పుట:Ammanudi-May-2019.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్పడుతుంది. సామాజిక భాష సహజ భాష కృత్రిమ భాష. వివిధ వైజ్ఞానిక రంగాల్లోనూ, కళలు, సాహిత్యం, సంస్కృతి వగైరా ఆత్మిక రంగాల్లో ప్రత్యేకమైన పదజాలం, పరిభాషా పదజాలాన్ని కృత్రిమ భాషగా పరిగణించాలి. సహజ, కృత్రిమ భాషలు పరస్పర పూరకాలు, సహజ భాషల నుంచి కృత్రిమ భాషలు ఆవిర్భవించినప్పటికీ, కృత్రిమ భాషల కారణంగా సహజ భాషలు మరింత పరిపుష్టమవుతాయి. తామున్న పరిసరాలు, పర్యావరణం పునాదిగా సహజ భాషలు ఆవిర్భవిస్తే, ప్రజలు ప్రకృతిని మానవీకరించే క్రమంలో, ఉత్పత్తి కార్యకలాపాల వైవిధ్యతల, సంక్షిష్టతల క్రమాల్లో నుంచి సహజ భాషలు, కృత్రిమ భాషలు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల సహజ భాషలను మాత్రమే (వ్యవహారిక భాషలను) ప్రజల భాషలుగా గుర్తిస్తూ, కృత్రిమ భాషలను పాలక వర్గాల భాషలుగా గుర్తించడం పొరపాటు. సహజ-కృత్రిమ భాషల అభివృద్ధికి అటు శారీరక శ్రమ చేసేవారు, ఇటు మేధా శ్రామికులు ఇద్దరూ కలసి కృషి చేస్తారు. గణితంలోని పరిభాష సాధారణ ప్రజలకు అర్ధం కానంత మాత్రాన దాని అభివృద్ధిలో సాధారణ ప్రజల పాత్ర లేకపోలేదు. గణితం, అందులోని పరిభాష సాధారణ ప్రజల సొంతం కాకపోలేదు. అదే విధంగా ఆనాటి సమాజ ఆత్మిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రంగాల అవసరాల నుంచి కృత్రిమ భాష సంస్కృతం ఆవిర్భవించింది. అది సహజ భాషల నుంచి ఆవిర్భవించి ఆనాటి వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాల పరిభాషకు ప్రాతినిథ్యం వహిస్తూ జ్ఞానాభి వృద్ధికి దోహదం చేయడాన్ని కాదనడం అర్ధరాహిత్యం మాత్రమే . సహజ భాషలైన పాళీ, ద్రవిడ భాషలు ప్రజల జీవిత కార్యకలాపాల నుంచి ఎలా అభివృద్ధి చెందాయో, అదే విధంగా కృత్రిమ భాషగా సంస్కృతం అభివృద్ధి చెందడమూ అంతే సహజం. ఇప్పటికీ ప్రపంచ భాషల్లో అత్యంత భాషా శాస్త్ర ప్రామాణికతను సంతరించుకున్నది సంస్పృతమేనని ప్రముఖ భాషా శాస్త్ర నిపుణులు నోమ్చోమ్స్మీ పలు సందర్భాల్లో వివరించారు. పాలకులు సృష్టించిన లేదా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నించిన, వారి ప్రయోజనాలను నెరవేర్చిన భాష లను పాలక భాషలుగా పరిగణించడం కద్దు. పర్షియన్‌, ఇంగ్లీషులు వారి ప్రాంతాల్లో ప్రజల భాషలే. సంస్కృతం పాలక భాష కంటే భారత సమాజ ఆత్మిక జీవన రంగాల నుంచి ఆవిర్భవించిన కృత్రిమ భాష. అంతేకానీ, ఫలానా ప్రజలను అణచేందుకు ఉద్దేశించిన భాషగా దాన్ని పరిగణించడం అమాయకత్వమే అవుతుంది. అదీకాక, స్థానిక భాషల నుంచి, మరీ ముఖ్యంగా వ్యవసాయం, చేతివృత్తులు తదితర ఉత్పత్తి రంగాలలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ఆయా ప్రాంతీయ ప్రజల దైనందిన వ్యవహారాల నుంచి పుట్టుకొస్తున్న పదజాలంతో సంస్కృతం ఆవిర్భవించింది. ఆ స్థానిక భాషలు లేకుండా సంస్కృతం లేదు. అదే సమయంలో వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాల పరిభాషగా సంస్కృత భాష మాధ్యమంలో పుట్టుకొస్తున్న కృత్రిమ భాషాజాలం తిరిగి స్థానిక భాషలను క్రియాశీలంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లీషు కూడా అంగ్లోశాక్సన్ల భాష పునాదిగా, ఫ్రెంచ్‌, గ్రీక్‌, రోమన్‌ తదితర యూరోపియన్‌ భాషల నుంచి కీలకంగాను, వలస ప్రాంతాల్లోని స్థానిక భాషల నుంచి పాక్షికంగానూ అభివృద్ధి చెందిందనేది విదితమే. ఈ నేపథ్యంలో ప్రతి భాషా నిర్దిష్ట సమాజ చారిత్రక అవసరాలనుంచి పుడుతుంది, గిడుతుంది. అంతేగానీ సామాజిక ఆర్థికాభివృద్ధి 'క్రమంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తనకు తానుగా ఏ భాషా పుట్టదు, గిట్టదు.

ఒక భాషాజాతీయుల సొంత భాషను వారి సామాజి కార్థిభివృద్ధితో నిమిత్తం లేకుండా ధ్వంసం చేసి పరభాషను చొప్పించడం సాధ్యం కాదు. అయితే ఒక సామాజిక వ్యవస్థకు చెందిన భాషలోని సహజ భాష మాత్రమే మిగిలి, ఆ సమాజానికి చెందిన కృత్రిమ భాష నశిస్తే, కొంతకాలానికి దాని సహజ భాష కూడా అంతరించిపోగలదు. ప్రస్తుత భాషోద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నట్లు కేవలం సహజ భాష మాత్రమే కొనసాగితే చాలని తృప్తి పడటం అమాయకత్వమే అవుతుంది. ఇంగ్లీష్‌ దాడికి (ఆ భాష చేసే దాడి కాదు. ఆ ( పీడిత/ పీదక భాషాజాతీయుల్లోని పాలకుల విధానంగా. మాత్రమే అర్థం చేసుకోవాలి) స్థానిక కృత్రిమ భాష మృగ్యమై, కేవలం సహజ భాషగా కొనసాగుతున్న తెలుగు భాష కొడిగడుతున్న దీపంలా రెపరెవలాడుతోంది. సహజ, కృత్రిమ భాషలు రెండూ ప్రజలకు సొంతమే. ముఖ్యంగా వ్యవసాయం, చేతివృత్తుల్తో జీవిస్తున్న సువిశాల బడుగు, బలహీన వర్గాల ప్రజానీకానికి చెందినవి. ఈ నేపథ్యంలో భారతీయ మాతృభాషలు-ప్రధానంగా అణగారిన కులాలు, కుల వృత్తుల ప్రజానీకానివే. అలాంటిది వారి సామాజికార్థిక స్థితితో, అభివృద్ధి క్రమంతో సంబంధం లేకుండా ఐలయ్యగారు విశ్వ భాష ఆంగ్లాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహించడం ఆ ప్రజలకు చెడుపు చేస్తుంది. ఇంగ్లీషును నేర్చుకోవడం వల్లనే పూలే, అంబేద్కర్లు అభివృద్ధి

గుండె లోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ 'అమ్మనుడి'లోనే







| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ మే 2019 |