పుట:Ambati Venkanna Patalu -2015.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవరు చేరదీస్తారు...



ఎవరు చేర దీస్తారు మమ్మెవరు ఆదుకుంటారు
కాళ్ళు జేతుల కేళ్ళులేవు కన్నవాళ్ళకు ఊళ్ళులేవు
ముక్కు మూతి మూడు దెర్లు
ముఖం జూడ కోతిరూపు
డోలు గజ్జెలు వీధులల్లో మోగుతున్న గుండెడప్పులు
                                                                       ॥ఎవరు॥
మనుషులల్లో ఉన్న మేము ఎన్నడట్ల ఉండమైతిమి
మాటలాడ జూస్తే మేము ఒక్కరన్న పలకరైతిరి
మనసులోతును జూడకుంట
కుష్ఠువ్యాధని ఈసడిస్తిరి
కరుణలేని ఈ సంఘం మనదా
దేవుడా నువ్ జూడవా
                                                                 ॥ఎవరు॥
మేంజేసిన పాపము లేదు ఎవడు బెట్టిన శాపము
మేం మొక్కని గుళ్ళేలేవు ఎటు బోయెను దైవము
మా మొరను ఆలకించని మీరు
ఎన్ని జన్మలు ఎత్తితె నేమి
గ్రహణ మింక మము వీడిందా
దేవుడా ఓ దేవుడా

ధరిజేర మీకు భయమూ
అది అంటదు ఇంకా నయమూ
మము ఓదార్చిన మా అమ్మా ఏ లోకం జేరిందో
మము కనికరించినా ప్రభువు శిలువనే మోస్తుండో

(కుష్టు వాళ్ళను ఎంతో ఆప్యాయంగా చేరదీసిన 'అమ్మ', 'మదర్‌థెరీసా'కు)

అంబటి వెంకన్న పాటలు

132