పుట:Ambati Venkanna Patalu -2015.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలు దాగి గౌరి ఉయ్యాలో
పవ్వలించినాది ఉయ్యాలా
కొబ్బరి తీర్థముతో ఉయ్యాలో
దూప దీర్చుకుంది ఉయ్యాలా
రోజులు గడువంగ ఉయ్యాలో
దిక్కుదోచదాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆడబతుకు తల్లి ఉయ్యాలో
నెలదిరిగి వచ్చింది ఉయ్యాలా
తానాలు జెయ్యంగ ఉయ్యాలో
తేనే నూనెలు గౌరి ఉయ్యాలా
నెయ్యి తోని గౌరి ఉయ్యాలో
జలకమాడినాది ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గౌరమ్మ ఒళ్ళంత ఉయ్యాలో
జిబ్బుమంటున్నాది ఉయ్యాలా
ఈగల గుంపేమో ఉయ్యాలో
మోతలే మోసేను ఉయ్యాలా
ఎర్రజీమలు తల్లి ఉయ్యాలో
బార్లుదీరినాయి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గబ్బు లేసిన వల్లు ఉయ్యాలో
గండు జీమలు పాలు ఉయ్యాలా
నీరు లేక గొంతు ఉయ్యాలో
పిడ్సగట్టుక పాయె ఉయ్యాలా
కచ్చెబట్టిన గంగ ఉయ్యాలో
కానరాకపాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

57

అంబటి వెంకన్న పాటలు