పుట:Ambati Venkanna Patalu -2015.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసలైన తెలుగక్షరం



సాకి: నింగిలోన సింగిడిగా నిలిసినవ కాళోజీ
       వెలుగునిచ్చె ధృవతారై వెలిసినావ కాళోజీ
నల్లని ఆకాశంలో తెల తెల్లని గడ్డంతో ఆ బోసి నవ్వులతో
వొదిగున్న కాళన్న ఓనమాలె నువ్వన్నా ॥నల్లని॥

నిజామోల్ల నెదిరించి భూస్వాముల జడిపించే
కథలెన్నో జెప్పితివి కదనానికి నడిపితివి
అక్షరాన్ని సందించి లక్ష్యాన్ని సాధించే
సత్యాగ్రహ సమరంలో సయ్యంటూ సాగితివి
నియతంటే నీదన్నా నిజమంటే నువ్వన్నా
జనమంటే ప్రాణంగా బతికిన ఓ కాళన్నా. ॥నల్లని॥

చెలిమికేమి కాదంటూ చెలిమలెండి పోవంటూ
గొడవజేసి గొంతెత్తి గోస దీర్చ కదిలితివి
తెలంగాణ ఊపిరివి తెగబడి నినదించితివి
ప్రత్యేక రాష్ట్రముకై ప్రజాపోరు నడిపితివి
నియతంటే నీదన్నా నిజమంటే నువ్వన్నా
జనమంటే ప్రాణంగా బతికిన ఓ కాళన్నా. ॥నల్లని॥

గలగలగల సెలయేరే గమనాన్ని మార్చింది
నీ గమ్యం చేరంగా పాదాలను తాకింది
గగనంలో నెలవంక నీ వంకే చూసింది
నీకై అడుగేసింది నీ పదమే పాడింది
నియతంటే నీదన్నా నిజమంటే నువ్వన్నా
జనమంటే ప్రాణంగా బతికిన ఓ కాళన్నా
నిను మరువా లేమన్న నీ బాటే మాదన్నా...

9

అంబటి వెంకన్న పాటలు