పుట:Ambati Venkanna Patalu -2015.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాతా ఓ ఈదయ

తాతా ఓ ఈదయా
నీతోని ఆడుకున్న ఆ రోజు రాదయా
యక్షగానము పాడి పోరగాళ్ళనాడిస్తివి
ఏవేవో కథలు జెప్పి మా కావలి గాస్తుంటివి ॥తాతా॥

వాగు బొర్లితే సాలు వలసేతా బడతావు
బుట్టెడు సాపలు దెచ్చి బడదమడి జేస్తావు
బొడ్డు గిన్నెడు బువ్వ... సందమామల పులుసు
బుక్క బుక్క మలువంగా స్వర్గమొద్దనంటావు
కండ్లు లొట్టల్లున్నా... కాళ్ళు దగ్గరికైనా
సూపుతోని సుర్కబెట్టి సుక్కలు జూపించేవు ॥తాతా॥

పసుల గాసె పోరగాళ్ళ మెసలకుంట దిడుతావు
వరం సుట్టు దిరిగి సూసి మాటలు జాడిస్తావు
తుంగును జేసియ్యమంటే కమ్మాకును జుడుతావు
కంపముల్లు గుచ్చి దాన్ని శంఖమూదమంటావు
కండ్లు లొట్టల్లున్నా... కాళ్ళు దగ్గరికైనా
సూపుతోని సుర్కబెట్టి సుక్కలు జూపించేవు ॥తాతా॥

తెలంగాణ మట్టిబిడ్డ గోస జూడమంటావు
ముచ్చటెత్తితే సాలు నైజాము కెల్తావు
ఫిరంగులు ఎత్తినోల్లు తుటాలను బేల్చినోల్లు
ఏనెగుండ్లు పలుగురాళ్ళు వడిసెల రాళ్ళిసిరిననీ
కండ్లు లొట్టల్లున్నా... కాళ్ళు దగ్గరికైనా
సూపుతోని సుర్కబెట్టి సుక్కలు జూపించేవు ॥తాతా॥

41

అంబటి వెంకన్న పాటలు