పుట:Ambati Venkanna Patalu -2015.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎండలో ఎండివాన



ఎండలో ఎండివాన ఏమిటే చిన్నదానా
గువ్వలా ఎగిరిరాన గుండెలో ఒదిగిపోనా
చినుకులే ముత్యమల్లే తడిపెనా చిన్నవాడా
చింతలే తీరిపాయే చిందులే ఆపలేవా
నా ఆపతి సోపతి నువ్వేగా సిన్నోడా కోరుకున్నోడ ॥ఎండలో॥

మనసున బుట్టిన ఆశకు నే కనుగొన్నాలే భాషను
కన్నుల కందని మాటలే నాచేతులు చేసే సైగలు
మీసాన్ని మెలిబెట్టి రోషాన్ని పెంచేసి
ఏదేదొ గిలిగింత ఎదలోన పులకింత
ఏమి లేదంటూనే తొంగి చూస్తుంటావు
సిన్నోడ కన్నెగిజిగాడ ॥ఎండలో॥

రివ్వున వీచిన గాలికి నే పువ్వులా నిన్ను చేరితే
చెంగున దూకే లేడిలా నా కొంగును నీకై పంపితే
కను బొమ్మ లెగరేసి, కండ్లెర్రజేసేసి
కారాలు మిరియాలు కౌగిట్లో దంచేసి
కాదు కాదంటూనే కసిరిచ్చి పోతావు
సిన్నోడ వెన్న దొంగోడ ॥ఎండలో॥

తళుకున మెరిసిన మెరుపుకు నే సుట్టుకుంటే నిన్ను తీగలా
ఒడ్సిపట్టె ఒడుపు నీకున్న సూడవైతివి నన్ను కడగంట
మబ్బల్లె నీ వెంట మైమరచి వస్తున్నా
మదిలోని కోపాన్ని పారేసి వస్తున్నా
మాపటేలా నిన్ను వెన్నంటి నేనుంటా
సిన్నోడ దోసుకున్నోడ
రే రాజులా కొండపైన నీ గుండెలో చేరిపోనా..

123

అంబటి వెంకన్న పాటలు