Jump to content

పుట:Ammanudi-May-2019.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"సాపొత్యరంగం

మధురాంతకం నరేంద్ర 98662 43659

తెలుగువాళ్ళ తమిళ నవలలు రెండు


తాను పుట్టిన వూరుపైన మక్కువ వుండడం మనిషికెంత సహజమో, అనేక కారణాల వల్ల అతను మరో ప్రాంతానికి వలస పోవడం గూడా అంతే సహజం. యే కుటుంబంగానీ అయిదు తరాల పాటూ వొకే వూరిలో వుండడం అసాధ్యమని మానవ పరిణామ శాస్త్రజ్ఞులు (ఆంధ్రపాలజిస్ట్‌) అంటారట! రామాయఇంలో రాముడు అడవికెళ్ళడం, మహాభారతంలో పాండవులు హస్థినాపురం నుంచీ వారణావతం పోవడం గూడా వలస వెళ్ళడమేగదా! జీవిక కోనం అనుకూలమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం మానవ స్వభావం. 'వుద్యోగికి దూరభూమిలేదు” అంటుందో సామెత. జీవితానికి వుపనదిలా సాగే సాహిత్యంలో మానవుల వలసలను వస్తువులుగా తీసుకున్న రచనలు చాలానే వున్నాయి. జీవిక కోసం కాలిఫోర్నియాకు వలస వెళ్ళిన కుటుంబం గురించి జాన్‌ స్టెయిన్‌ బెక్‌ అనే అమెరికన్‌ రచయిత రాసిన “గ్రేప్స్‌ ఆఫ్‌ ది రాత్‌” పుస్తకానికి నోబులు బహుమతి వచ్చింది. అమెరికా వంటి దేశాల్లో వలసలు పోవడమన్నది చాలా సాధారణంగా జరిగే పని. అలా వలస పోవడం వల్ల వాళ్ళకు జరిగే మార్పు కేవలం భౌగోళికమైనదిగానే వుంటోంది. అదే భారతదేశంలో జరిగినప్పుడు వలసలు వెళ్ళిన వాళ్ళు కోల్పోయేది భాష, సంస్కృతి గూడా! యెనిమిది తొమ్మిది శతాబ్దాల క్రితం, ముస్లిముల బారి నుంచీ తప్పించుకోవడం కోసం తెలుగు ప్రాంతం నుంచీ దక్షిణాదికి చేరుకున్న వాళ్ళు చాలామంది తమిళనాడులో, కన్యాకుమారికి వందమైళ్ళ దూరంలో, తూత్తుకుడి జిల్లాలో కుదురుకున్నారు. వాళ్ళల్లో నాయుళ్ళు, రెడ్డు, మాదిగలూ వున్నారు. నాయుళ్ళు కొందరు అక్కడే వొక గ్రామం కట్టుకున్నారు. ఆ వూరిలో పుట్టిన రచయిత వొకరు తెలుగు ప్రాంతాల నుంచీ వలస వెళ్ళిన ఆ గాధను రెండు నవలలుగా సాహిత్యీకరించాడు. ఆ నవలకు 1991 లోనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. యిపుడా రచయితకు 96 సంవత్సరాల వయస్సు. ఆ నవల పేరు “గోప్రల్లె జనాలు” ఆ రచయిత పేరు కి.రాజనారాయణన్‌.

1928 సెప్టెంబరు 16వ తేదీన తూత్తుకుడిజిల్లా, కోయిలు పట్టి తాలూకాలోని ఇడైచేవలో అనే పల్లెలో పుట్టిన రాయంగల శ్రీ కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజం నాయకర్‌, చదువుకున్నది యెనిమిదవ తరగతి వరకు మాత్రమే. కి.రాజనారాయణన్‌ అనే పేరుతో ఆయన ఏడు కథా సంకలనాలు, నాలుగు నవలలు, మూడు వ్యాస సంకలనాలు రాశారు. మాండలిక భాషలో రచనలు చేసే కీ.రా.(కి.రాజనారాయణన్‌ 'కీరా 'గా తమిళ సాహిత్యంలో ప్రసిద్దులు. తమ మాండలిక నిఘంటువును గూడా తయారు చేశారు. పాండి చ్చేరి విశ్వవిద్యాలయంవాళ్ళు “ఫోక్‌ టేల్స్‌ డాక్యుమెంటేషన్‌ అండ్‌ సర్వే సెంటర్‌” కు కీరా గారిని సంచాలకుడుగా నియమించి గౌరవించి నారు. ఆయన అనేక తమిళ జానపద కథల్నీ, సాహిత్యాన్నీ సేకరించారు. యిప్పుడాయన పాండుచ్చేరిలోనే వుంటున్నారు.

తన వాళ్ళు తెలుగునాడు నుంచీ తూత్తుకుడి ప్రాంతం వరకూ వలస వెళ్ళిన గాధను కీరాగారు 'గోపల్లె, 'గోపల్లె జనాలు" అనే రెండు నవలలుగా రాశారు. 'గోపల్లె తమిళంలో వచ్చిన తొలి మాండలిక నవల. దీన్ని హోసూరువాసి నంద్యాల నారాయణరెడ్డిగారు 2012లో తెలుగులోకి అనువాదం చేశారు. “గోపల్లె జనాలు” నవలను చిత్తూరు జిల్లా వాసి (మధురై విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసినవారు) ఆచార్య శ్రీపాద జయప్రకాష్‌ 2016లో తెలుగులో అనువాదం చేశారు. యీ రెండు వుస్తకాలనూ తెలుగు సాహిత్యాభి మాని చెన్నూరు ఆంజనేయరెడ్డిగారు 'ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌” అనే సంస్థ తరపున ప్రచురించారు. వీటికి జానపద సాహిత్యంపైన పరిశోధన చేసిన సగిలి సుధారాణిగారు ఆర్థికంగా, హార్దికంగా సహాయం చేశారు.

కీరాగారిది మౌఖిక ధోరణి. పల్లెటూళ్లల్లో కథలు చెప్పే అమ్మమ్మల, నాన్నమ్మల కథన పద్దతి. వొక జానపదుడు భుక్తాయాసం తీర్చుకుంటూ, తన ముందు కూర్చున్న వాళ్ళకు నెమ్మదిగా, ఆశక్తికరంగా కథ చెప్పినట్టుగా ఆయన నవలలు కొనసాగుతాయి. యెక్కడో మొదలై, తర్వాత రకరకాల పిట్ట కథల్ని చెబుతూ, మరెక్కడో మళ్లీ మొదటికొచ్చి నేర్పుగా కథలనంతా వొకటిగా ముడివేసే జానపద ధోరణిలో కీరాగారు నవలను రాస్తారు (చెస్తారు!) రెండు నవలల్లో భారత స్వాతంత్రోద్యమం గురించి రానిన 75 పేజీలను మినహాయిస్తే మిగిలిన యీ రెండు నవలలు దాదాపు 250 పేజీలలో “కాలమూ, స్థలమూ” యిదమిద్దంగా చెప్పడం సాధ్యం గాదు. దాదాపు యేడు శతాబ్దాల్లో జరిగిన కథ ముందుకూ, వెనక్కూ అప్పుడప్పుడూ పక్కకు గూడా జరుగుతూ పాఠకుద్ని మనదిగాని వొక పాత కాలానికి, మనకు తెలియని వాక పాత లోకానికి తీసుకెళ్తుంది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

17