పుట:Ammanudi-May-2019.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెందారని చెప్పడం తప్పు. సంప్రదాయక వ్యవసాయ శ్రమ సంబంధాల రూపంలోని కులవృత్తులకు దూరమైన చిరు వ్యాపార వర్గ సామాజిక నేపథ్యం గల మహాత్మా ఫూలే అలాగే రాజవంశీయుల సాన్నిహిత్యంలో ఉన్న సైనిక కుటుంబ నేపథ్యంగల అంబేడ్కర్‌ తదితరకుటుంబ సాంసృతిక నేపథ్యం నుంచి విద్యావంతులుగా ఎదిగి వచ్చిన వారిని చూపించి, దళితులందరూ (వ్యవసాయ శ్రమ సంబంధాల్లో ఉన్నవారు) వారిలాగే ఇంగ్లీషు నేర్చుకుంటే జీవితంలో ఎదుగుతారు అని ఐలయ్య సూచించడం దురదృష్టకరం. సామా జికంగా, ఆర్థికంగా ఈ అభివృద్ది చెందుతున్న ప్రజానీకం తమ విజయాలను సుస్థిరం చేసుకునేందుకు సాధనంగా భాష ఉపకరిస్తుందే గానీ, ఫలానా భాష నేర్చుకోవడం వల్లనే అభివృద్ధి దానికదే సాకారం కాదు.

20వ శతాబ్దం ఆరంభం నాటి కల్లా ప్రపంచ, పెట్టుబడిదారీ విధానం మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, సంక్లిష్టంగా మారింది. అది ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల నిర్దిష్ట కార్యకలాపాల అనుభవాల నుంచి ఆవిర్భవించి వైవిధ్య భరిత వైజ్ఞానిక సంపదను, నైపుణ్యాలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి పాశ్చాత్య సంస్పృతి (ఉత్పత్తి విధానాలు, నైపుణ్యాలు, సరకుల వినియోగం, వైజ్ఞానిక సంప్రదాయాలు వగైరా) ని ప్రవేశ పెట్టింది. దాంతో స్థానిక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన కృత్రిమ భాషా సంపద అభివృద్ధి క్రమానికి గండి పడింది. స్థానిక పర్యావరణ అనుభవాల సారంగా వెలువడుతున్న వైజ్ఞానికాఖివృద్ధి పక్కదారి పట్టింది. పాశ్చాత్య ఉత్పత్తి విధానాలు,నైపుణ్యాలు, యంత్ర సంస్ఫృతులే ప్రజా జీవనానికి ఏకైక ప్రత్యామ్నాయంగా నిలవడంతో, సంబంధిత కృత్రిమ భాషను ఇతర ప్రాంత ప్రజలు సైతం ఆకళింపు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

దాంతో ఇంగ్లీషు వలసల్లో కృత్రిమ భాషగా, ఉపాధి భాషగా ఆంగ్లాన్ని నేర్చుకోవడం తప్పనిసరి అయింది స్థానిక ప్రజల ఉత్పత్తి కార్యకలాపాల అనుభవాల సారంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన స్థానిక కృత్రిమ భాష అభివృద్ధి స్తంభించింది. ఆ కారణంగా స్థానిక విజ్ఞానాభివృద్ధి నిలిచిపోవడమే కాకుండా ధ్వంసమవుతుండడం దురదృష్టకరం. పెట్టుబడి దారీ విధానం ప్రపంచీకరణ క్రమం ద్వారా సంఘటితమవుతున్న కొద్దీ స్థానిక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న స్థానిక కృత్రిమ భాషలు పూర్తిగా అంతర్ధానమవుతాయి. దాంతో కృత్రిమ భాషాభివృద్ధి క్రమానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్న సహజ భాషలు క్రమంగా సారహీనంగా, సమకాలీన అవసరాలు తీర్చలేని విధంగా మారతాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సదరు భాషలు అంతరించి పోవడమో, సమాజంలో ఏదో ఒక మూల ప్రాభవాన్ని జీవాన్ని కోల్పోయి ఒక శిలాజంగా మృత భాషగా మిగలడమో జరుగుతుంది. పర్యవసానంగా భూగోళంపై ఆ భాషా జాతి అస్తిత్వం అంతరిస్తుంది. ప్రస్తుతం తెలుగు భాషలో కృత్రిమ భాషాభివృద్ధి కుంటుపడి, దాని ప్రతికూల ప్రభావం సహజ భాషపై తీవ్రంగా ఉండడం గుర్తించగలం. స్థానిక సహజ, కృత్రిమ భాషల్లో నిక్షిప్తమై ఉన్న స్థానిక ప్రజల అనుభవం, విజ్ఞాన సంపదలను విశ్వజనీన స్థాయికి తీసుకువెళ్ళే విశ్వమానవ భాష రూపొందే క్రమం సదరు భాషాజాతి అస్తిత్వ సమానత్వ ప్రాతిపదికన పరిఢవిల్లుతుంది. అలాగాక స్థానిక భాషలను ధ్వంసం చేస్తూ, ఆ భాషకు ప్రత్యామ్నాయంగా పరాయి భాషను స్వీకరించడం సాధ్యమూ కాదు, అణగారిన అస్తిత్వాలకు ఆత్మహత్యాసదృశ్యంగా మారుతుంది.

