పుట:Ambati Venkanna Patalu -2015.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడుగేసిన దిక్కుల్లో



అడుగేసిన దిక్కుల్లో గంపలు గదిలిన తోవల్లో
నక్కలు గలిసిన జాడేలేదు డొక్కలు మాడని రోజే లేదు
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా
అడుగేసిన దిక్కుల్లో ఆటేసిన కుంటల్లో
నక్కలు గలిసిన జాడేలేదు డొక్కలు మాడని రోజే లేదు
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా ॥అడుగేసిన॥

వల ఇసిరీ ఏరిస్తే ఈత పురుగులే రాలినయి
ఏసారి ఏసిన ఆటుకు కంపకొర్రులే జిక్కినయి
ఈతాకు ఎలుమై ఈగిన కన్నీటి పొలకలాగవు
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా
ఒండుల ఇరికి వాగులు దిరిగి గండాలు దాటెదమా
సోకం శేది బాధలు ఈది ఎన్నాళ్ళు బతికెదమూ
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా ॥అడుగేసిన॥

ఎసరు మసిలే పొద్దెక్కే నిప్పురాజెయ్యనె లేదు
బండలు బగిలే పొద్దంతా నడినెత్తిన కుదురై తిరిగే
సుట్టున్నా గూడాలన్నీ కాళ్ళల్లో కలె దిరిగినయి
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా
రోజులు దిరిగిన కుందెన కందక ముప్పొద్దులు గడిసేనా
అర్కతి బర్కతి ఏదీలేని సంసారం ఎదిగేనా
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా ॥అడుగేసిన॥

అంబటి వెంకన్న పాటలు

24