Jump to content

పుట:Ammanudi-May-2019.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తర్వాత ఆ ఒక్క రోజూ ఆయన ఎక్కడకు వెళ్లినా కలిసి తిరుగుతూ ఎన్నో సంగతులు మాట్లాడుకోవడం జరిగేది.

ఎస్. పి. వై. తో పరిచయం అయిన కొద్ది నెలల్లోనే పత్రిక ఆర్థిక కష్టాల్ని గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మూడు నాలుగు విడతలుగా కొంత సహాయం చేశారు. 'అప్పులుండకూడదు, పత్రికకు నేను అండగా ఉంటాను కానీ దాన్ని తనను తాను పోషించుకొనేట్లు చూడు... రెండు మూడేళ్ల వ్యవధిలో' అన్నారాయన. అంటూనే 'ఇక పత్రికకు ఓనరు నేనే' అన్నారు - నవ్వుతూ. ఆ వెంటనే ఎస్. పి. వై. రెడ్డి గారి పేరు సారథిగా పత్రికలో ప్రకటించడం మొదలు పెట్టాను. తర్వాత నంద్యాలలోనో, మరొక ఊళ్లోనో మేము కలుస్తున్నప్పుడు ఆయన మిత్రులకు 'ఇదంతా రమేష్ బాబు పనే. ఊరికే నా పేరు వేస్తాడు' అంటూనే నన్ను పొగుడూ నాలుగు మంచి మాటలు చెప్పేవారు! ఆయనకు గుండెజబ్బు చేసింది. హైదరాబాదులో ఆపరేషన్ చేయించుకొన్నారని తెలిసి సి. ధర్మారావుగారూ నేనూ కలసి వెళ్లాం. అదే చిరునవ్వూ. ఆత్మీయమైన పలకరింపూ. మాటల్లో వయస్సులు తిరిగేసుకొన్నాం. నా కంటే మూడు నాలుగేళ్లు చిన్నవారని తెలుసుకొన్నా, 'ఆయన గంభీరమైన మనిషి, హృదయమెంతో విశాలం. సమాజం పట్ల అవగాహన, సానుభూతీ గల మనిషి. ఆయన నూరేళ్లూ బ్రతకాలని' మాలో మేము కోరుకుంటూ వెనుదిరిగాము. తర్వాత కొన్ని వారాలకు నంద్యాల వెళ్లాను. షటిల్ కోర్టులో ఉత్సాహంగా ఆడుతూ కనిపించారు.

తర్వాత దశాబ్దం పైనే జరిగిపోయింది. అప్పుడప్పుడూ అనారోగ్యంగా ఉంటున్నట్లు తెలుస్తూనే ఉంది. పనిని పెంచుకొన్నారే తప్ప, తగ్గించుకోలేదు. ఎస్. పి. వై. గారి బలమంతా ఆయన అర్ధాంగే. నిత్య జీవితంలో నైతిక శక్తి అంతా ఆ తల్లిదే. ఇద్దరు కుమార్తెలు, ప్రాణంగా చూసుకునే పెద్దల్లుడూ. ఆయన కుటుంబం ఆయనకు కొండంత బలం.

రెడ్డిగారి గురించి వ్రాయాలంటే అది ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. దానికి ఎవరైనా సమర్థులు పూనుకోవాలి. సరిగ్గా అక్షరబద్ధం చేస్తే - అది యువతకూ, ప్రజానీకం అంతటికీ మేలు చేసేది కాగలదు.

మూడుసార్లు వరుసగా లోకసభకు ఎన్నికైన శక్తి ఆయనది. ప్రతిసారీ ఆ సందర్భాల్లో కలిసి శుభాకాంక్షలు తెలిపేవాణ్ణి. తెలుగుకు ప్రాచీన భాష హోదాకై పార్లమెంటులో పట్టుబట్టడమే కాదు, అది చేకూరేదాకా వెంటపడ్డారు. తెలుగు భాషోద్యమానికి గట్టి సమర్థకుడాయన. 1995లో 'నవ నిర్మాణ ఉద్యమ సమితి' ని ఆయనా నేనూ కలిసి ప్రారంభించాము. ఆ సందర్భంగా రాలేగాఁవ్ సింధి కి నేను వెళ్లి అన్నా హజారేను కలిసి చర్చించేందుకు ప్రోత్సాహకులు రెడ్డిగారే.

ఒక్క రూపాయికి 'జొన్న రొట్టె - పప్పు' పథకం ఎంతో పేరు తెచ్చి పెట్టింది. రైతు సమస్యల పరిష్కారం ఆయనకు ఇష్టమైన విషయం. నాణ్యమైన విద్యుత్తునిచ్చి మోటార్లు కాలిపోకుండా కాపాడండి. గిట్టుబాటు ధర ఇచ్చి రైతును ఆదుకోండి, చాలు. ఈమాత్రం ప్రభుత్వాలు చేస్తే రైతు బంగారాన్ని పండిస్తాడు అనేవారు ఎస్. పి. వై. ప్రతి గ్రామానికీ 'మినరల్ వాటర్'ను ఎందుకివ్వలేం... అనేవారాయన. ఇలా ఎన్నో అంశాలు.

ఎస్. పి. వై. రెడ్డిగారు పరిచయమయ్యుండకపోతే 'నడుస్తున్న చరిత్ర' అన్నేళ్ళు కొనసాగి ఉండేది కాదేమో! తెలుగు భాషోద్యమానికి వెన్నుదన్నుగా ఆ పత్రిక నిలబడడమూ, నేను తెలుగు భాషోద్యమంలో ప్రముఖంగా పాలు పంచుకోవడమూ ఇదంతా జరిగి ఉండేదా?! ఏమో!

నా జీవితంలో ఎంతో కీలక భాగమైన - సోదరుడు 'ఎస్. పి. వై. రెడ్డి గారి సహవాసాన్ని, సహకారాన్ని నేను మరువలేను. ఆయన కనుమరుగైన సంగతిని కూడా మరువలేను...

సామల రమేష్ బాబు

తేదీ
1-5-2019

8

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *

మే 2019