స్వపక్ష ప్రయోజనాలకు గండి:

భాష (ఇంగ్లీషు) నేర్చుకోవడం వల్ల బహుజన ప్రజానీకం వారంతట వారే అభివృద్ది చెందుతారనే ఐలయ్య వాదన - ఆ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ఈనాడు ప్రపంచమంతా స్థానిక భాషలు,స్థానిక సంస్కృతుల పునరుద్ధరణతోనే అభివృద్ధిలో ఉన్నట్లు గుర్తించి ఆ వైపు అడుగులు వేస్తున్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేదు. గూగుల్‌, ఇంటర్నెట్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు నేడు తెలుగు సహా అనేక స్థానిక భాషల్లో విజ్ఞానాన్ని నిక్షిప్తంచేసేందుకు, సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంగ్లీషు మాధ్యమాన్ని భాషను ప్రాథమిక విద్య నుంచి ప్రవేశపెట్టాలనే ఎన్నికల హామీలను గుప్పిస్తూ, అలాంటి ప్రయత్నాలను అరకొరగా ప్రారంభిస్తున్న రెండు రాష్ట్రాలపాలకులను, అధికార, ప్రతిపక్షాలను ఒప్పించడంలో ఐలయ్య కృత కృత్యులయ్యారు. కులం, మతం అస్తిత్వ కోణాల నుంచి భాషా సమస్యను, విధానాన్ని ముందుకుతెస్తున్న ఐలయ్య వాదన ఆ ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగిస్తుందనడంలో సందేహంలేదు. ఇంగ్లీషు భాషను నేర్చు కోవడం, వ్యవహర్తలుగా శిక్షణ పొందడాన్ని ఎవరూ వ్యతిరేకించవలసిన అవసరం లేదు. అయితే దాన్ని ఏ పద్దతిలో సాధించాలనడంలోనే పేచీ ఉంది. ప్రజల అవసరాలను, ఎరుగమిని సొమ్ము చేసుకుంటున్న కార్పొరేట్‌,విద్యాపార సంస్థల స్వార్ధానికి వాస్తవ గణాంకాలపై కాక, నమ్మకాలు, ఉద్వేగాలపై ఆధారపడి రూపొందుతున్న (రూపొందిస్తున్న) ప్రజాభిప్రాయాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకునే పోస్ట్‌ ట్రూత్‌ (సత్యానంతర) రాజకీయ నాయకులు, పార్టీలు ఇంగ్లీషు విద్యను ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకువస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను, దాన్ని పటిష్టం చేసి లబ్టి పొందేందుకు ప్రయత్నిస్తున్న ఈ దేశ కార్పొరేట్‌ శక్తులు,వారికి అనుకూలమైన విధానాలు రూపొందించే రాజకీయ శక్తుల కారణంగానే బడుగుల బతుకుల తో రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి గానీ భాష (ఇంగ్లీషు విద్యను పొందడం) ద్వారా అభివృద్ధి దానికదే సాకారమవుతుందనే ఐలయ్య వాదన బడుగు బలహీన వర్గాల విముక్తి వీక్షణాన్ని మసకబారుస్తుంది.


భాష లేకపోతే భావం లేదు

నీ భావాల్ని నీ భాషలో చెప్పడమే సరైనది

14

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019