పుట:Aliya Rama Rayalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని వర్తింప గలదు. వారికి మృత్యుప్రచు డనునర్థముననే 'హొసబిరుదురగండ' బిరుదము వర్తించు ననిస్ఫురింపను. రాయరణరంగమును భీభత్సముచేయువానికే 'రాయరణరంగభీభత్స' యనుబిరుదమును, రాయనిరాహుత్తులకు మృత్యుప్రదుడగువానికే 'రాయరాహుత్తురగండ' బిరుదమును వర్తింపగలవు. మఱియు, 'సకలనరదేవచూడామణి' యనుబిరుదము స్వతంత్రు డైనరాజునకు వర్తించునదిగాని యొకసామంతప్రభువునకు వర్తింపరానిది. అట్టిబిరుదము సోమదేవునకు గలదు. క్రీ. శ. 1347 వ సంవత్సరమున 'హసన్‌గంగూ' బహమనీరాజ్యమును స్థాపించుటకు బూర్వము సోమదేవరాజు కళ్యాణపురమును గాని, ఆనెగొంది రాజధానిగా నొకమహాసామ్రాజ్యమును నిర్మాణము జేయవలయు ననిసంకల్పించి వీరాగ్రగణ్యుడై కృష్ణాతుంగభద్రానదీ మధ్యస్థభూభాగము వీరక్షేత్రముగా జేసికొని విహరించినది సత్యమని యొప్పుకొనక తప్పదు.

క్రీ. శ. 1336వ సంవత్సరమున విద్యానగరమునిర్మింపబడినట్లును, దానిని రాజధానిగా జేసికొని మొదటిహరిహరరాయలు పరిపాలనము చేసినట్టును, మొదటిహరిహర, బుక్కరాజుల కాపలూరు, ఎరగుడిపాడు శాసనములవలన దెలియుచున్నది. తుంగభద్రానది కుత్తరభాగము నందలి దేశమును సోమదేవరాజును, దక్షిణభాగమును మొదటిహరిహరరాయలును నేకకాలమున బరిపాలించుచుండిరి. సోమదేవరాజు తుంగభద్రకు దక్షిణమున నుండుదేశమును బరిపాలించి యుండలేదు.