పుట:Ambati Venkanna Patalu -2015.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రిక్కబెట్టిన సాలు చెంగు చెంగున పసులు
ఎకరాల కెకరాలు అలుపులేక సాగి
అంకెబెట్టక నడ్సురా ఓరన్న
అనుకమైన ఎడ్లురా మాయన్న
పొంటెకష్టం జేసురా ఓరన్న
ఒంటరోని వెట్టరా మాయన్న
ఒంటరోని వెట్టరా.... ॥అన్నన్న ఓయన్న॥

దుక్కిదున్నిన సాలు పచ్చపచ్చని సేలు
పూతబూసిన నేల కాతగాసిన సేను
నీ కోసమే సూసురా ఓరన్న
నీమీద గోలాడురా మాయన్న
నీ పాదాలు ముద్దాడురా ఓరన్న
పానాలు నిలిపేనురా మాయన్నా
పానాలు నిలిపేనురా.... ॥అన్నన్న ఓయన్న॥

తొమ్మిదేండ్ల శెని పోనే పోయిందని
తోకలెత్తి మనము చెంగల్లో పిట్టంటే
మళ్ళీ మొదటి కొచ్చెరా ఓరన్నా
మార్పు లేక పాయెరా మాయన్నా
ఎదిరించి నిలువంగా ఓరన్న
పోరాటమే దిక్కురా మాయన్నా
పోరాటమే దిక్కురా.... ॥అన్నన్న ఓయన్న॥

అంబటి వెంకన్న పాటలు

102