పుట:Aliya Rama Rayalu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కొని పంపివేయవలసివచ్చెనో యారయరైరి? రామరాయనిచే లంచములుతినినప్రభువులు నిస్సహాయుడై యున్నవానిని రామరాయలకు నప్పగించక, సలకముతిమ్మయసామ్రాజ్యములోనిరత్నరాసులను నుగ్గునూచముగావించునపుడును, ఏనుగులు గుఱ్ఱములుమొదలగువానితోకలుకోయించునపుడును మౌనము వహించి యేలయూరకొనవలసివచ్చెనో యదియును విచారింపరైరి? అనేక సందర్భములలో 'ఫెరిస్తా, కోరియా, కోయుటో'లు వ్రాసినవ్రాతలలో శుద్ధాబద్ధములగు విషయములు పెక్కులు గలవని యొకప్రక్క నొప్పుకొనుచు నీప్రాధాన్యవిషయమున దదితరు లైకకంఠ్యముగా వ్రాసిన వానికి భిన్నములుగా గన్పట్టినను వీరివ్రాతలయందే సత్యముగల దని విశ్వసించుటకు బ్రభలహేతువు లేవిగలవో వానిని వివరింప నక్కరలేదా? చరిత్రకారులు మున్ముందుగా సమకాలికులై సమీపముననుండి వ్రాసినవిషయముల కెక్కువప్రాధాన్యమీయవలసి యుండును. పిమ్మట సమకాలికులు కానివారివ్రాతలను సమకాలికులు వ్రాసిన వ్రాతలతో బోల్చుకొని సత్యచరిత్రమును దీయుటకు బ్రయత్నింపవలయును. అట్లుగాక సమకాలికులయినవారు కవులయినంత మాత్రముచేత వారు చెప్పినవిషయముల నమ్మరాదని త్రోసిపుచ్చి సమకాలికులుకాని వారొకరికొకరికి బొందికలేక పరస్పరవిరుద్ధముగా వ్రాసిన వ్రాతలనమ్మి చరిత్ర మల్లబోయిన బరిహాసమాత్రులగుట నిశ్చయము. అచ్యుతదేవరాయని యాస్థానము