నిర్ణయాన్ని అమలు పరిచే స్వేచ్ళను కోర్టులు అడ్డుకొన కూడదని రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని శరణు జొచ్చింది.

విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చివేసి, అందులో రాజకీయ నాయకులే భాగస్వాములై ఏలుతున్న రోజుల్లో ప్రభుత్వాలు వారిని కాపాడుకొనేందుకే అంకితమవుతాయి. దానిలో భాగంగా జరుగుతున్నదే ఇదంతా. అందుకే ఇంతకాలంగా ఒక పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రయివేటురంగాన్ని ప్రోత్సహించడమే విధానంగా పెట్టుకొన్నాయి మన ప్రభుత్వాలు. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలు ఏమీలేవు.

రాజ్యాంగం ఏమిచెప్పినా, విద్యాహక్కు చట్టం ఎంత నిక్కచ్చిగా చెప్పినా, ప్రపంచ సంస్థలూ, మేధావులూ ఎవరు ఏమని మొత్తుకున్నా మన తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోవు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమైతే తన విధానాన్ని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జులై-2020

7