పుట:Ambati Venkanna Patalu -2015.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కదలాలె-కదలాలె



కదలాలె కదలాలె ఎనకా బడ్డోళ్ళమే
ఏడెన్కల నించెళ్ళాలె అణచ బడ్డోళ్ళమే
మొత్తమంత కదలాలె దండుగట్టి నిలవాలె
పూలె పాటల బాటల్లోన తొలి అడుగులు వెయ్యాలి ॥కదలాలె॥

ధరణిలోని ఆ దగాకోర్లతో రాయబడెను మనుధర్మ శాస్త్రము
బాపనోల్ల ఆ బందికానలో బాధలెన్నో పడ్డవాళ్ళము
జీవితాన వెలుగే లేకా
అనిగి మనిగి మసిలే మనమూ ॥కదలాలె॥

చతుర్వర్ణ పరిపాలనతో సొమ్మసిల్లి పోయిన వాళ్ళం
చరితలోని అబద్దాలనీ కర్మా అని మోసిన వాళ్ళం
అగ్రవర్ణ అధికారంలో
అట్టడుగున జేరిన మనమూ ॥కదలాలె॥

నవాబుల రాజ్యంలోన భికారులై బతికిన వాళ్ళం
తెల్లదొరల కాలంలోన అటీటుగా అందరమొకటై
దొరలు భూస్వాముల నాటి
శెర నేటికి దీరని మనమూ ॥కదలాలె॥

మును ముందుకు బోలేక మూతి ముడుసు కుంటున్నం
ఎనకడుగు వెయలేక నీరుగారి పోతున్నం
అటీటు గాని బతుకుల్లోన
తొలిపొద్దుకు తెరలు దీయగా ॥కదలాలె॥

111

అంబటి వెంకన్న పాటలు