పుట:Ambati Venkanna Patalu -2015.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓ తాటిచెట్టు..



వందనాలు తల్లీ నీకు ఓ తాటి చెట్టు
నీ కన్నబిడ్డలైనట్టి గౌడన్నల గనిపెట్టు
బతుకుదెరువు నీవంటూ... నీ పంచన జేరినం
కంటమయ్య సాక్షిగ నీ పండుగ జేసినం ॥వందనాలు॥

సుక్కనీరు బోయకున్న పచ్చగ మొగి బుట్టంగ
కల్పవృక్షమై ఎదిగి మమ్ముల గాపాడినవ్
మండూటెండల్లో మాడి
సొరగొన్న గొంతులకు
కల్లుధారబోసి నీవు ముంజలు దినిపించినవ్
పడుపువృత్తి మనదంటూ పరాశికాలాడినా
కోపమంత దిగమింగి నవ్వే బలమిచ్చినవ్ ॥వందనాలు॥

మోకు ముస్తాదు గట్టి వస్తాదుగ బయలెల్ల
మువ్వల సప్పుళ్ళ గల్లు అడివంతా జల్లు
తాడుమీద మోకేసి
ఎత్తుకు నువ్వెగబాక
అడవినే జయించినా వీరునిలా గనిపిస్తవ్
గౌడవృత్తి దారుడ నీ గుండె ధైర్యము
సర్వాయి పాపన్న శౌర్యమే నీదన్నవ్ ॥వందనాలు॥

ప్రభుత్వాలు మనమీదపగబట్టి పన్నుబెంచ
కల్లుగీత కార్మికుల సంఘమెదురు నిలిచెనే
కమ్మకట్టు కులమంటూ
ఎగతాలి జెయ్యంగ
కాదు కాదు కాదంటూ కలిసి ఒకటిగుండాలే
మనహక్కుల సాధనకై ఉద్యమాలు జెయ్యంగ
గౌడవృత్తిదారుడ నీ గీసకత్తి పదును బెట్టు ॥వందనాలు॥

అంబటి వెంకన్న పాటలు

40