పుట:Aliya Rama Rayalu.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ii

కౌశలమున దన్మంత్రి శేఖరుడగు తిమ్మరుసును మించిన ప్రతిభాశాలిగాని సామాన్యుడు గాడు. అట్టి మహనీయుని సచ్చీలమును చదువరులు గర్హించు విధముగా గ్రంథమంతయు వ్రాయబడినది. ఇట్టి సందర్భములందు వీరు వెల్వరించిన యభిప్రాయములు వేఱ్వేఱు ప్రదేశములయందు పరస్పర విరుద్ధములుగ నున్నవి. మరియు సత్యవిరుద్ధములు కూడనై యున్నవి. వీని సత్యమును దెలిసికొనగోరు చదువరుల కుపయోగకరముగా నుండునటుల సహేతుక విమర్శనలతో గూడిన యీ జీవిత విమర్శ గ్రంథమును వ్రాసితిని. సదాశివరాయలను 13 సంవత్సరములు కారాగృహమున నుంచి రామరాయలు పట్టాభిషిక్తుడై విజయనగర సామ్రాజ్యమును బరిపాలించిన స్వార్థపరుడని మోసగాడని తెలిపిన విధానమంతయు వట్టి నిరాధారమైన సిద్ధాంతమని యీచిన్న జీవిత గ్రంథము ఋజువు చేయుచున్నది. ఇంతకన్న నధికముగ వ్రాయుట కిష్టపడక వీని గుణదోషములను గ్రహింప జదువరులకే విడిచిపెట్టుచున్నాడను. నేనస్వస్థగానున్న కాలమున నిట్టి విమర్శ గ్రంథమును వ్రాయుటయు, నచ్చొంత్తించుటయు సంభవించినందునను, అచ్చుప్రతులను స్వయముగా దిద్దుకొనుటకు సాధ్యపడనందునను నందందు నచ్చుతప్పులు పడియున్నవి. వానిని సాధ్యమగునంత వఱకు నేర్చికూర్చి శుద్ధపత్రమున సవరించితిని. ఈ గ్రంథమును వ్రాయుటకు దోడ్పడిన గ్రంథములను పత్రికా లేఖనములను నందందు బొందుపఱచియే యున్నాను. ఏతత్గ్రంథకర్తలకును, వ్యాసలేఖనకర్తలకును నాకృతజ్ఞతావందనములను దెలుపుకొనుచున్నాడను.

గ్రంథకర్త.