పుట:Ammanudi-May-2019.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బళ్ళారి ప్రాంతంలోని తెలుగువాళ్లు తెలుగువాళ్లుగా చూపించుకొనేందుకు కూడా జంకుతున్నారు. మీకొక విషయం చెప్తాను. మా మేనల్లుడు బళ్ళారిలో వకీలు. అతని పేరు మల్లికార్జున రెడ్డి, ఈమధ్యన అతనొక ఉద్యమం చేసినాడు. ప్రైవేటు భాగస్వామ్యంలో ఒక విమానాశ్రయం కట్టాలని వచ్చి, ఒక సంస్థ వారు బళ్ళారి దగ్గర 2400 ఎకరాలను కొనాలనుకొన్నారు. అప్పటి మార్కెట్‌ ధర ప్రకారం రెట్టింపు ఇస్తామన్నారు. దాని చెడు ప్రభావం తెలియని కొందరు రైతులు తమ భూములను అమ్ముకొన్నారు. అప్పుడు మావాడు రంగంలోకి దిగి, భూముల్ని అమ్మొద్దంటూ ఊరూరూ ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసినాడు. ఐదురోజులు నిరాహారదీక్ష చేసినాడు. సిపిఐ (ఎంఎల్‌) పార్టీ వాడి ఉద్యమానికి అండగా నిలిచింది. ఐదారువందల మంది కలిసి, బళ్ళారి జిల్లా సరిహద్దుల్లోని చేళ్ళగురికి గ్రామం నుండి బళ్ళారి వరకు 30 కి.మీ. పొర్లుదండాల పోరాటం చేసినారు. 350 కిమీ. బెంగుళూరుకు పాదయాత్ర చేసినారు. వాడిని రెండుసార్లు అక్రమంగా ఖైదుచేసి హింసించినారు. అయినా వాడు ఉద్యమాన్ని ఆపలేదు. చివరికి హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదంతా ఎందుకు చెస్తున్నానంటే ఇంత పోరాటపటిమ, తెగువ ఉన్నవాడు కూడా తెలుగువాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడడు. కన్నడంలోనే ఉపన్యాసాలు ఇస్తాడు. “మామా ఇది కన్నడ నేల కదా, తెలుగు ఎందుకు" అంటాడు. 'నువ్వు కన్నడంలో మాట్లాడడం తప్పుకాదు, కానీ తెలుగులో కూడా మాట్లాడితే ఏమయింది” అంటే ధైర్యం చేయడు. వాళ్లే ఒకసారి బళ్ళారిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేనినారు. అందరూ కన్నడంలోనే మాట్లాడుతున్నారు. నేను తెలుగులో మాట్లాడినాను. ఒక విలేకరి “మీరు కన్నడంలో మాట్లాడలేరా” అని అడిగినాడు. “మీ అందరి కంటే బాగా మాట్లాడగలను. మీ కన్నడ మాటను రుచి చూడాలని ఉంది అని అడగండి, మాట్లాడతాను. అంతేగాని కన్నడంలోనే మాట్లాడి తీరాలి అంటే మాట్లాడను" అని తెగేసి చెప్పినాను. ఇట్ల అడిగేవారే లేకుండా పోయినారు బళ్ళారిలో.

సు : బళ్ళారిలో తెలుగు సంఘాలు లేవా? వాళ్లెవరూ ప్రశ్నించడం లేదా?

జో : ఎందుకు లేవు, ఉన్నాయి. వాళ్లందరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కఠిన వాస్తవం ఏమిటంటే వాళ్లు కూడా చాలా మట్టుకు కార్యక్రమాలను కన్నడంలోనే చేస్తున్నారు. ఆమధ్య ఒక తెలుగుసంఘం వారు ధర్మవరపు రామకృష్ణమాచార్యులవారి జయంతిని జరిపినారు. ఉపన్యాసాలన్నీ కన్నడంలోనే జరిగినాయి. రామకృష్ణమాచార్యులవారి వారసులు ఆ సభలో ఆంగ్లంలో మాట్లాడినారు. ఒక్క జోళదరాశి చంద్రశేఖరరెడ్డిది తప్ప ఇంకొక్క తెలుగుగొంతు ఆ సభలో వినబడలేదు. ఒక తెలుగు మహనీయుడికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన బతికి నడయాడిన ఊర్గో ఆయన కుటుంబ సభ్యులూ అనేకమంది తెలుగువారూ పాల్గొన్న సభలో, కన్నడంలో ఆంగ్లంలో జరిపించినారు. 'తెలుగులో ఉపన్యసిస్తే మీకేమవుతుంది' అని అడిగితే, “ఎందుకండీ, కన్నడ రక్షణ వేదిక వాళ్లు ఉంటారు కదా, వచ్చి గలాట చేస్తారు. మన ఇళ్లల్లో మాట్లాడుకొంటాము చాలదా, తెలుగెక్కడకు పోతుంది" అనేసినారు. ఇదీ బళ్ళారిలో తెలుగు సంఘాల, తెలుగు ప్రజల పరిస్థితి. వాళ్ల భయానికి కూడా అర్థం ఉంది. ఒకసారి బళ్ళారిలో కర్నాటక తెలుగు అకాదెమీ అనే సంస్థవారు తెలుగు సభను నడుపుకొంటుంటే కన్నడ సంఘం వాళ్లు వేదిక మీదకు ఎక్కి రసాబాస చేసినారు. ఆ సభలో నేను కూడా ఉన్నాను.

