పుట:Aliya Rama Rayalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణమున వివరించియె యున్నాను. ఇట్లవక్రపరాక్రమంబున దండ్రితాతలు పరిపాలించిన మండలము నలియరామరాయలుగూడ బరిపాలించుట పితృపారంపర్యపుసత్వముగా సంభవించినదేగాని యొకయనామకచరిత్రకారుడు దెల్పినటులు మహమ్మదుకూలీకుతుబ్షా విజయనగరసామ్రాజ్యముపై దండెత్తివచ్చి కృష్ణదేవరాయలను జయించి తనహిందూసామంత కుటుంబములోనివాడయిన రామరాజు నధికారిగానియమించిన సత్వమువలన సంభవించినది గాదు. ఇతనికి బూర్వముననే అలియరామరాయలతండ్రి యామండలమును బరిపాలించుచున్నట్టు కందనోలుపురశాసనము దెలుపుచుండెను గదా. మహమ్మదుకూలీకుతుబ్షా కందనోలుమండలమును కృష్ణరాయల సామ్రాజ్యము నుండి గైకొనినమాటవాస్తవమని విశ్వసింతమన్నను తనవారినెవ్వరిని తురకసైన్యములతో నచటనధికారిగ నుంచుట కిష్టపడక కృష్ణరాయలకు మంత్రిగనుండినవానికుమారు డగు రామరాయల నధికారిగ నియమించుట కిష్టపడెనని యెట్లువిశ్వసింప దగును? ఒకవేళ నితడు కృష్ణరాయలకు ద్రోహియై మహమ్మదుకూలీకుతుబ్షాకు లోపడినవాడై యాయనామక చరిత్రకారుడు వక్కాణించినట్లు తనదేశమును ఆదిల్‌షాహ చూఱగొని తన్ను దఱిమివేసి స్వాధీనపఱచుకొనినప్పు డేమియు జేయంజాలక తన ప్రభువుతో మొఱవెట్టుకొనగా నాతడు 'చీ! పాఱుబోతా!' నారాజ్యముననుండ దగవనివెడలనడచిన మాట వాస్తవమని విశ్వసింతుమన్నను, తనకు ద్రోహియై