పుట:Aliya Rama Rayalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారలకు తిరుపతివెంకటాద్రీశుని కృపాతిశయముచే కుమారుడుపుట్టిన నతనికి వేంకటాద్రి యనిపేరుపెట్టి యచ్యుతదేవరాయలు తాను పట్టాభిషిక్తు డయినవెనుక నాతనియువరాజుగ జేసె ననియు వ్రాయబడి యున్నది. దీనినిబట్టి అచ్యుతదేవరాయలకు మంత్రులుగనున్నవారు సలకరాజుపుత్త్రులును మఱదులు నగుపెదతిమ్మరాజు, చినతిమ్మరాజు ననుసోదరులని స్పష్టముగా జెప్పబడియున్నది.[1] విదేశీయు లయినచరిత్రకారుల కీభేదము తెలిసికొన సాధ్యముగాక యీమంత్రిపదవులను రామరాయలకును నాతనితమ్ము డగుతిరుమలరాయనికిని ముడివెట్టి యేమో వ్రాసి యున్నారు. వారివ్రాతలు విశ్వాసపాత్రములు గావు. కాబట్టి యచ్యుతదేవరాయలకాలమునగూడ నంతప్రాముఖ్యలుగ నున్నటుల గనుపట్టదు.

చిన్నవేంకటాద్రిపట్టాభిషేకము

అచ్యుతదేవరాయలు విద్యానగరమున బట్టాభిషిక్తుడయినపుడే యతడు సలకరాజపుత్త్రిక యగువరదాంబికను బట్టమహిషిగను, ఆమెపుత్రు డగుకుమార వేంకటాద్రిని యువరాజుగను జేసె నని రాజనాథకవి విరచిత మగునచ్యుతరాయాభ్యుదయ మనుగ్రంథమున దెలుపబడియున్నది.

  1. సతతవిరచితానేకదానయో: అసాధారణభుజాపధానయో: అఖిలలోకకృతబహుమానయో: తిరుమలరాజాభిధానయో: ఉభయయో: ప్రధానయో అపరజావరదాంబికాభిదానావర వర్ణినీ..... తపోవనముపగతవతీ