సు : తెలుగుపట్ల కన్నడ సంఘాల వారు తీవ్ర వ్యతిరేకతను చూపడం బళ్ళారి ప్రాంతంలో మాత్రమేనా, కర్షాటక అంతటా ఈ పరిస్థితి ఉందా?

జో : నా పరిశీలనలో బళ్ళారి ప్రాంతంలోనే ఈ వివక్ష ఎక్కువగా ఉందనిపిస్తుంది. తెలుగువాళ్లు బాగా ఎక్కువగా ఉన్న కోలారు జిల్లాలో ఇంత వివక్ష కనిపించదు. దీనికి కారణాలుగా నేను అనుకొనేవి ఏమిటంటే, కోలారు జిల్లా తెలుగువాళ్లు మొదటి నుండీ, అంటే 'పాఠశాల విద్య" అనేది మొదలయిన తొలినాళ్ల నుండీ కన్నడమే చదువుతున్నారు. అక్కడ కేవలం నాలుగయిదు తెలుగు బడులు మాత్రమే ఉండేవి. బళ్ళారి అట్ల కాదు. ఇక్కడ మొదటి నుండీ 90% పైగా తెలుగుబడులే ఉండేవి. కన్నడబడులు తక్కువగా ఉండేవి. కోలారు లాంటి చోట్ల తీవ్రమైన కన్నడ అభిమానం కలిగి ఉండే వీర శైవులు తక్కువ. బళ్ళారిలో వీరశైవులు ఎక్కువ. బళ్ళారి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండినందువలన, ఇక్కడి తెలుగువారికి ఆంధ్రరాష్ట్రంలో కలవాలనే కోరిక బాగా ఉండేది. ఆ విషయంలో ఈ ప్రాంతంలో తెలుగు కన్నడిగుల మధ్య మనఃస్పర్ధలు ఎక్కువయినాయి. కోలారు తెలుగువాళ్లు తొలి నుండీ మైసూరు రాజ్యంలో భాగంగా ఉంటూ కన్నడమే చదువుకొంటూ పాత రాజధాని మైనూరుకూ కౌత్త రాజధాని బెంగుళూరుకు దగ్గరగా ఉండడం వలన ఆంధ్రరాష్ట్రంలో కలవాలనే కోరికను చూపించలేదు. ఇన్ని కారణాలు ఉన్నా ఇప్పుడిప్పుడే అక్కడ కూడా వివక్ష మొదలయింది. తెలుగు చలనచిత్ర ప్రదర్శనను అడ్డుకోవడం, ఎన్నికల సమయంలో తెలుగులో ప్రచారం చేసే నాయకులను నిలదీయడం వంటివి జరుగుతున్నాయి.

సు : బళ్ళారి చరిత్రను గురించి చెప్పగలరా?

జో : బళ్ళారి ప్రాంతం రెండువేల ఏండ్ల కిందట ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీ.శ 4 లేదా 5 శతాబ్దాల నాటి గాంగరాజుల శాసనాలలో ఈ ప్రాంతానికి సిందవాడి అని పేరు. చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసలులు వంటి రాజ్యాల పరిధిలో బళ్ళారి ఉండినా, చరిత్రలో ఈ ప్రాంతం ఒక్క వెలుగు వెలిగింది విజయనగర రాజుల కాలంలో. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల పాలనలో ఇక్కడ తెలుగు వెల్లివిరిసింది. కృష్ణదేవరాయలవారి పాలనలో అయితే చెప్పనవసరం లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలవారే స్వయంగా అన్నారు. కానీ రాయలవారితో సహా విజయనగర రాజులు ఎవరూ ఇతర భాషలను, ముఖ్యంగా కన్నదాన్ని తక్కువగా చూడలేదు. 16వ

కన్నవారినీ తోడబుట్టినవారినీ తెలుగులో పిలువలేని బ్రతుకెందుకు?!

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

21