పుట:Ambati Venkanna Patalu -2015.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జోతిబాపూలే



జోతిబాపూలే... జోతిబాపూలే....
జోతి బాపూలే.... జోతి బాపూలే
మహాత్ముడంటే నువ్వే మా బాపూజీ నువ్వే
గుణాత్ముడంటే నువ్వే పరమాత్ముడంటే నువ్వే ॥జోతిబా॥

వేదాలు, పురాణాలు విదిలించిన జూలులోన
కట్టుబానిసత్వంలో గంజిలోన ఈగోలే
అట్టడుగుకు తొక్కబడి నిమ్నజాతిగా మారి
హరిజనులు గిరిజనులు సూదరోల్ల మైపోతిమి ॥జోతిబా॥

కుల బలము గలిగినోల్ల సేతికింద బానిసలై
ఎట్టిపనిల మగ్గుతున్న ఒట్టిమట్టి బతుకులోన
పౌరుషమై వచ్చినువ్వు పడిగెత్తి నిలిసినవ్
బుసగొట్టుడు నేర్పించి మెసలకుంట జేసినవ్ ॥జోతిబా॥

కమ్మనైన పాటలోన తియ్యని పదమోలే
రాగాన్ని మూటగట్టి తిరిగే రాజ్యంలోన
అక్షరమై వచ్చి నువ్వు లక్ష్యమేదో చూపించి
చక్కని క్రమశిక్షణతో సదువులెన్నో జెప్పినవ్ ॥జోతిబా॥

అంధకార మలుముకున్న చీకటి రాజ్యంలోన
దట్టమైన అడవిలోన మోదుగు పువ్వోలే
జ్యోతిలా వెలిగి నువ్వు జాతిని మేల్కొల్పినవ్
అజ్ఞానం తొలగించి ప్రగతి బాట నడిపినవ్ ॥జోతిబా॥

109

అంబటి వెంకన్న పాటలు