పుట:Ammanudi-May-2019.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బుద్దపూర్ణిమ మే 18

డి. చంద్రశేఖర్‌ 92900 91232

మూడు అక్రియావాదాలు-బుద్దుని క్రీియాశీలవాదం

మానవుడు పొందే అనుభవాలు స్టూలంగా మూడు రకాలని చెప్పవచ్చు:సుఖకరమైన. దుఃఖకరమైన. ఈ రెండూ కాని తటస్థ అనుభవాలు. మానవ జీవితచరిత్రను పరిశీలిస్తే, ప్రపంచమంతటా అన్ని కాలాల్లొ, ఎటువంటి మినహయింపు లేకుండా, మనుషులందరూ ఈ మూడురకాల అనుభవాలను ఎదుర్కోవటం కనిపిస్తుంది. అందుకే మానవ జీవితం గురించి శోధించిన తత్వవేత్తలందరూ, ఈ అనుభ వాలకు దారితీసే కారణాలను అన్వేషించటానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రాచీన భారత తత్వవేత్తలు గణనీయమైన కృషి చేశారనేది, ఆధునిక పండితులంతా ముక్తకంఠంతొ అంగీకరిస్తున్న ఒక వాస్తవం.

ప్రాచీన భారత తాత్విక చింతనలొని భిన్నమైన ధొరణులను లేక వాదాలను క్రోడీకరించి చెప్పటానికి ప్రయత్నించిన తొలిగ్రంథాలు త్రిపిటకాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి బుద్ధుని ఉపదేశాలను ఆయన స్వంతమాటల్లో నమోదుచేశాయని చెప్పబడే, పాలి నికాయాలు మరియు సంస్కృత ఆగమాల్లో, ఆ కాలంనాటి విభిన్న తాత్విక ధోరణులను వివరించే సందర్భాలు పుష్కలంగా ఉన్నాయి.

వాటిలో, 'మానవ జీవితపు అనుభవాలకు దోహదం చేసే కారణాలను వివిధ తత్వవేత్తలు ఎటువంటి దృష్టితో చూశారు” అనేది చాల మౌలికమైన విషయం. దీని గురించి బుద్ధవచనం ఏం చెబుతుందో చూద్దాం.

ఈవిషయమై అంగుత్తరనికాయలోని ఒక సుత్తం (3:61) చాల స్పష్టమైన విశ్లేషణ అందిస్తుంది. దీనిలో బుద్ధుడు, మానవుని సుఖదుఃఖాలకు ఆనాటి బ్రాహ్మణేతర తత్వవేత్తలైన శ్రమణులు, బ్రాహ్మణ పండితులు చెప్పిన కారణాలను కింది విధంగా పేర్కొన్నాడు:

“భిక్షువులారా, (1) కొందరు శ్రమణులు బ్రాహ్మణులు, 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నీ గతకర్శల కారణంగానే (పూర్వకతహేతు) పొందుతాడు” అనే దృష్టి కలిగివున్నారు. (2) మరి కొందరు శ్రమణులు బ్రాహ్మణులు, “మనిషికి కలిగే సుఖ, దుఃఖ తటస్థ అనుభవాలన్నీ దైవసృష్టి కారణంగానే (ఈశ్వరనిర్మాణహేతు) పొందుతాడు" అనే దృష్టి కలిగివున్నారు. (3) ఇంకా కొందరు శ్రమ ణులు బ్రాహ్మణులు, 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నీ ఎటువంటి కారణం లేకుండానే (అహేతుప్రత్యయా) పొందుతాడు” అనే దృష్టి కలిగివున్నారు.”

'పైన ఉటంకించిన మూడురకాల వాదాలను వినిపించే అనేక మంది శ్రమణులను, బ్రాహ్మణులను తాను స్వయంగా కలిసినట్లు బుద్ధుడు అనేక సుత్తాల్లో ప్రకటించాడు. అంతేకాదు, వారి వాదాలు ఏవిధంగా దోషపూరితమైనవో చెప్పటానికి, బుద్ధుడు తగిన కారణాలను కింది విధంగా వివరించాడు.

(1) 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ తటస్థ అనుభవాలన్నీ గతకర్మల కారణంగానే పొందుతాడు” అనేవాదం ప్రకారం, ఒకవ్యక్తి గతకర్మల కారణంగానే హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం చేస్తాడు గతకర్మల కారణంగానే అబద్దాలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతాడు. అతడు గతకర్మల కారణంగానే లోభి, దుర్మార్గుడు, తప్పుడుదృష్టి కలవాడు అవుతాడు. గతకర్మలు నిర్ణయాత్మకమైనవని నమ్మేవారు, *ఇది చెయ్యాలి? 'అది చెయ్యకూడదు” అనే సంకల్పం లేనివారవుతారు. ఏది చేయదగిందో, ఏది చేయకూడనిదో తెలియక, అయోమయంలో పడి దిక్కు తోచని వారు అవుతారు.

(2) 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నీ దైవ సృష్టి కారణంగానే పొందుతాడు" అనేవాదం ప్రకారం, ఒకవ్యక్తి దైవాజ్ఞ కారణంగానే హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం చేస్తాడు దైవసృష్టి కారణంగానే అబద్దాలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతాడు. అతడు దైవాజ్ఞ కారణం గానే లోభి, దుర్మార్గుడు, తప్పుడుదృష్టి కలవాడు అవుతాడు. దైవసృష్టి నిర్ణయాత్మకమైనదని నమ్మేవారు, 'ఇది చెయ్యాలి? “అది చెయ్యకూడదు” అనే సంకల్పం లేనివారవుతారు. ఏదిచేయదగిందో, ఏదిచేయ కూడనిదో తెలియక, అయోమయంలోపడి దిక్కుతోచనివారు అవుతారు.

(3) మనిషికి కలిగే సుఖ, దుఃఖ తటస్థ అనుభవాలన్నీ ఎటువంటి కారణం లేకుండానే పొందుతాడు' అనేవాదం ప్రకారం, ఒకవ్యక్తి ఏ కారణం లేకుండానే హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం చేస్తాడు ఏ కారణం లేకుందానే అబద్దాలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడతాడు. అతడు ఏ కారణం లేకుండానే లోభి, దుర్మార్గుడు, తప్పుడుదృష్టి కలవాడు అవుతాడు. అహేతుకత లేక కారణరాహిత్యం నిర్ణయాత్మకమైనదని నమ్మేవారు, “ఇది చెయ్యాలి? “అది చెయ్యకూడదు” అనే సంకల్పం లేని వారవుతారు. ఏది చేయదగిందో, ఏది చేయకూడనిదో తెలియక, అయో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019.

33