పుట:Ambati Venkanna Patalu -2015.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ క్రమంలో ఎందరో కవిగాయకులు, కళాకారులు తమ గళాలను, కలాలను పదునెక్కించిండ్రు. వేలాదిగా పాటలు సృష్టించి, తెలంగాణకు జరుగుతున్న దోపిడి, అవమానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిండ్రు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు సకలజనుల సమ్మెలో ఉద్యమించిన తీరు ఒక అధ్భుతమైన ఘట్టం. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంఘటన. పసిపిల్లల నుంచి పండు ముసలోల్ల వరకు అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష పట్టుదలతో ఉద్యమించిన మహోజ్వల దృశ్యాలలో నేనూ భాగస్వామినై పాటను భుజాన మోసుకొని ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటూ ఎన్నోసార్లు అరెస్టు చేయబడి నాదైన శైలిలో పాటలు రాసి, పాడినందుకు నా జన్మ ధన్యమైందనే భావిస్తున్నాను.

నల్లగొండ జిల్లా గోసంగి కవులలో ఒకడిగా దళిత సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపును పొందిన నేను గోరటి వెంకన్న 'పల్లెకన్నీరు', నందిని సిధారెడ్డి 'నాగేటి సాల్లల్ల' పాటల ప్రేరణతో 2000 సంవత్సరం నుండి తెలంగాణతో పాటు ఇతర అనేక సామాజిక అంశాల మీద గత పధ్నాలుగు సంవత్సరాలుగా నేను రాసిన పాటలు మొట్టమొదట 2002లో ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు అంకితమిస్తూ 'తుంగు' పాటల సంపుటిని, 2003లో మబ్బులు (ఐదొద్దుల ఆనపాట-బతుకమ్మ పాట) పాటల సంపుటిగాను, 2005లో అమరవీరులకు మరియు జానపద గాయకుడు వరంగల్ శంకర్‌కు అంకితమిస్తూ 'జిల్లెడుపూలు' పాటల సంపుటిని, 2009లో 'గోగుమల్లెలు' పాటల సంపుటిగాను ప్రచురించడం జరిగింది. ఆతర్వాత వచ్చిన మరికొన్ని కొత్త పాటలను కలిపి చిన్నచిన్న మార్పులు చేర్పులతో ఇప్పుడు ఆ పాటలన్నింటిని "అంబటి వెంకన్న పాటలు” గా మీ ముందుకు తెస్తున్నాను.

వీటిలో చాలా పాటలు అనేక క్యాసెట్లు, సి.డిల ద్వారా రికార్డు చేయబడినవే. "జైబాలాజీ” అనే సినిమాలో “మేంవచ్చే ఈ బాటన ఓ ఎంకన్న” అనే పాటతో పాటు సర్వాయి పాపన్న పాటలు, జంబురాజ్జెం, కల్లుపాట, సాపలు పచ్చాపలు వంటి వృత్తి కులాల పాటలు, బీసీల పాటలు ప్రజలకు ఎంతగానో చేరువైనయి. ఇంతకాలం నన్ను, నా పాటల్ని గౌరవించి, అభిమానించే నా మిత్రులు, పెద్దలు మరియు నా పాటల్ని అచ్చువేసిన పత్రికలకు, పాడిన గాయకులకు ఈ పుస్తక ప్రయత్నంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మా అన్న ప్రియతమ నాయకులు శ్రీ కర్నె ప్రభాకర్, శాసనమండలి సభ్యులు గారికి ప్రత్యేక ఉద్యమాభివందనాలతో...

-అంబటి వెంకన్న

7

అంబటి వెంకన్న పాటలు