పుట:Ambati Venkanna Patalu -2015.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్కమాట

“తెలంగాణ కోసం గత దశాబ్ద కాలానికి పైగా కాలికి బలపం కట్టుకొని శ్రమిస్తున్న వాగ్గేయకారుడు. తెలంగాణ ఉద్యమానికి అంబటి వెంకన్న చేసిన, చేస్తున్న కృషి గుర్తించ దగింది. తెలంగాణ ఉద్యమాన్ని అణువణువునా నింపుకొని తోటివాళ్ళను అలిసిపోవద్దని పొలికేకలేస్తున్న ఉద్యమ సేద్యగాడు. పోరాడకుంటే బతుకు మారదని యాబయ్యేండ్ల దుఃఖాన్ని వలపోస్తున్న వాగ్గేయకారుడు. తన పాటను మాటను తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసి పుట్టిన ఊరును మరిచి పోరాటదారుల్లో పయనిస్తున్న పోరాట బైరాగి” పసునూరి రవిందర్

సాహితీమిత్రుడు డా|| పసునూరి రవిందర్ "గోగుమల్లెలు” పాటల సంకలనాన్ని సమీక్షిస్తూ రాసినట్టు పాటే జీవితంగా తెలంగాణ ఉద్యమంలో అనేక ధూంధాంలలో పాల్గొన్నాను. ఆట పాటలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ సీమాంధ్రపాలనకు చరమగీతం పాడిన ఈ సాంస్కృతిక, ప్రజా ఉద్యమంలో నేనో చరణమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. అయితే ఎవరు ఎంత చేసినా అది ఈ నేల గొప్పతనమే తప్ప మరొకటి కాదు. తెలంగాణ అణువణువులో అద్భుతమైన కవిత్వం ఉంటది. అది నిత్యం పాటగానో, పద్యంగానో ఏదో ఒక రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటది. అమ్మ జోలపాట మొదలు కన్నతల్లుల గర్భశోకం వరకు అనేక రకాల పాటలతో ఈ నేల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. కలుపులు, కోతలు, ఇసుర్రాయి, బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఎన్నో సంధర్భాలలో ఆశువుగా, అలవోకగా గానం చేసే బలమైన జానపద సంప్రదాయం మన నేలకు ఉన్నది. తెలంగాణ పాటకు, ఇక్కడి సంస్కృతికి ఒక విశిష్టత ఉన్నది. ప్రపంచంలో మరెక్కడా లేని శ్రమైక జీవన సౌందర్యం తెలంగాణ సొంతం. శ్రమ జీవులతో మమేకమైన ఈ పాట చైతన్యాన్ని అందించే ఆయుధమైంది. "పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో” అన్న సుద్దాల హన్మంతు “వెయ్యహె వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్యహె వెయ్” అనే విప్లవోద్యమ చైతన్యానికి నాంది పలికింది. దొరలు, భూస్వాములకు ఎదురు నిలిసిన బండి యాదగిరి పాట దేశ్‌ముఖ్‌లను, నిజాం సర్కారును సైతం గడగడలాడించింది. ఆ పాటల సాలులో పురుడు పోసుకున్న ఎందరో కవి గాయకులు తెలంగాణ ఉద్యమంలో గళమెత్తి గర్జించడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పాటే ప్రాణమైంది. దిశానిర్దేశం చేసే లీడరయ్యింది. పాటల ధూంధాం లేని తెలంగాణ ఉద్యమాన్ని మనం ఊహించలేం. మారుమూల పల్లెల్లో సైతం 'ధూం-ధాం” ఆటపాటలు ప్రజలతో మమేకమై పల్లెపల్లెను తట్టి లేపడంతో పాటు, సకలజనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా నడిపించింది.

అంబటి వెంకన్న పాటలు

6